ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా 13 జిల్లాలు ఏర్పాటైన తరువాత జిల్లాశాఖల కార్యాలయాల రూపం పూర్తిగా మారిపోయింది. జిల్లా కార్యాలయానికి వెళ్లిన ఏ ఒక్కరికైనా అసలు ఇది జిల్లా కార్యాలయమేనా అనేఅనుమానం కలుగుతున్నదంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు జిల్లా శాఖల కార్యాలయాలంటే కార్యాలయానికి కనీసం తక్కువలో తక్కువ 20 మంది సిబ్బంది ఉండేవారు. ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయి కేవలం జిల్లా కార్యాలయానికి ఐ నుంచి ఏడుగురు సిబ్బంది మాత్రమే మిగిలారు. కాదు కాదు అలా తగ్గించేసింది ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటైతే 26 జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యపెరుగుతుందని అంతా బావించారు. కానీ దానికి రివర్స్ లో ఉన్న సిబ్బంది కుదించుకుపోయి, కొత్తజిల్లాలకు సర్ధుబాటు చేసి ప్రభుత్వం. దీనితో 75 శాఖలకు చెందిన జిల్లాశాఖల్లో వేళ్లపై లెక్కపెట్టేంత సిబ్బంది మాత్రమే మిగిలివున్నారు. జిల్లా కలెక్టరేట్ లో ఉండే 8సెక్షన్లు కాస్త నాలుగు సెక్షన్లుగా కుదించేశారు. ఇక జిల్లా శాఖలకొస్తే.. ఒక జిల్లా అధికారి, అటెండరు, డిజిటిల్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, కారు డ్రైవరు, కొన్నిశాఖల్లో మాత్రంల ఏఓలు కూడా ఉంటున్నారు. ప్రభుత్వ శాఖల్లో జిల్లా స్థాయి ఉద్యోగులు లేకపోవడంతో ఏడీ స్థాయి ర్యాంకు ఉన్న అధికారులను కొత్త జిల్లాలకు జిల్లా అధికారులుగా నియమించేసింది ప్రభుత్వం. చాలా ప్రభుత్వ శాఖల కార్యాలయాల్లో మినిస్టీరియల్ స్టాఫ్ ను భారీగా కుదించేసింది ప్రభుత్వం. దీనితో చాలా కార్యకలాపాలు నిర్వహణ జిల్లా అధికారులకు గుదిబండగా మారింది. గతంలో పదుల సంఖ్యలో ఉద్యోగులు, అధికారులు ఉంటేనే పనులు నెలలు నెలలు గడిచేవి. ఇపుడు ఆ పరిస్థితి మరింతగా పెరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలు, కార్యకలాపాలు అన్నీ ఆన్లైన్ రికార్డుల్లో తప్పితే మరెక్కడా కనిపించడం లేదు. చాలా మంది జిల్లా అధికారులకు క్షేత్రస్థాయి పర్యటనలు చేయడానికి డ్రైవర్లు కూడా లేని విధంగా మారిపోయింది. కొన్ని పాతజిల్లాల్లో మాత్రం జిల్లాశాఖల అధికారుల ఇబ్బందులను స్వయంగా పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్లు వారికి ఔట్ సోర్సింగ్ పద్దతిపై ఒక్కొక్క డిజిటల్ అసిస్టెంటన్ ను మంజూరు చేస్తున్నారు.
కొన్ని జిల్లాల్లో ఆ పరిస్థితి కూడా లేకుండా పోయింది. కొత్త జిల్లాకి ఎవరు జిల్లాశాఖ అధికారిగా వచ్చారో నేటికీ ప్రజలకు తెలియలేదు. దానిపై ఎలాంటి ప్రచారం కూడా ప్రభుత్వం చేపట్టలేదు. అంతేకాకుండా కొత్తజిల్లాల్లో జిల్లాశాఖల కార్యాలయాలు తెలియక చాలా ప్రజలు ఏ ఒక్క సమస్య వచ్చినా పాత జిల్లాలకే వెళ్లిపోతుండటం విశేషం. కొత్త జిల్లాల కార్యకలాపాలు మీడియాలో కనిపించినంతగా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలకు అవగాహన రాలేదు. ఆ విధంగా అవగాహన తెచ్చేవిధంగా కూడా జిల్లా శాఖల అధికారులు ఏ ఒక్క ప్రచారం కార్యక్రమం చేపట్టడం లేదు. చాలామంది అధికారులకు కొత్త జిల్లాలకు వెళ్లి పనులు చేయడమే చాలా కష్టంగా వుంది. దీనితో ఏదో మొక్కుబడిగా పనిచేస్తున్నాం అన్నట్టుగానే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల్లో సిబ్బంది, అధికారులు, కుదించుకుపోవడంతో క్షేత్రస్థాయిలో చేపట్టే చాల పనులు పెండింగ్ లో పడిపోయాయి. అటు రాష్ట్రప్రభుత్వం మినిస్టీరియల్ సిబ్బందినైనా నియమిస్తుందనుకుంటే అదీకూడా భర్తీచేయకపోవడంతో రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వశాఖల జిల్లా అధికారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాత జిల్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే కొత్తజిల్లాల్లో సిబ్బంది లేమి, అధికారుల కొరత మరీ అధికంగా వుంది. ఆర్బాటంగా రాష్ట్రంలో 13 జిల్లాలను కొత్తగా ఏర్పాటు చేసి..పరిపాలన సాగిస్తున్నట్టుగా చేస్తున్నా అసలు పనులు మాత్రం ఒక్క అడుగుకూడా ముందుకి కదలడం లేదు. ఇప్పటికైనా రాష్ట్రప్రభుత్వం జిల్లాశాఖల్లో పూర్తిస్థాయిలో సిబ్బందిని ఏర్పాటు చేస్తే ప్రజా పరిపాలన, జిల్లాశాఖ పెండింగ్ పనులు పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు. చూడాలి ప్రభుత్వం ఇదే విధంగా అరకొర సిబ్బందితో జిల్లాశాఖల కార్యాలయాలను నెట్టుకొస్తుందా..లేదంటే రానున్న రోజుల్లో భారీగా ఏర్పడిక ఖాళీలను భర్తీచేస్తుందా అనేది..!