3ఏళ్ల YSRCP ప్రభత్వ పాలనలో ప్లస్, మైనస్


Ens Balu
4
Tadepalli
2022-05-23 14:21:40

ఆంధ్రప్రదేశ్ లో సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజు అంటే మే 23 వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారం చేపట్టి ప్రజల ముందుకి వచ్చింది. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఒకటి కాదు రెండు  ఏకంగా 151 సీట్లు ఎమ్మెల్యే సీట్లు గెలుచుకొని టీడీపీని చావుదెబ్బకొట్టి మరీ గెలిచింది వైఎస్సార్సీపీ. కడప, కర్నూలు, నెల్లూరు, విజయనగరం లాంటి జిల్లాలో పార్టీ టిడిపిని మట్టికరిపించింది క్లీన్ స్వీప్ చేసేసింది. దీనితో ఎంతో చరిత్ర ఉన్న టీడీపీ 23 సీట్లకే పరిమితం అయిపోయింది. అధికారంలోకి వచ్చింది మొదలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం జనంతోనే ఉంటున్నాం అన్నట్టుగా సంక్షేమ పథకాలు ప్రజల ఇంటి ముందుకే తెచ్చింది. ఎక్కడైనా, ఏ వ్యవస్థలో అయినా నూటికి నూరు శాతం ఎవరూ బాగా చేయలేరు. ఇక్కడ కూడా అదే జరిగింది. స్వతహాగా ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహరెడ్డి ఆలోచనో.. లేదంటే సలహాదారులు, ప్రభుత్వంలోని ముఖ్య అధికారుల దారిమళ్లింపో తెలీదు కానీ, కొన్ని కొన్ని ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఆ దిశలో ఒక వర్గానికి పూర్తిగా విలన్ గా మారిపోయింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం. అయితే మెజార్టీ వర్గానికి మాత్రం మేలు జరిగిందనే వాదన మాత్రం పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లైనా ఎక్కడా చెక్కు చెదరలేదు.  ఈ క్రమంలోనే మరికొంతమందికి తీవ్ర అన్యాయం కూడా జరిగింది. తద్వారా ప్రభుత్వానికి చెడ్డపేరు రావడంతోపాటు, పథకాలు కూడా ప్రజాకర్షణకు నోచులేకపోయాయి. ఈ దిశలో పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల నాడిని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ens live mobile news app, www.enslive.net ద్వారా 26 జిల్లాల్లో గ్రౌండ్ లెవల్ సర్వేని చేపట్టింది. ఇందులో ఆశక్తికర విషయాలు వెలుగు చూశాయి. సాధారణ ప్రజలు, ఉద్యోగులు, వ్యాపారులు, పథకాలు పొందిన లబ్దిదారులు చెప్పిన విధంగా ప్లస్, మైనస్ లు వారీగా  ఏ విధమైన స్పందన తెలియజేశారో  ఇక్కడ వారి మాటలనే వార్తగా  తెలియజేస్తున్నాం. 


ప్లస్ లు ఈ విధంగా ఉన్నాయి..
ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్న పార్టీగా వైఎస్సార్సీపీకి గుర్తింపు, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన ఒక నూతన విధానం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, లక్షా 28వేల ఉద్యోగాల కల్పన, నవరత్నాలతో పేదల వద్దకే సంక్షేమ పథకాల తరలింపు, నాడు-నేడు తో ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మార్పు, దళారీలు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాలోకే జమ, ప్రతీ పేదవాడికి ఇల్లు మంజూరు, సమర్ధవంతంగా కరోనా వైరస్ ను టీకాతో ఎదుర్కోవడం, ప్రజలకు అందుబాటులో మందులు ఏర్పాటు చేయడం, ఆసుపత్రుల అభివ్రుద్ధి, కొత్త పీహెచ్సీల నిర్మాణం, 104 వాహనాలతో ప్రజల ముందుకే వైద్యసేవలు, పశువులకు వైద్యం అందించడానికి సంచార పశువైద్యశాలలు, గ్రామాల్లో యూ పీహెచ్సీల ఏర్పాటు, నూతన విద్యావిధానంతో కేజీ నుంచి ఇంటర్ వరకూ సీబీఎస్ఈ సిలబస్ విద్య, మహిళలకు ఆర్ధిక స్వావలంబన, డ్వాక్రా రుణాల మాఫీ, అన్ని ప్రాంతాల అభివ్రుద్ధి కోసం నూతన జిల్లాల ఏర్పాటు, యువతకు ప్రత్యేక ఉపాది శిక్షణా కార్యక్రమాలు, గత ప్రభుత్వాలతో పోల్చుకుంటే అత్యధిక సంక్షేమ పథకాలు నిరుపేదలకు నగదు రూపంలో ఆర్ధికంగా అందించడం. వాహన మిత్ర, రైతు భరోసా, మత్స్యరా భరోసా, ఫాస్టర్లు ఆర్దిక తోడ్పాటు, న్యాయవాధులకు ఆర్ధిక తోడ్పాటు, 45ఏళ్లు నిండిన వారికి ప్రతీ ఏటా ఆర్దిక సహాయం, వ్రుత్తిదారులకు ఆర్ధిక సహాయం, పావలా వడ్డీ రుణాలు, ఆర్బీకేల ద్వారా వ్యవసాయ రైతులకు, పాడి రైతులకు సేవలు, ప్రభత్వ ఆధ్వర్యంలోనే ధాన్యం కొనుగోళ్లు ఆన్ లైన్ లోనే నేరుగా రైతులకు పేమెంట్లు, ఎరువుల నుంచి పురుగు మందుల వరకూ అన్నీ ఆర్బీకేల్లోనే ఏర్పాటు, అత్యవసర వైద్యసేవల కోసం 108లు, ఆసుపత్రుల్లో జాతీయ ఆరోగ్య మిషన్ పథకం ద్వారా పారామెడికల్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు విధానంలో భర్తీచేయడం, గ్రామసచివాలయ ఏఎన్ఎంలకు ఇన్ సర్వీసులో స్టాఫ్ నర్సు శిక్షణ ఇప్పించడం, చాలా ప్రభుత్వ శాఖల్లో అధికారుల హోదాలు మార్పు చేయడం, కమర్షియల్ టాక్స్ అధికారులకు గెజిటెడ్ హోదా కల్పించడం, ప్రైవేటు పాఠశాలలను తలదన్నేవిధంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం విద్యతోపాటు, లాంగ్వేజి ఇంప్రూవ్ మెంట్ కార్యక్రమం అమలు చేసి, విద్యార్ధులకు పాఠశాల స్ధాయి నుంచే ఆంగ్లంలో పట్టు వచ్చేలా చేయడం, అన్ని సామాజిక వర్గాల వారికి సముచిత స్థానం కల్పించడం.. ఇలా ప్రభుత్వంలోని ప్లస్ లు చెప్పుకొచ్చారు.


