ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసినంత త్వరగా కొత్త జిల్లాల్లో ప్రభుత్వ జిల్లాశాఖల కార్యాలయాల ఏర్పాటు మాత్రం చేయడానికి చొరవ చూపించడం లేదు. ఒక్కో జిల్లాలో సుమారు 75శాఖలకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి వుంది. ముఖ్యమైన శాఖలైన రెవిన్యూ, పోలీస్, ఫారెస్టుతో మరో పది పదిహేను కార్యాలయాలు మాత్రమే ఏర్పాటయ్యాయి. మిగిలిన కార్యాలయాలు మాత్రం కొత్త జిల్తాల్లో ఏర్పాటు కాలేదు. పేరుకి జిల్లా కార్యాలయాల బోర్డులు తగిలించినా కార్యకలాపాలు మాత్రం పాత జిల్లాల నుంచే నడిపిస్తుంది ప్రభుత్వం. ఇటీవలే ప్రభుత్వ శాఖల్లో బదిలీల ప్రక్రియ పూర్తిచేసిన ప్రభుత్వం ఆ తరువాత కార్యాలయాలు ఏర్పాటు చేయాలని ఆలోచన చేసినా ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకి పడలేదు. కొత్త జిల్లాల్లో మాత్రం అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాలు ప్రారంభం అయిపోయి కార్యకలాపాలు మొదలు కావడం విశేషం. జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా ఫారెస్ట్ అధికారుల కార్యాలయాలకు సంబంధించినంత వరకూ సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు మాత్రం నూతన జిల్లాల ఏర్పాటు నుంచే ప్రారంభం అయినా మిగిలిన శాఖల కార్యాలయాలు ఒక్కొక్కటీ ధీమాగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నది. ఇదే క్రమంలో ఇప్పటికీ చాలా మంది పాత జిల్లాల్లోనే స్పందన కార్యక్రమాలకు వెళ్లి తమ అర్జీలను ఇస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అక్కడ అధికారులు మీ జిల్లా మారిపోయింది. ఇకపై మీరు పలానా జిల్లా కలెక్టరేటు, ఇతర ప్రభుత్వ శాఖల కార్యాలయాలు ఉన్నచోటుకి వెళ్లి మీ సమస్యను అక్కడ జిల్లా అధికారులకు తెలియజేయండి అని నచ్చజెప్పి పంపిస్తున్నారు.ఇక మీడియా కార్యాలయాలు కూడా విభజన జరగలేదు. పత్రికలైతే పాత జిల్లాలు ఎన్ని జిల్లాలుగా మారాయో.. అన్ని జిల్లాలు(మూడేసి జిల్లాలను కలిపి) పేర్లను ఒకే ఎడిషన్ పై వేసి ఆ జిల్లాలకు చెందిన సమాచారాన్ని, వార్తలను పాఠకులకు అందిస్తున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా మాత్రం ఆయా కొత్త జిల్లాల పేర్లతోనే వార్తల బులిటిన్ లను విడుదల చేస్తున్నాయి.
ఇక్కడ చెప్పుకోవాల్సినది ముఖ్యంగా రాజకీయ పార్టీలు. అన్ని రాజకీయ పార్టీలు తమ సొంత జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవడానికి స్థలాల ఎంపిక పూర్తిచేసుకొని నిర్మాణాలకు సిద్ధం అవుతున్నా.. ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం పూర్తిస్థాయిలో ఏర్పాటు కాకపోవడం పట్ల ప్రజలు గందర గోళానికి గురవుతున్నారు. కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా కలెక్టరేట్లు, ఇతర కార్యాలయాలు కూడా ఊరికి దూరంగా విసిరేసినట్టుగా ఎక్కడో ఏర్పాటు చేయడం, వాటిపై ప్రజలకు అవగాహన వచ్చేలా నేటికీ పూర్తిస్థాయిలో మీడియా ద్వారా కూడా ప్రచారం చేయకపోవడం ప్రజలకు కొత్త ఇబ్బందులను తీసుకొస్తున్నది. అలాగని గ్రామ, వార్డుల్లోని సమస్యలపై సదరు సచివాలయాల్లో దరఖాస్తులు చేసినా వాటికి పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. ఒక్క అనకాపల్లి, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోనే కాదు రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు మాత్రం కాలేదు. మరోవైపు ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణం కూడా అర్ధాంతరంగానే ఆగిపోయింది.
విచిత్రం ఏంటంటే..అధికాపార్టీ రాజకీయ కార్యక్రమాలు, కార్యకలాపాలు కూడా పాతజిల్లా కేంద్రంగానే నిర్వహిస్తోంది. అటు జనసేన, సిపిఐ, సిపిఎం, బీజేపీ, కాంగ్రెస్, టిడిపి, లోకసత్తా, బిఎస్పీ లాంటి రాజకీయపార్టీలు మాత్రం కొత్త జిల్లాల్లో కార్యలయాలు ప్రారంభించి తమ కార్యకలాపాలను కొత్త జిల్లాలల్లోని మండలాలకు కూడా విస్తరించాయి. అధికార పార్టీకి పాత జిల్లాల్లోనే కార్యాలయాలు ఉండటం, కొత్త జిల్లాల్లో పూర్తిస్థాయిలో జిల్లా కార్యాలయాలు లేకపోవడంతో చిన్నా, చితకా ప్రెస్ మీట్లు కూడా పాత జిల్లా కేంద్రంగానే ఏర్పాటు చేస్తున్నాయంటే పరిస్థితి ఏస్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. అధికార పార్టీకి జిల్లాల్లో కార్యాలయాలు లేకనే ప్రభుత్వ కార్యాయాలు కూడా అద్దె భవనాల్లోనే నిర్వహిస్తుందని అన్ని వర్గాల ప్రజలు, ఇతర రాజకీయ పార్టీలకు చెందిన నేతలు బహిరంగంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. దీనితో ప్రభుత్వ కార్యాలయాలు నిల్.. రాజకీయపార్టీల కార్యాలయాల ఫుల్ అన్నచందంగా తయారైంది కొత్త జిల్లాల్లోని పరిస్థితి. కొత్త జిల్లాల్లో కొన్ని డివిజనల్ కార్యాలయాలు సొంత కార్యాలయాల్లో నడుస్తున్నా..వాటిని జిల్లా కార్యాలయాలుగా మర్పు చేసి కొన్ని కార్యాలయాకే పరిమితం చేశారు. 75 ప్రభుత్వశాఖలకు సంబంధించిన అధికారులు ఎక్కడెక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేసుకొని ఉన్నారు.. అసలు ఆ మొత్తం జిల్లా అధికారులందరూ కొత్త జిల్లాలకు వచ్చారా? వారిని ఏ విధంగా సంప్రదించాలి..? అన్నది కూడా ప్రశ్నార్ధకంగానే మిగిలి పోయింది. చూడాలి డిసెంబరు లోపుగా అన్ని ప్రభుత్వ శాఖలకు పూర్తిస్థాయిలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ ప్రకటన ఏ స్థాయిలో అమలు జరుగుతుందనేది.