విద్యుత్ రంగంలో అక్రమాలపై ఉక్కుపాదం మోపాలని ఇంధనశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజిలెన్స్ అధికారులను ఆదేశించారు. సచివాలయంలో విద్యుత్ విజిలెన్స్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ విజిలెన్స్ విభాగం పటిష్టంగా ఉంటేనే విద్యుత్ చోరీలు, దుర్వినియోగం, విద్యుత్ నష్టాలను నియంత్రించ గలుగుతామని తెలిపారు. సీఎం వైయస్ జగన్ విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టేందుకు, ప్రజలకు, రైతులకు, పరిశ్రమలకు నాణ్యమైన విద్యుత్ ను అందించేందుకు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు. ఒకవైపు రైతులకు ఉచిత విద్యుత్ ను అందించడం, మరోవైపు వినియోగదారులకు మెరుగైన విద్యుత్ ను సరఫరా చేరేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఈ క్రమంలోనే విద్యుత్ సరఫరా, పంపిణీలో నష్టాలను పూర్తిస్థాయిలో తగ్గించుకునేందుకు అధికారులు దృష్టి సారించాలని కోరారు. అదే క్రమంలో అక్రమ విద్యుత్ వినియోగం, చౌర్యం, అనుమతి లేకుండా అధిక లోడ్ లను వినియోగించుకోవడం, మీటర్ల ట్యాంపరింగ్ తదితర అక్రమాలపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలని కోరారు. గృహ వినియోగంతో పాటు పారిశ్రామిక వినియోగంపై కూడా అధికారులు తనిఖీలు నిర్వహించాలని కోరారు. తనిఖీల ప్రక్రియ నిరంతరం కొనసాగాలని సూచించారు.
సీఎం వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యుత్ రంగంపై ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి అన్నారు. 2019-20లో విద్యుత్ సరఫరా, పంపిణీలో 13.02 శాతం నష్టాలు ఉంటే, 2020-21 నాటికి వాటిని 9.83 శాతంకు తగ్గించేందుకు ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలే కారణమని అన్నారు. ఈ నష్టాలను మరింతగా తగ్గించాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు. ఐఆర్డిఎ మీటర్లను బిగించడం, ఓవర్ లోడ్ సెక్షన్ లలో అదనంగా ఫీడర్లను ఏర్పాటు చేయడం, అదనపు లోడ్ డిమాండ్ ఉన్న చోట్ల కొత్త డిటిఆర్ లను ఏర్పాటు చేయడం, విద్యుత్ చౌర్యంపై అనుమానం ఉన్న ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేయడం వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. అధికారులు ఇన్నోవేటీవ్ గా ఆలోచించాలని, మొక్కుబడిగా పనిచేస్తే కుదరదని స్పష్టం చేశారు. విద్యుత్ అక్రమాలను అరికట్టేందుకు విజిలెన్స్ అధికారులతో పాటు జిల్లాల్లోని పోలీస్ యంత్రాంగం సహకారం కూడా తీసుకోవాలని, అందుకోసం అవసరమైతే జిల్లా ఎస్పీలతో సంయుక్త సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.
విద్యుత్ మీటర్లపై తెలుగుదేశం పార్టీ రైతులను తప్పుదోవ పట్టిస్తోందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఏటా ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం సబ్సిడీగా పదివేల కోట్ల రూపాయలను విద్యుత్ సంస్థలకు చెల్లిస్తోందని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 లక్షల వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. సీఎం వైయస్ జగన్ వ్యవసాయానికి అందించే విద్యుత్ నాణ్యతతో ఎటువంటి అంతరాయాలు లేకుండా ఉండాలని అధికారులకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారని అన్నారు. ఇదే క్రమంలో మీటర్లను బిగించడం ద్వారా వాస్తవానికి వ్యవసాయానికి ఎంత విద్యుత్ వాడుతున్నామో నికరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో 28 వేల వ్యవసాయ కనెక్షన్ లకు ప్రయోగాత్మకంగా విద్యుత్ మీటర్లు బిగించడం ద్వారా 33 శాతం తక్కువగానే విద్యుత్ వినియోగం జరుగుతున్నట్లు తేలిందన్నారు. రాష్ట్రం మొత్తం కూడా వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లు బిగించడం వల్ల ప్రభుత్వం వ్యవసాయ విద్యుత్ కు ఇస్తున్న సబ్సిడీ పదివేల కోట్ల రూపాయలలో 33 శాతం అంటే దాదాపు 3500 కోట్ల రూపాయల వరకు ఆదా అవుతుందని అన్నారు. ఈ సొమ్మును ప్రజలకే సంక్షేమం, అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చని అన్నారు. వ్యవసాయ కనెక్షన్ లకు మీటర్లను ఏర్పాటు చేసి, రైతులు వినియోగించుకున్న విద్యుత్ కు చెల్లించాల్సిన మొత్తాన్ని ప్రభుత్వమే భరిస్తుందని, ఆ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాలకే జమ చేస్తుందని అన్నారు. రైతులే డిస్కం లకు చెల్లింపులు చేస్తారని, దీనివల్ల రైతుల్లోనూ జవాబుదారీతనం పెరుగుతుందని తెలిపారు. ఇందులో రైతులకు జరుగుతున్న నష్టం ఏమిటో ప్రతిపక్షం చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసే ప్రతిపనిని వ్యతిరేకించడం, మంచిని అడ్డుకోవడమే చంద్రబాబుకు అలవాటుగా మారిందని విమర్శించారు.
2021-22 ఆర్థిక సంవత్సరంలో డిపిఇ వింగ్ రాష్ట్ర వ్యాప్తంగా 5,31,140 విద్యుత్ సర్వీసులను తనిఖీ చేసినట్లు అధికారులు వివరించారు. దీనిలో 59.583 కేసుల్లో అక్రమాలు వెలుగుచూశాయని అన్నారు. ఈ కేసుల్లో 15,139 విద్యుత్ చౌర్యం కింద నమోదయ్యాయని తెలిపారు. అక్రమాలకు పాల్పడిన కేసులకు సంబంధించి రూ.131.90 కోట్ల రూఆపయలను జరిమానగా విధించడం జరిగిందని, దీనిలో 65.49 కోట్ల రూపాయలను వసూలు చేశామని తెలిపారు. ఒక్క విద్యుత్ చౌర్యం కేసుల ద్వారానే రూ.10.66 కోట్లు వసూలయ్యాయని పేర్కొన్నారు. గత ఏడాది మొత్తం 189 ఫిర్యాదులపై విజిలెన్స్ అధికారులు 137 కేసులు నమోదు చేశారని, మరో 52 కేసులకు సంబంధించి కేసులు పెండింగ్ లో ఉన్నాయని అన్నారు. ఈ సమావేశంలో ట్రాన్స్ కో విజిలెన్స్ జెఎండి మల్లారెడ్డి, డైరెక్టర్ (హెచ్ఆర్ & ఐఆర్) సయ్యద్ రఫీ, సివిఎస్ వి టి. పనసరెడ్డి, అడిషనల్ ఎస్పీ లావణ్య లక్ష్మి, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.