ఇక మైనస్ లు ఈ విధంగా ఉన్నాయి..
ఎంతో సాఫీగా సాగే రేషన్ సరుకుల ప్రక్రియను విచ్చిన్నం చేసి, ఇంటింటికీ రేషన్ సరుకులు అని అట్టర్ ఫ్లాప్ పధకం పెట్టి వాహనాల ద్వారా .. అన్ని రేషన్ సరుకులు కుదించేసి ఒక్క బియ్యం మాత్రమే పంపణీచేయడం,  ప్రభుత్వ ఉద్యోగుల వ్యతిరేక విధానాలకే పెద్దపీట వేయడం, ప్రభుత్వ ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ అమలు చేయడం, హెచ్ఆర్ఏలో కోత విధించడం, పించను దారులకు క్వాంటమ్ పించను తగ్గించయడం, రద్దు చేస్తామన్న సీపీఎస్ స్థానంతో రివర్స్ లో జిపిఎస్ విధానం తెరపైకి తేవడం, ప్రతీఏటా జాబ్ కేలండర్ ప్రకటించి ఉద్యోగాలు తీస్తామని చెప్పి కేవలం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలు ఒక్కటే తీసి చేతులు దులుపుకోవడం, దేశంలోనే ఎక్కడా లేనివిధంగా ప్రభుత్వ ఉద్యోగుల రెండేళ్ల సర్వీస్ ప్రొబేషన్ 33 నెలలకు పెంచడం, ప్రతిపక్షంలో ఉండగా ఔట్ సోర్సింగ్ ఉద్యోగ విధానాన్ని రద్దుచేయాలని పోరాటం చేసి, తీరా అధికారంలోకి వచ్చిన తరువాతన ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం కార్పోరేషన్ ఏర్పాటు చేయడం, ఉపాధ్యాయ, ఇతర గ్రూప్-1, 2, ఉద్యోగాలు భర్తీచేయకపోవడం, కొత్త జిల్లాల్లో ఉద్యోగులు, అధికారుల ప్యాట్రన్ విధానం పూర్తిగా మార్చేసి, ఉద్యోగాల్లో కోత విధించడం, దేశంలో ఎక్కడా లేనివిధంగా మీడియాను, ప్రెస్ ను, జర్నలిస్టులను పూర్తిగా అణగదొక్కి జర్నలిస్టు గుర్తింపు కార్డు అక్రిడిటేషన్ మంజూరుకి కొత్త రకాల విధి విధానాలు తీసుకు వచ్చి పూర్తిగా నియంత్రణ చేయడం, ప్రభుత్వంలోని తప్పులను చూపే మీడియాపై కేసులు పెట్టి భయపెట్టడం, అధికార పార్టీ సొంత మీడియాకే ప్రభుత్వ ప్రకటనలు మంజూరు చేసి, చిన్న పత్రికలను పూర్తిగా పక్కనపెట్టేయడం, ప్రభుత్వ శాఖల అభివ్రుద్ధి, సంక్షేమ పథకాల సమాచారం అందించే సమాచారశాఖపూర్తిగా నిర్వీర్యం చేయడం, ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయకపోవడం, అలాగనిఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీచేయపోవడం, సచివాలయ ఉద్యోగాలు భర్తీచేసే సమయంలో అయినా కాంట్రాక్టు విధానంలో పనిచేసేవారికి వెయిటేజీ ఇవ్వకపోవడం, యూనివర్శిటీల్లో అధ్యాపక పోస్టులను భర్తీచేయకపోవడం, కొత్త యూనివర్శిటీలు ప్రకటన తప్పా వాటని ఏర్పాటు చేయకపోవడం, ప్రైవేటు యూనివర్శిటీలకు అనుమతులు మంజూరు చేసి ప్రభుత్వ యూనివర్శిటీల మనుగడకు ముప్పుతేవడం, ఉద్యోగాల భర్తీచేపట్టకపోయినా.. నియామక వయస్సును పెంచకపోవడం, కొత్త ఉద్యోగాలు తీయడానికి వీలు లేకుండా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకే రెండేళ్లు సమయం పెంచేయడం, విద్యావిధానంలో మార్పులు తీసుకు వస్తామన్న ప్రభుత్వం ఖాళీగా ఉన్న లాంగ్వేజి , వ్యాయామ, ఇతర సబ్జెక్టుల ఉపాధ్యాయులను భర్తీచేయకపోవడం, నేర చరిత్ర ఉన్నవారికే రాజకీయంగా ప్రాధాన్యత ఇవ్వడం ఈ విధంగా ప్రభుత్వం చేస్తున్న, చేపడుతున్న మైనస్ లు వివరించారు.

