మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. అని అడుగుతున్నట్టుగానే వుంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రదర్శిస్తున్న తీరు. రెండేళ్లు ప్రొబేషన్ ను 9 నెలలు పొడిగించి 33 నెలలు చేసింది ప్రభుత్వం.. ఉద్యోగులకు ఇవ్వాల్సిన జీత భత్యాల ఉపయోగాల్లో మాత్రం భారీగా కోతపెట్టింది. పెంచిన పీఆర్సీ ప్రకారం ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులకు మాదిరే రాష్ట్ర వ్యాప్తంగా వున్న 1.21లక్షల గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అందే పరిస్థితి కనిపించడం లేదు. పెంచిన పీఆర్సీ పూర్తిస్థాయిలో ఇవ్వకపోగా, ఇపుడు 9నెలలు పేస్కేలు కోల్పోయేలా చేసింది. అంతేకాదు ఈ విధంగా 9నెలలు అధనంగా ప్రొబేషన్ లో ఉండిపోయిన ఉద్యోగులు తమ జీవిత కాలంలో ఒక ప్రమోషన్ కోల్పోయే ప్రమాదముంది. అక్టోబరు 2, 2021 నాటికి సచివాలయ ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ అయివుంటే సాధారణ ప్రభుత్వ ఉద్యోగుల్లానే వీరంతా కూడా పూర్తిస్థాయిలో జీతాలు తీసుకునేవారు. కానీ ఇపుడు ప్రభుత్వం నిబంధనల ప్రకారం అమలు చేసే ప్రసూతి సెలవులు, ఇతర మెడికల్ సెలవులు విషయంలో ఉద్యోగులు సర్వీసు ప్రొబేషన్ ను మాత్రం పెంచుతూ అమలు చేసినా..నోటిఫికేషన్, అదే జీఓల ప్రకారం ఉద్యోగుల సర్వీసు ప్రొబేషన్ మాత్రం డిక్లేర్ చేయలేదు. దీని వలన 9నెలల పేస్కేలు, వాటితో వచ్చే ఇతర ఉపయోగాలు, పీర్సీ వలన పెరిగిన జీతం, ఆపై వచ్చే ఉపయోగాలు, అదనంగా పనిచేసిన 9నెలల కాలంలో ఆరు నెలలకు ఒకడీఏ కూడా ఉద్యోగులు కోల్పోయారు. ఇపుడు ప్రభుత్వం తాజాగా జీఓనెంబరు-5 ద్వారా ఇచ్చిన ఉత్తర్వుల ఆధారంగా కూడా ఉద్యోగులకు పెంచిన పేస్కేలు పూర్తిగా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
ప్రసూతి నిబంధన పొడిగింపు పక్కాగా అమలుచేశారు..
ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తరువాత ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలుత రెండేళ్లు సర్వీస్ ప్రొబేషన్ పూర్తిచేయాల్సి వుంటుంది. తరువాత అదే ప్రభుత్వ నిబంధనతో సదరు ఉద్యోగులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా సర్వీస్ రెగ్యులర్ చేసి, పూర్తిస్థాయిలో పేస్కేలును అమలుచేయాలి. కానీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటుని 9నెలలకు పొడిగించి, అదే రూ.15వేలతోనే అదనంగా ఉద్యోగులతో పనిచేయించింది. కానీ ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు 6నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగించింది. ఇలా చేయడం వలన నేటికీ చాలా మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం జీఓనెంబరు 5లో పేర్కొన్నవిధంగా చూస్తే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని పక్కాగా ప్రకటించి జీఓలో పొందు పరిచింది. అదే ఉద్యోగ నియామకం సమయంలో ఇచ్చిన జీఓ, ఉద్యోగులు విధుల్లోకి చేరినపుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెండేళ్ల తరువాత సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పూర్తి పేస్కేలు ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నిస్తే.. అ ఒక్కటీ మీరు అడక్కూడదంటూ ఆ విషయాన్ని దాట వేసింది. ప్రభుత్వం ఈ విధంగా చేయడం వలన సచివాలయ ఉద్యోగులు 9నెలలు అదనంగా రూ.15వేలకే పనిచేయడంతోపాటు, 9 నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు, 27% ఐఆర్, ఒక డీఏ, పీఆర్సీ పెంపుతో రావాల్సిన ఎరియర్స్ ఉపయోగాలన్నీ కూడా ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది.
ఆగస్టు1కి వచ్చే జీతం ఎన్నికోతలకు గురై వస్తుందో..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు1 నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పూర్తిస్థాయి పేస్కేలు అమలు చేయాలని, వాటికోసం జూన్ నెలాఖరు నాటికే వారి సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని జీఓనెంబరు-5 ద్వారా ఆదేశించింది. ఈ సమయంలోనే ఉద్యోగుల జీతాలకు చెందిన సాలరీ బిల్లులు ప్రతీ నెల 20 నుంచి 25 వతేదీలోగా అప్లోడ్ చేయాల్సి వుంటుంది. అయితే ప్రసూతి సెలవులు తీసుకున్నవారి సర్వీసు ప్రొబేషన్ సాలరీలు పెట్టే సమయం నాటికే పూర్తయినా వారు కొత్త పేస్కేలు పొందే పరిస్థితి లేదు. ఎందుకంటే ఆ విధంగానే ప్రభుత్వం జీఓలో పొందు పరిచింది. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బినిఫిట్స్ ను తప్పించుకునేందుకు.. ప్రభుత్వానికి అనుకూలంగా జీఓలను అమలు చేయనప్పటికీ, ప్రసూతి, సిక్ లీవ్ లను అమలు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం తమ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది. ఈ ఒక్క కారణంతోనే నేటికీ చాలా మందికి మహిళా ఉద్యోగలకు సర్వీసు ప్రొబేషన్ కి సంబంధించిన డిక్లరేషన్ ఫైనల్ డాక్యుమెంట్లు జిల్లాశాఖల కార్యాలయాల నుంచి సచివాలయాలకు చేరుకోలేదు. అంటే ప్రభుత్వంపై ఆర్ధిక భారం పడకుండా వ్యవహరించినప్పటికీ, ఉద్యోగుల సెలవుల విషయంలో ప్రభుత్వం తూచా తప్పకుండా జీఓలను అమలు చేయడం మాత్రం ఎక్కడా ఆపలేదు. ఈ ఒక్క కారణంతోనే ఆగస్టు 1నాటికి కూడా చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన పేస్కేలు జీతం అందుకునే పరిస్థితి లేదు. అంతేకాదు అసలు ప్రభుత్వం పీఆర్సీ అమలు చేసి పేస్కేలు ఇస్తామని చెప్పినట్టుగా.. ఎంత జీతం చేతిలో పెడుతుంది. ఏఏవి కోత పెట్టిందీ తెలియని పరిస్థితి నెలకొంది. చూడాలి.. సచివాలయ ఉద్యోగులకు జాయినింగ్ ఆర్డర్ లో ఇచ్చిన ఆదేశాలను అమలు చేయని ప్రభుత్వం, ఇపుడు పెరిగిన పేస్కేలుతో ఎంత మొత్తం వారికి జీతాలు అందించనుందో..ఏ మొత్తాన్ని కుదించి..అవి మీకు ఇవ్వడం లేదని చెప్పనుందో.. ఈ లెక్కన చూస్తే.. మా ఇంటికి వస్తే ఏం తెస్తారు.. మీ ఇంటికి వస్తే ఏమిస్తారు.. అని నానుడిని పక్కాగా అమలు చేసినట్టు లేదూ..!