సరసమైన ధరలకు టమాటా విక్రయాలు..


Ens Balu
5
Tadepalli
2022-05-19 15:17:05

రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో ఈ నెల 20 నుండి  సరసమైన ధరలకు టమాటాల విక్రయం జరుగుతుందని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధర భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రజలకు సరసమైన ధరలకే  టమాటాను విక్రయించేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు.  ప్రస్తుత వేసవిలో రాష్ట్రంలో టమాటా ఉత్పత్తులు తగ్గిన నేపథ్యంలో ప్రక్క రాష్ట్రాల నుండి  టమాటాను దిగుమతి చేసుకుని ప్రైవేటు వ్యాపారులు అధిక ధరలకు విక్రయించడంపై ప్రభుత్వం తీవ్ర్రంగా పరిగణించిన నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నట్లు ఆయన తెలిపారు. బహిరంగ మార్కెట్లో టమాటా ధరలను నియంత్రించేందుకు ప్రభుత్వమే స్వయంగా ప్రక్క రాష్ట్రాల నుండి టమాటాను కొనుగోలు చేసి రాష్ట్రం లోని అన్ని రైతు బజార్ల ద్వారా  సరసమైన ధరలకే టమాటాలను విక్రయించేందుకు చర్యలను తీసుకుంటుంన్నట్లు మంత్రి తెలిపారు. తదననుగుణంగా చర్యలు చేపట్టాలని ఇప్పటికే వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ ఉన్నతాధికారులతో పాటు రైతు బజార్ల సి.ఇ.ఓ.కు కూడా ఆదేశాలు జారీచేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టిని ఈ కార్యక్రమాన్ని ప్రజలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ నెల 20 నుండి రైతు బజార్లలో  సరసమైన ధరలకే  విక్రయిస్తున్న టమాటాలను కొనుగోలు చేసుకోవాలని వినియోగదారులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.