సిఎంసీఐకి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో గుర్తింపు.. డా.మహర్షి
Ens Balu
8
Visakhapatnam
2022-06-20 09:43:35
ప్రముఖ సంగీత దర్శకులు డా.కె.మహర్షి( జాన్ క్రిష్టఫర్ కొమ్మలపూడి) స్థాపించిన క్రిష్టియన్ మ్యూజిక్ కాలేజీ కి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు లభించింది. 2020 ఏప్రిల్ 14 నుంచి 800 రోజుల పాటు నిర్విరామంగా విద్యార్ధుల నుంచి పెద్దవారి వరకూ ఉచితంగా జూమ్ ద్వారా ఆన్ లైన్ లో క్రైస్థవ శాస్త్రీయ సంగీత తరగతులు నిర్వహించినందుకు గాను ఈ ఖ్యాతి గడించింది. ఈ సందర్భంగా సోమవారం విశాఖలో డా.కె.మహర్షి మీడియాతో మాట్లాడారు. విశాఖ కేంద్రంగా ఇచ్చిన ఆన్ లైన్ శిక్షణకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు రావడం ఆనందంగా ఉందన్నారు. కరోనా లాక్ డౌన్ నుంచి రోజుకు రెండు బ్యాచ్ ల చొప్పున ఈ ఉచిత ఆన్ లైన్ తరగతుల ద్వారా అమెరికా, యుకె, దుబాయ్, కెనడా, ఆస్ట్రేలియా దేశాలకు చెందిన ఎందరో తెలుగువారు ఈ శిక్షణ పొందారని చెప్పారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు, గ్రంధంలోని కీర్తనలు, స్వరాలను తాను శిక్షణ ఇచ్చానని వివరించారు. అంతేకాకుండా తాను స్వయంగా రచించిన క్రైస్తవ శాస్త్రీయ సంగీత విద్యాదర్పణం పుస్తకంలోని అంశాలను కూడా విద్యార్ధులకు వివరించినట్టు చెప్పారు. తాను అందించిన ఆన్ లైన్ శిక్షణకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇదే స్పూర్తితో గిన్నిస్ బుక్ ఆఫ్ వలర్డ్ రికార్డ్స్ లో గుర్తింపు వచ్చేలా తమ ఆన్ లైన్ శిక్షణ కొనసాగించడంతోపాటు శాస్త్రీయ సంగీతానికి పూర్వవైభవం తీసుకురావడానికి శక్తివంచన లేకుండా క్రుషిచేస్తున్నట్టు డా.కె.మహర్షి( జాన్ క్రిష్టఫర్ కొమ్మలపూడి) మీడియాకి వివరించారు.