మొత్తం మీద వైఎస్సార్సీపీకి ప్రజలు బ్రహ్మరధం పట్టిన తరువాత. సంక్షేమ పథకాలు, అభివ్రుద్ధి నిరుపేదలకు, మహిళలకు ఆర్ధికంగా నగదు పంపిణీ, కోవిడ్ నియంత్రణ అదీ కూడా కేంద్రం సహకారంతో తప్పితే, అభివ్రుద్ధి ఎక్కడా జరగలేదని 90శాతం మంది కుండ బద్దలు కొట్టారు. అయితే ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలన్నీ నగదు రూపంలో నేరుగా తమ ఖాతాలకే పంపి ఆర్ధికంగా ఆదుకున్నారని మాత్రం మహిళలంతా ప్రభుత్వాన్ని కీర్తిస్తున్నారు. మళ్లీ మళ్లీ వైఎస్ జగన్ మాత్రమే సీఎంగా రావాలని కోరుకున్నారు. ఇక ఉద్యోగులు, ఉపాధ్యాయుల, పెన్షనర్ల నుంచి  మాత్రం తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. రెండవ, శనివారం, ఆదివారం, ప్రభుత్వ శెలవుల్లో కూడా ప్రత్యేకంగా పనులు, డ్యూటీలు వేసి కుటుంబాలతో కనీసం ప్రశాంతంగా గడిపే అవకాశాన్ని కూడా ఇవ్వడం లేదని ఉద్యోగులంతా ప్రభుత్వంపై ఒంటికాలిపై లేస్తున్నారు. ఇదే ప్రభుత్వ ఉద్యోగుల్లో 30శాతం మంది ప్రభుత్వం చేసే ప్రతీ పనిని కూడా స్వాగతించారు. సరైన సమయంలో సరైన విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని కీర్తిస్తున్నారు. మరో పక్క అధికారపార్టీకి చెందిన సర్పంచ్ లు అయినా నిధులన్నీ దారి మళ్లిపోయాయని ఇటు స్థానిక సంస్థల్లో కూడా నిరాశే మిగిలింది. ఇక వ్యాపారులు, సంస్థలు కోవిడ్ లాంటి సమయంలో వ్యాపారాలు జరగకపోయినా దారుణంగా జీఎస్టీ వసూలు చేశారని మండి పడుతున్నారు. ఇన్కమ్ టాక్సులు కట్టకపోయినా, ఐటిరిటర్న్స్ వేయించడాన్ని సాకుగా చూపి ప్రభుత్వ పథకాలు నిలుపుదల చేశారని అర్హత ఉండీ ప్రభుత్వ పథకాలు అందుకో లేకపోయిన మరో వర్గం ప్రజలు కూడా తమ నిరసన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనకు సంబంధించిన వారి అభిప్రాయాలను నిశ్శంకోచంగా తెలియజేశారు. ఈ విషయాలను తెలియజేసే సమయంలో ప్రభుత్వం చేసిన తేడా పనులు ప్రభుత్వంలోని పెద్దలకు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ఎమ్మెల్సీలకు, ఎంపీలకు నచ్చకపోయినా వాస్తవాలను మాత్రమే ఇక్కడ ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ens live mobile news app, www.enslive.net ద్వారా తెలియజేసే ప్రయత్నం మాత్రమే చేశాం. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదు. ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ ఏ రాజకీయపార్టీకి గానీ, సంస్థలకు గానీ కొమ్ముకాయదని కూడా విన్నవిస్తున్నాం.