వెనక్కి వెళ్లిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు..


Ens Balu
20
Tadepalli
2022-06-28 02:45:11

ఆంధ్రప్రదేశ్ లో వైఎస్సార్సీపీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు వ్యవహారం రెండు అడుగులు వెనక్కి వెళ్లినట్టే కనిపిస్తున్నది. 13 జిల్లాలను 26 జిల్లాలుగా మార్చే క్రమంలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణానికి వడి వడిగా స్థలాల సేకరణ చేసిన ప్రభుత్వం ఒక్కసారిగా ఆ విషయాన్ని పక్కన పెట్టేసింది. వాస్తవానికి జిల్లాల విభజన పూర్తిస్థాయిలో జరిగిన తరువాత, 75శాఖలకు జిల్లా కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాలి. కాని కొన్ని శాఖల కార్యాలయాలు మాత్రమే కొత్త జిల్లాలకు వచ్చాయి. చాలా ప్రభుత్వశాఖలు ఇంకా కొత్త జిల్లాలకు రాకుండా పాత జిల్లాల నుంచే పరిపాలన సాగిస్తున్నాయి. ఈ తరుణంతో ప్రభుత్వం కూడా కొత్తగా నిర్మించబోయే ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల వ్యవహారాన్ని కూడా ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు పూర్తయిన తరువాత చూద్దాం అన్నట్టుగానే పక్కన పెట్టింది. వాస్తవానికి గ్రామ, వార్డు సచివాలయశాఖను పటిష్టం చేసిన తరువాత జిల్లా స్థాయిలో అధికారులు ప్రజల సమస్యలు, అభివ్రుద్ధిపై కాస్త అధికంగా ద్రుష్టిసారించాల్సి వుంటుంది. అందుకువీలుగానే కొత్తజిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. దానికి తగ్గట్టుగానే భూముల పరిశీలన చేపట్టింది. కొన్నిజిల్లాల్లో భూములు దొరకని ప్రాంతంలో ప్రైవేటు స్థలాలను కూడా ప్రభుత్వం సేకరించడానికి జిల్లా కలెక్టర్లు, జాయంట్ కలెక్టర్లకు అధికారం ఇచ్చింది. తెలంగాణలో మాదిరిగా 75 ప్రభుత్వ శాఖలు ఒకే భవనంలో వివిధ చాంబర్లలో ఉంటే పరిపాలన కూడా చాలా సాఫీగా సాగుతుందని, అత్యవసర సమావేశాలు, ఆదేశాలు ఇవ్వడానికి కూడా ప్రభుత్వానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశ్యంతో ఆలోచన చేసినప్పటికీ.. ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలుపై చూపిన శ్రద్ధ కొత్తగా నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల విషయంలో చూపించడం లేదు. దీనితో ఈ వ్యవహారానికి తాత్కాలికంగా బ్రేక్ పడినట్టు అయ్యింది. ఇంకా ప్రభుత్వానికి కేవలం రెండేళ్లు లోపు సమయం మాత్రమే ఉండటంతో పూర్తిస్థాయిలో నవరత్నాలు అమలు చేసి, ప్రజలు చేరువ కావడానికి మాత్రమే సమయాన్ని కేటాయిస్తున్నది. కొత్తజిల్లాలో చాలా వరకూ ప్రస్తుతం వున్న జిల్లా కార్యాలయాలన్నీ అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. అలాకాకుండా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అయితే అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఒకే చోట ఉండటంతో పాటు, చాలా పోస్టులు కుదింపు జరిగే అవకాశం కూడా వుంటుంది. ఒకరకరంగా ఈ విధానం వలన అన్ని జిల్లాశాఖలకు చెందిన అధికారులు ఒకే చోట ఉంటడంతో స్పందనలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజలకు సత్వర మేలు జరుగుతుంది. పైగా అత్యవసర పనులపై జిల్లా కేంద్రాలకు వచ్చే ప్రజలకు కూడా ఒక్కో కార్యాలయానికి ఒక్కో దగ్గరకి తిరగకుండా ఒకే కార్యాలయంలో కావాల్సిన అన్నిశాఖల పనులు చూసుకొని వెళ్లే సౌలభ్యం కూడా వుంటుంది. ఇన్ని ఉపయోగాలున్న ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల విషయాన్ని ప్రభుత్వం ఒక్కసారిగా పక్కన పెట్టడం వెనుక ఆంతర్యం అంతుచిక్కడం లేదు. చూడాలి ఈ ఏడాది చివరినాటికైనా ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం మొదలవుతుందా లేదా అనేది..!