తిరుమలలో మే 25 నుండి 29వ తేదీ వరకు జరుగనున్న హనుమజ్జయంతి ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మే 25న తిరుమలలోని శ్రీ బేడి ఆంజనేయస్వామివారి ఆలయం, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నాదనీరాజనం వేదిక, ఆకాశగంగ, జపాలి ప్రాంతాల్లో ధార్మికోపన్యాసాలు, భక్తి సంగీత కార్యక్రమాలు చేపడతారు. మే 29న ధర్మగిరి వేదపాఠశాలలో ఉదయం 6 నుండి రాత్రి 10 గంటల వలకు సంపూర్ణ సుందరకాండ అఖండ పారాయణం జరుగనుంది. శ్రీవారి ఆలయానికి ఎదురుగానున్న శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి బుధవారం ఉదయం అభిషేకం, అర్చన, నివేదనలు నిర్వహిస్తారు. అదేవిధంగా, మొదటి ఘాట్‌రోడ్డులోని ఏడవమైలు వద్ద గల శ్రీ ప్రసన్న ఆంజనేయస్వామివారి నిలువెత్తు విగ్రహానికి మధ్యాహ్నం 3 గంటలకు టిటిడి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ఈ సందర్భంగా భక్తుల సౌకర్యార్థం తిరుమల నుండి ఏడో మైలు వరకు ఉదయం 11 నుండి సాయంత్రం 6 గంటల వరకు ఉచిత రవాణా సౌకర్యం కల్పించింది.
నాదనీరాజనం వేదికపై ...
నాదనీరాజనం వేదికపై మధ్యాహ్నం 3 నుండి 4 గంటల వరకు ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమం జరుగనుంది. ఇక్కడ మే 25న "అంజనానందనం వీరం" అనే అంశంపై ఆచార్య రాణి సదాశివమూర్తి, మే 26న "సుందరే సుందరః కపిః" అనే అంశంపై డా. ఆకెళ్ల విభీషణశర్మ, మే 27న "వీరో హనుమాన్ కపిః" అనే అంశంపై డా. ఎం.పవనకుమార్ శర్మ, మే 28న "జ్ఞానినామగ్రగణ్యం" అనే అంశంపై ఆచార్య రాణి సదాశివమూర్తి, మే 29న "రామవైభవ స్ఫూర్తి" అనే అంశంపై డా. ఎం.జి.నందనరావు ఉపన్యసిస్తారు.
ఆకాశగంగ వద్ద ...
ఆకాశగంగలోని శ్రీ బాలాంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుండి 11 గంటల వరకు ప్రముఖ పండితులు శ్రీ హనుమ అవతార ఘట్ట ప్రవచనాలు చేస్తారు. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
జపాలిలో...
జపాలి శ్రీ ఆంజనేయస్వామివారి ఆలయం వద్ద ఉదయం 10 నుండి 12 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్నమాచార్య ప్రాజెక్టు, దాస సాహిత్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల ఆధ్వర్యంలో భక్తిసంగీతం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.