ప్రొబేషన్ గడువు భారీగా పెంచేసినా.. ప్రసూతి సెలవులు నిబంధన తప్పలేదు..


Ens Balu
2
Tadepalli
2022-05-19 03:32:53

‘మీ ఇంటికొస్తే ఏమిస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు’ అన్న సామెత మీకు గుర్తుందిగా.. సరిగ్గా ఆ సామెతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో  ఒక్కముక్క కూడా మిగిల్చకుండా పూర్తిగా వినియోగించుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ గడువు రెండేళ్లు పూర్తయిన తరువాత కూడా అదనంగా 9 నెలలు పెంచేసినా, నిబంధనల ప్రకారం ఆ సమయంలో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి ప్రభుత్వ నిబంధనలను మాత్రం పక్కాగా అమలు చేసింది.  ప్రసూతి సెలువులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు సంబంధించి సెలువులు ఇచ్చిన ఆరు నెలలకు జీతాలు ఇచ్చినా.. ఆరోజులన్నీ లెక్కగట్టిన ఆ తరువాత మాత్రమే సర్వీసు రెగ్యులైజేషన్ కు డాక్యుమెంటేషన్ ప్రక్రియ చేపట్టింది. దీనితో ఉద్యోగులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. కోవిడ్ సమయం నుంచి నేటి వరకూ రెండవ శనివారం, ఆదివారం, సాధారణ సెలవులు అని తేడా లేకుండా అదనపు పనిగంటలు తమతో చేయించుకున్న ప్రభుత్వం అదనంగా 9నెలలు సర్వీసు ప్రొబేషన్  పెంచడం ద్వారా పేస్కేలు మొత్తం సుమారు రూ.లక్ష వరకూ కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇంత జరిగినా సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో మాత్రం సరైన క్లారిటీ ఇంకా రాలేదని వాపోతున్నారు. దేశంలో ఎక్కడా, ఏ రాష్ట్రప్రభుత్వమూ చేయించని విధంగా తమతో 33 నెలల పాటు ప్రొబేషన్ పీరియడ్ లో విధులు చేపట్టేలా చేసి తమకు కేవలం రూ.15వేలు మాత్రమే జీతంగా ఇచ్చిందని విమర్శిస్తున్నారు. 

దేశంలోనే ఒక వినూత్న వ్యవస్థను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసి గ్రామస్థాయిలో ప్రజలకు సేవలు అందించడానికి తమను ప్రత్యేక పోటీ పరీక్షలు పెట్టి ఉద్యోగాల్లోకి తీసుకున్నా.. ఆ సంత్రుప్తి మాత్రంలో తమలో ఎక్కడా కలగడం లేదనే నిరసన మహిళా ఉద్యోగుల్లో నెలకొని వుందని బహిరంగంగానే చెబుతున్నారు. తమ ఉద్యోగాలు అటెండరుకి ఎక్కువ.. జూనియర్ అసిస్టెంట్ కి తక్కువగా ఉన్నప్పటికీ పదోన్నతుల విషయంలోనైనా బాగుంటుందనుకుంటే అందులోనూ అవే ఇబ్బందులు వచ్చే అవకాశాలే కనిపిస్తున్నాయని, అసలు తమ సర్వీసులు రెగ్యులర్ అవుతాయో.. అయిన తరువాత ప్రభుత్వం గతంలో ప్రకటించిన విధంగా పేస్కేలు వుంటుందో.. లేదంటే ఇటీవల ప్రభుత్వం హెచ్ఆర్ఏ శ్లాబులు తగ్గించిన క్రమంలో జీతం మరింతగా తగ్గిపోతుందో తెలియని అయోమన స్థితిలో ఉన్నామని ఉద్యోగులంతా వాపోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 15వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమాలరు ఒక లక్షా 25వేలకు మందికి పైగా ప్రస్తుతం ఉద్యోగులు 16 ప్రభుత్వశాఖలకు చెందిన వారు పనిచేస్తున్నారు. ఇందులో సుమారు 20శాతానికి పైగా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలువులు ఆరు నెలలు వినియోగించుకున్నవారు ఉన్నారు. వాస్తవానికి ప్రసూతి సెలవులు ఆరు నెలలు పూర్తయిన తరువాత మరో మూడు నెలలు స్పెషల్ బేబీకేర్ లీవ్ ను కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. తమ పిల్లలు పుట్టిన సమయంలో తమ ఉద్యోగానికి సర్వీసు విషయంలో ఆరు నెలలు సర్వీసు రెగ్యులైజేషన్ కి వెనుక పడిపోయామని బాధపడుతున్న తల్లులు ఇక స్పెషల్ బేబీకేర్ సెలవులు తీసుకోకుండానే వారి పిల్లలను సాకుతూ వస్తున్నారు. మళ్లీ స్పెషల్ బేబీకేర్ లీవ్ పెడితే మరో మూడు నెలలు ప్రొబేషన్ పొడిగింపు వర్తిస్తుందనే భయంతో ఎవరూ ఆ సెలవుల జోలికే వెళ్లలేదు.

ఇప్పటికే సర్వీసు ప్రొబేషన్ ఆరునెలలు కాలం కోల్పోయిన మహిళా ఉద్యోగులు సర్వీసు ప్రొబేషన్ కు సంబంధించి జిల్లా అధికారుల నుంచి సర్వీస్ కంప్లీట్ డాక్యుమెంటేషన్లు రాక తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తమ సర్వీసు ప్రొబేషన్ కాలాన్ని ప్రభుత్వానికి అనుకూలంగా 9నెలలు గడువుని అదనంగా పెంచేసినా.. ప్రసూతి సెలవుల విషయంలో మాత్రం ఖచ్చితంగా నిబంధనలు అమలు చేసి, రెండవ శనివారాలు, ఆదివారాలు, పండుగ సెలవుల్లోనూ ప్రత్యేకంగా అదనపు పనులు చేయించుకుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయ శాఖలోని ఉద్యోగులతోనే అదనంగా పనులు చేయించుకుని నిబంధనల్లో ఎలాంటి సడలింపులు ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు తమ శాఖకు మిగిలిన ప్రభుత్వ శాఖల మాదిరిగా సడలింపులు, ప్రత్యేక సెలవులు, స్పెషల్ బేబీకేర్ లీవులు వుంటాయో ఉండవో, అసలు వాటిని తమకు అమలు చేస్తారో లేదో కూడా తెలియని అయోమయ స్థితి నెలకొందని మహిళా ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులకు కూడా ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగానే ప్రసూతి సెలవులు, స్పెషల్ బేబీకేర్ లీవ్, కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకోవడానికి సెలవులు ఇలా అన్ని అమలు చేయాలని ముక్త కంఠంతో కోరుతున్నారు. వీరి కోర్కెలు ఎలా వున్నా ముందు వీరి ఉద్యోగాలు రెగ్యులర్ అయితేనే ఏమైనా జరగడాని, ప్రభుత్వాన్ని కోరడానికి అవకశం వుంటుందనే కొసమెరుపు మాటలు సర్వత్రా వినవస్తుండటం విశేషం..!