ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లరైజేషన్ చేసిన తరువాత వారి సర్వీసులను రెగ్యులర్ చేసే ప్రక్రియను వేగం పెంచింది. దానికోసం సచివాలయ శాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి అజయ్ జైన్ ఇచ్చిన జీఓ-5 తో 19 ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు రెగ్యులైజేషన్ కి సంబంధించి జిల్లా కలెక్టర్ కి నోట్ ఫైల్ తయారుచేసే పనిలో పడ్డారు. 13 జిల్లాలు కాస్త.. 26 జిల్లాలుగా మారిపోవడంతో ఇపుడు ఏ జిల్లాకు చెందిన సచివాలయ ఉద్యోగుల జాబితా ఆ జిల్లా అధికారులు తయారు చేస్తున్నారు. ఈ మేరకు వార్డుల్లో మున్సిపల్ అధికారులు, జిల్లాల్లో జిల్లా అధికారులు ఈ జాబితా తయారు చేస్తున్నారు. ఇప్పటికే రెండేళ్లే ప్రొబేషన్ పూర్తిచేసుకున్న సిబ్బంది యొక్క ఫైనల్ ఫైళ్లను మండలాల్లో ఎంపీడీఓలు జిల్లా అధికారులకు సమర్పించారు. ప్రభుత్వం ఆగస్టు1 నాటికి ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లేర్ చేస్తూ కొత్త పేస్కేలు అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో ఏఏ జిల్లాల్లో ఎంత మంది రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్నారు.. ఎంత మంది ప్రసూతి సెలువుల్లో ఉన్నారు.. మరెంత మంది డిపార్ట్ మెంటల్ టెస్టులు పాసయ్యారు.. తదితర వివరాలతో కూడిన నోట్ ఫైల్ ను తయారు చేస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే డిఎస్సీ చైర్మన్, జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులను ఆదేశించడంతో అన్ని మండాలను యుద్ద ప్రాతిపదిక జాబితాలు జిల్లా కేంద్రానికి రప్పిస్తున్నారు.
ప్రసూతి సెలవులు తీసుకున్నవారికి 6 నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగింపు వర్తించడంతో వారి జాబితాలను కూడా జిల్లాశాఖల అధికారులు సేకరిస్తున్నారు. అదే సమయంలో ఎంత మంది ఉద్యోగులకు పోలీసు వెరిఫికేషన్ పూర్తయింది.. ఇంకా ఎంతమంది పెండింగ్ లో ఉన్నారనే సమాచారాన్ని కూడా 19శాఖలకు చెందిన జిల్లా అధికారులు స్వీకరిస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి తొలి నోట్ ఫైల్ పూర్తయితే..మిగిలిన సిబ్బంది యొక్క జాబితా వచ్చే నె22 నాటికి పూర్తికావాలి. అంతేకాకుండా ప్రతీ నెలా 20 నుంచి 25వ తేదీలోపు జీతాల బిల్లులు పెట్టాల్సిరావడంతో ఆలోగానే సమాచారం జిల్లా అధికారుల నుంచి అనుమతులు వస్తేనే పూర్తిస్థాయి పేస్కేలుతో జీతాలు పెట్టడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే ప్రభుత్వం తొలుత నిర్ధారించిన రూ.15వేలతో ఉద్యోగులు జీతాలు తీసుకోవాల్సి వుంటుంది. ఆ ఇబ్బందులు రాకుండా జిల్లా అధికారులు నోట్ ఫైల్ ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో కలెక్టర్లకు అందిన నోట్ ఫైల్ ను బట్టి రాష్ట్రవ్యాప్తంగా ఎంత గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆగస్టు1 నాటికి ఫుల్ పేస్కేలు తీసుకుంటున్నారు..మరెంత మందికి ప్రభుత్వ నిబందనల మేరకు షరతులు వర్తిస్తాయనేది తేలనుంది.