ప్రాధమిక ఆరోగ్యకేంద్రాల్లో హెల్త్ సాఫ్ట్ వేర్..


Ens Balu
1
Tadepalli
2022-05-25 02:32:32

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి జిల్లా ఆసుపత్రుల వరకూ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ విధానాన్ని తీసుకు రావాలని యోచిస్తున్నట్టు సమాచారం అందుతుంది. ఈ సాఫ్ట్ వేర్ అందుబాటులోకి వస్తే ప్రభుత్వ వైద్య విధానాల్లో సమూల మార్పులు తీసుకు రావచ్చుననేది ప్రభుత్వ ఆలోచన. వాస్తవానికి ఈ విధానం డా.వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రావాల్సి వుంది. దివంతగత వైఎస్సార్ అనంతరం అది మరుగున పడిపోయింది.  తాజాగా మళ్లీ ఈ విషయం ఇపుడు వైఎస్సార్సీపీ ప్రభుత్వం  తెరపైకి తీసుకు వచ్చినట్టు తెలిసింది. ఈ సాఫ్ట్ వేర్ పనిచేసే విధానం తెలిస్తే ప్రతీఒక్కరూ ఆశ్చర్యపోతారు. అదే సమయంలోప్రభుత్వానికి మందులు, ఇతరత్రా సౌకర్యాల విషయంలో కోట్ల రూపాయలు ఆదా అవుతాయి. ఆ సాఫ్ట్ వేర్ ఏవిధంగా పనిచేస్తుందో ఒక్కసారి తెలుసుకుందాం. ఒక రోగి ఆసుపత్రికి రాగానే ఆరోగి యొక్క ఆధార్ కార్డు, ఫోన్ నెంబరుతో ఒక డేటాబేస్ ను తయారు చేస్తారు. తరువాత ఆయనకి ఏ విధమైన వైద్యం అందించారో కూడా వివరాలు ఆ డేటా బేస్ ఫైల్ లోనే పొందుపరుస్తారు. మందులు, క్లినికల్ టెస్టులు ఇలా మొత్తం సమాచారం ఆ ఫైల్ లో ఉంటాయి. ఇలా ప్రతీ నెలా ఎంతమంది  రోగులు వస్తున్నారు..రాష్ట్రం మొత్తం మీద ఏ తరహా రోగాలు అధికంగా నమోదు అవుతున్నాయి.. వాటికి కావాల్సిన మందులు ఏమిటి, ప్రస్తుతం ఆసుపత్రుల్లో ఏ తరహా రోగాలకు మందులున్నాయి.. అనే విషయాలన్నీ రాజధానిలోని సెంట్రల్ డేటా బేస్ సిస్టమ్ లో నమోదు అవుతాయి. తద్వారా రాష్ట్రంలోని ఏఏ ప్రాంతాల్లో ఏఏ రోగాలు అధికంగా నమోదుఅవుతున్నాయో తెలుసుకోవడానికి వీలుపడుతుంది. అంతేకాకుండా సదరు పీహెచ్సీకి జిల్లా సెంట్రల్ డ్రగ్ స్టోరేజి నుంచి మందులు సరఫరా చేయడం ద్వారా అనసర మందుల వినియోగం,  కొనుగోలు కూడా తగ్గిపోతుంది. అంతేకాకుండా రోగులకు ఏ తరహామందులు అందుబాటులో లేవో కూడా సదరు డేటాబేస్ ఫైలులోనే ఇండెంట్ పెట్టడానికి ఆస్కారం వుంటుంది. పైగా రోగికి పూర్తిస్థాయిలో వైద్యం అందడంతోపాటు, అత్యవసర సమయంలో రోగిని జిల్లా ఆసుపత్రికి సర్జరీ కోసం తరలించాల్సి వస్తే.. ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో రోగికి ముందుగా ఏ ఏ రకాల మందులు ఇచ్చారు.. ఆపరేషన్ సమయంలో ఇంకేరకాల మందులు ఇవ్వాలనే విషయం జిల్లా ఆసుపత్రుల్లోని వైద్యులకు కూడా ఈ-కేషీట్ ద్వారా తెలుస్తుంది.

ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో వైద్యం అందించడానికి అందుబాటులో ఉన్న చాలా రకాల మందులను కొనుగోలు చేస్తున్నది. వాటిలో కొన్ని మాత్రమే ఉపయోగ పడి మిగిలిన మందులన్నీ కాలం చెల్లిపోవడంతో వాటిని మొక్కలకు ఎరువుగా కానీ.. ఎక్కడో చెత్తకుప్పలోగానీ వేసేస్తున్నారు. ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ను వినియోగించడం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా వున్న ఆసుపత్రుల్లో ఎంత మంది రోజులకు వైద్య సేవలు అందాయి.. ఎంతమందికి ఆపరేషన్లు ఏఏ అవయవాలకు చేశారు.. ఎన్ని మందులు వినియోగించారు.. దానికి అయిన ఖర్చు ఎంత ఇలా మొత్తం సమాచారం ఆన్ లైన్ లో ఎప్పటికప్పుడు నమోదు అయిపోతాయి. అంతేకాకుండా ఈ విధానం అందుబాటులోకి వస్తే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసీ విభాగం కూడా ప్రైవేటు ఆసుపత్రులు, మందుల షాపులను తలదన్నేవిధంగా తయారవుతుంది. పైగా ఏ రోగి ఎన్ని రకాల మందులు వాడారు, మోతాదుకి మించి వాడారా.. అలా వాడితే వచ్చే దుష్ప్రభావలు ఏంటి అనే విషయంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆస్కారం వుంటుంది.

ప్రస్తుతం గిరిజన ప్రాంతాల్లో ఎపడమిక్ సీజన్ లో వివిధ రకాల రోగాలు గిరిజనులను పట్టి పీడిస్తుంటాయి. ఆ సమయంలో వారికి ఏ తరహా మందులు కావాలి, ఏఏ రకాల క్లినికల్ పరీక్షలు చేయాలనే విషయమై కూడా ప్రభుత్వానికి ఒక క్లారిటీ వస్తుంది. తద్వారా జిల్లా కలెక్టర్ల ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, సెంట్రల్ డ్రగ్ స్టోర్ అధికారులు కేవలం ఆయా ఎపడమిక్ సీజన్ లో కావాల్సిన మందులను మాత్రమే అందుబాటులో ముందుస్తుగా ఏర్పాటుచేసుకోవడానికి వీలుపడుతుంది. ప్రస్తుతం రాష్ట్రప్రభుత్వం అన్ని జిల్లాల్లోనూ ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో పూర్తిస్థాయిలో వైద్యులు, పారామెడికల్ సిబ్బందిని నియమిస్తోంది. ఇపుడు ఆ హెల్త్ సాఫ్ట్ వేర్ కూడా అందుబాటులోకి వస్తే మరిన్ని ఫలితాలు నమోదు చేయవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా వుంది. అయితే ప్రస్తుతం ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ అంశం ప్రాధమిక దశలోనే ఉంది. కాగా ప్రస్తుతం అన్ని కార్పోరేట్ ప్రైవేటు ఆసుపత్రులు ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ను వినియోగించి అనేక ప్రయోజనాలు పొందడంతోపాటు, అనవసర ఖర్చులను పూర్తిగా తగ్గించుకుంటున్నాయి. చూడాలి రాష్ట్రప్రభుత్వం ఆలోచన చేస్తున్న ఈ సెంట్రల్ హెల్త్ సాఫ్ట్ వేర్ ఎప్పటిలోగా ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల నుంచి ఏరియా ఆసుపత్రలు, జిల్లా ఆసుపత్రుల్లో అందుబాటులోకి వస్తుందో..!