విశాఖ పొలిటికల్(పరిపాలన)రాజధాని..!


Ens Balu
0
Visakhapatnam
2022-05-17 05:11:54

విశాఖపట్నం పరిపాలనా రాజధానా..? పొలిటికల్ రాజధానా..? అంటే పొలిటికల్ రాజధాని అనే సమాధానం వస్తోంది ప్రతీనోటా..అవును నూతన జిల్లాల విభజన తరువాత  ఆంధ్ర ప్రదేశ్ లో పెద్ద జిల్లాల సరసన ఉండే విశాఖ ఇపుడు అతి చిన్న జిల్లాగా మారిపోయింది. కేవలం ఐదు నియోజకవర్గాల పరిధి మాత్రమే. ఇంకా కరెక్టుగా చెప్పాలంటే రూరల్ జిల్లా లేని జిల్లాగా మారిపోయిన జిల్లా. రాష్ట్రానికి ఆర్ధిక రాజధానిగా వున్న విశాఖను అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా(ఎగ్జిక్యూటివ్ కేపిటల్) రాజధానిగా చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అదే నిర్ణయాన్ని కోర్టులో ఉపసంహరించుకుంది. దీనితో పరిపాలనా రాజధాని ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. ఎలాగూ పరిపాలనా రాజధాని కాలేదు కాబట్టి విశాఖపట్నం జిల్లా పొలిటికల్ రాజధానిగా మారిపోయింది. అవునండీ ఈ విషయాలను బేరీజు వేసుకుంటే మీరు కూడా విశాఖపట్నం పొలిటికల్ రాజధానిగా మాత్రమే లెక్కగడతారు. రాష్ట్రంలో నూతన జిల్లాలు ఏర్పడినా జిల్లా పరిషత్ లు మారలేదు.  కొత్తజిల్లాల్లో కార్పోరేషన్ స్థాయి జిల్లాలు ఉన్నా కొత్తగా కార్పోరేషన్ లు ఏర్పడలేదు. ఏమీ లేకున్నా అంతర్జాతీయ విమానాశ్రయం, పోర్టు, తూర్పునావికాదళం, కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఉండటంతో విశాఖపట్నం కాస్త పొలిటికల్ రాజధాని అయిపోయింది. విశాఖపట్నం జిల్లా మీదుగానే అన్ని జిల్లాలకు ప్రయాణించే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, రాష్ట్ర అధికారులు ప్రయాణించడానికి, ట్రాన్సిట్ హాల్టులు చేయడానికి.. అలా చేసిన సమయంలో రాజకీయం చేయడానికి మంచి వేదికగా మారిపోయింది. ఒకప్పుడు విశాఖలో పనిచేయడానికి అటెండర్లు దగ్గర నుంచి ఐఏఎస్ లు వరకూ క్యూ కట్టేవారు. నూతన జిల్లాలు ఏర్పడిన తరువాత రాష్ట్రంలో విశాఖ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. చిన్నజిల్లాగా మారిపోవడం, ఆపై అనునిత్యం రాజకీయనాయకులు, రాష్ట్రస్థాయి అధికారులు, త్రివిధ దళాల అధికారుల రాకపోకలు వారికిచ్చే ప్రోటోకాల్ కే సమయం మొత్తం అధికారులకు ప్రజాప్రతినిధులకు గడిచిపోతుంది. విశాఖలోని అన్నిశాఖల అధికారులు మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర అధికారులు నిత్యం రాకపోకలు సాగిస్తుండటంతో పొలిటికల్ ప్రోటోకాల్ కూడా అధికంగా మారిపోయింది. దీనితో ఒకప్పుడు పరిపాలనా రాజధాని అవుతుందనుకున్న విశాఖపట్నం నేడు పొలిటికల్ రాజధానిగా రూపాంతరం చెందుతోంది.

రాష్ట్రప్రభుత్వం విశాఖపట్నం జిల్లాను పరిపాలనా రాజధాని చేయాలనుకున్నా..వారి ప్రమేయం లేకుండానే పొలిటికల్ రాజధానిగా మారిపోయింది. రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలను అయితే విభజన చేసింది తప్పితే రాజకీయాన్ని విభజన చేయలేకపోయింది. కాదు కాదు రాజకీయనాయకులు తీరుమార్చులేకపోతున్నారు. అధికారికంగా జిల్లాలు విభజన జరిగినా.. ఇంకా విశాఖలోనే అన్ని పార్టీలకు చెందిన పార్టీ కార్యాలయాలు ఉన్నాయి. వాస్తవానికి పక్కజిల్లా నాయకులైనా.. ఇదే విశాఖ వేదికగా కార్యక్రమాలు చేపట్టడం ఇటు పార్టీ కేడర్ కు, ప్రజలకు ఇబ్బందిగానే ఉంటోంది. ఇక మీడియా విషయానికొస్తే విశాఖ కేంద్రంగానే కార్యకలాపాలన్నీ సాగిస్తున్నాయి. దీనితో రాజకీయపార్టీల నేతలందరూ ఏ విషయం చెప్పాలన్నా విశాఖ రావాల్సి వస్తుంది. ఇక్కడే ప్రెస్ మీట్ లు పెట్టాల్సి వస్తుంది. ఇలా విశాఖపట్నం పరిపాలనా రాజధాని నుంచి పొలిటికల్ రాజధానిగా మారిపోయి అన్ని వ్యవస్థలను చిన్నాభిన్నం చేసేసింది. ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిపోతుంది. ప్రస్తుతం ప్రభుత్వం కూడా తాముచేసిన అభివ్రుద్ది ప్రజలకు చెప్పి, మళ్లీ అధికారం కోసం, ప్రత్యర్ధులను తలదన్నే విధంగా కార్యకలాపాలు చేపడుతుంది. ఈ తరుణంలో మూడు రాజధానుల విషయం అటకెక్కిపోయింది. ఆ ఊసు ఇపుడు ఏ రాజకీయపార్టీ కూడా ఎత్తడం లేదు. అందరూ 2024 ఎన్నికలకు కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. దీనితో విశాఖను అధికారుల నుంచి ప్రజాప్రతినిధులు, అన్ని రాజకీయపార్టీలు పొలిటికల్ పరిపాలన రాజధానిగానే వినియోగించుకుంటూ తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. చూడాలి ఈ ప్రభుత్వంలోనే విశాఖ పరిపాలనా రాజధాని అవుతుందా..లేదంటే వచ్చే ఎన్నికలకు విశాఖను పరిపాలనా రాజధానికగా ఆశచూపి రాజకీయం చేస్తారా అనేది..!?