సామాజిక న్యాయభేరి బస్సుయాత్ర సక్సెస్


Ens Balu
1
Tadepalli
2022-05-31 15:21:49

రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బి.సి, మైనారిటీ వర్గాల సంక్షేమం, అభివృద్దికి పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుండి ఐదు రోజుల పాటు  రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవంతం అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. మంగళవారం అమరావతి సచివాలయం నాల్గవ బ్లాకు ప్రచార విభాగంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ సామాజిక న్యాయ భేరి బస్సుయాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టారని, తంతోపతండాలుగా ప్రజలు ఆ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేసినందుకు ధన్యవాదములు తెలిపారు.   సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర ఈ నెల 26 న  శ్రీకాకుళంలో ప్రారంభం అయి 29 న అనంతపురంలో ముగిసిందన్నారు. వర్షం కారణంగా  26 న తేదీన విజయనగరంలో బహిరంగ సభ నిర్వహిణకు కొంత సమస్య ఏర్పడినప్పటికీ, 27 న రాజమండ్రిలో, 28 న నర్సరావుపేట మరియు 29 న అనంతపురంలో బహిరంగ సభలు విజయవంతంగా నిర్వహించడం జరుగుతుందని ఆయన తెలిపారు.  ఈ బస్సు యాత్రలో మరియు బహిరంగ సభల్లో 17 మంది ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు చెందిన మంత్రులు పాల్గొన్నారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి స్వయంగా ఈ బస్సుయాత్రలో మరియు బహిరంగ సభల్లో పాల్గొనపోయినప్పటికీ ఆయన  బొమ్మ చూపి ప్రజలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి హాజరై విజయవంతం చేశారన్నారు.  రాష్ట్ర చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించ దగ్గ విధంగా ప్రజారంకమైన పాలన రాష్ట్రంలో జరుగుచున్నదని ఆయన అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రజా రంజక పాలనతో ప్రజల్లో అచంచల విశ్వాసం ఏర్పడటం వల్లే తమ బస్సుయాత్ర సఫలీకృతం అయిందన్నారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలనా సరళి ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాలకు బంగారు బాట వేసే విధంగాను మరియు సామాజిక విప్లకారుల ఆలోచలకు అద్దం పట్టేలా ఉందని ఆయన కొనియాడారు.