ప్రభుత్వ ప్రచారానికి సమాచారశాఖ మోకాలడ్డు


Ens Balu
4
Tadepalli
2022-07-14 03:20:04

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఒక ప్రముఖ శాఖగా ఉన్న సమాచార పౌర సంబంధాలశాఖ అధికారులు కావాలనే చేస్తున్న తప్పిదం ప్రజలకు సంకటంగా మారుతోంది. మీడియాకి ప్రతిబంధకంగా తయారవుతోంది. కాదు కాదు అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేసే కోవర్టు సమాచారశాఖ అధికారుల తీరు వలన ప్రభుత్వ కార్యక్రమాల ప్రచారం అన్ని వర్గాల మీడియా ద్వారా ప్రజలకు చేరడం లేదు. సంక్షేమ కార్యక్రమాలకు ప్రచారం రానీయకుండి కొందరు డీపీఆర్వోలు పనిగట్టుకొని మీడియాకి సమాచారం ఇవ్వకుండా అడ్డుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రెస్ నోట్లు నెంబరు యాడ్ చేసుకొని వాట్సప్ ద్వారానో, ఈమెయిల్ యాడ్ చేసుకొని మెయిల్ ద్వారానో పంపమంటే వారి ఆస్తులన్నీ జర్నలిస్టులకు రాసి ఇచ్చేయమన్నట్టు తెగ ఫీలై పోతున్నారు. అంతేకాదు మీ మీడియాలో ఆ వార్త రాకపోతే ప్రభుత్వానికి ఒరిగిపోయేది ఏమీలేదులే అనే బహిరంగ డైలాగులు కూడా వాడేస్తున్నారు. ఈ విషయం రాష్ట్రంలోని 26జిల్లాలకు చెందిన కలెక్టర్లు, స్వయానా సమాచారశాఖ మంత్రికి తెలిసినా ఉపయోగం మాత్రం సున్నా. ఒక్క ప్రభుత్వశాఖ తమ పనిని తాము సక్రమంగా నిర్వహించకపోవడం వలన ప్రజలు తమ సమస్యల పరిష్కారానికి మళ్లీ మళ్లీ పాత జిల్లాల కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ జిల్లా శాఖల కార్యాలయాలకు వెళ్లాల్సి వస్తున్నది. విషయం తెలియక చిన్న, మధ్యతరగతి మీడియా అవస్థలు పడాల్సి వస్తుంది. అవునండీ..రాష్ట్రప్రభుత్వం 13 జిల్లాలుగా వున్న వాటిని 26 జిల్లాలుగా మార్పు చేసింది. ఆ విషయం ప్రభుత్వం మీడియాద్వారానే ప్రజలకు తెలియజేసింది. అయితే కొత్త జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, 75శాఖలకు చెందిన జిల్లాశాఖల అధికారులు ఎవరు,వారి కార్యాలయాలు ఎక్కడ ఉన్నాయి..ఏఏ జిల్లాలకు చెందిన ప్రజలు ఏ జిల్లా కలెక్టరేట్లు, ఏ జిల్లాశాఖ అధికారులను సంప్రదించాలనే విషయంలో సమాచార పౌర సంబంధాల శాఖ అదే మీడియా ద్వారా  ప్రచారం చేయడంలో ఘోరంగా విఫలం అయ్యింది. ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వున్న మీడియాకి ఇదే సమాచారశాఖ ప్రభుత్వ సమాచారం ఇవ్వడంలో తీవ్ర అలసత్వం, నిర్లక్ష్యం వహిస్తోంది. దీనితో ప్రభుత్వశాఖల అధికారులు, జిల్లా కలెక్టర్లకు సంబంధించిన సమాచారం పూర్తిస్థాయిలో రాష్ట్రంలోని కొత్తజిల్లాల్లోని మీడియాకి రావడం లేదు..ఆపై ప్రజలకూ తెలియడం లేదు.

ప్రెస్ నోటు అడిగితే ఆస్తులు అడిగినంతగా ఫీలపోతున్నారు..
రాష్ట్రంలో సమాచార పౌర సంబంధాల శాఖకు చెందిన డీపీఆర్వోలు, డివిజనల్ పీఆర్వోలు, ఏపీఆర్వోలు మీడియా ప్రభుత్వ కార్యాక్రమాలకు సంబంధించిన ప్రెస్ నోటు మెయిల్ ద్వారానో, అధికారిక వాట్సప్ గ్రూపులో మీడియా ప్రతినిధుల నెంబర్లు యాడ్ చేసి అందజేసే విషయంలో చాలా దారుణంగా ఫీలై పోతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వ ఆస్తులను అడిగినట్టుగానే వ్యవహరిస్తున్నారు వీరంతా. కొన్ని జిల్లాల్లో అయితే డీపీఆర్వోలు చాలా బాధ్యతగా జిల్లాలో మీడియా ప్రతినిధులను నెంబర్లు, ఈమెయిల్ ఐడీలు తీసుకొని కొత్త జిల్లాలో పరిపాలనకు సంబంధించిన వార్తలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు చాలా చక్కగా పంపిస్తున్నారు. ముఖ్యమై ప్రభుత్వ కార్యక్రమాలకు ఫోన్లు చేసీ మరీ చెబుతున్నారు. కొన్నిజిల్లాల్లో మరీ దారుణంగా అన్ని మీడియాలకు చెందిన జర్నలిస్టులకు ప్రెస్ నోట్లు పంపవద్దని, వారి నెంబర్లు వాట్సప్ గ్రూపులో యాడ్ చేసుకోవద్దని కొత్తగా విధుల్లోకి చేరిన కలెక్టర్లు, సమాచారశాఖ కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయంటూ సమాచారశాఖ అధికారులు చేసే తప్పుని వారిపై నెట్టేస్తున్నారు. దీనితో కొత్త జిల్లాల్లోని పరిపాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన సమాచారం సమాచార పౌర సంబంధాల శాఖ ద్వారా అన్ని వర్గాల మీడియాకు అందడం లేదు. సదురు మీడియా సంస్థల జర్నలిస్టులు సేకరించిన వార్తలనే మీడయా సంస్థలు ప్రచురించుకోవాల్సి వస్తుంది. అదే సమయంలో ప్రభుత్వానికి సంబంధించి గానీ, జిల్లా శాఖల అధికారులకు సంబంధించిన వ్యతిరేక వార్తలు వస్తే మాత్రం అదే సమాచారశాఖలోని డీపీఆర్వో ప్రెస్ నోటు, ప్రెస్ ఇన్విటేషన్ కూడా పంపని మీడియా సంస్థలకు ఖండన ప్రకటనలు పంపిస్తుండటం విశేషం..

అధికార పార్టీ మీడియా భజన చేస్తున్న సమాచారశాఖ..
సమాచార పౌర సంబంధాల శాఖ అధికారులు తెల్లవారు లెగిస్తే అధికారపార్టీ మీడియా భజన చేయడానికే సమయం అంతా సరిపోతుంది. ఎంత దారుణం అంటే సదరు మీడియాకి చెందిన అందరు రిపోర్టర్లు నెంబర్లు జిల్లా అధికారిక మీడియా గ్రూపులో యాడ్ చేసే డీపీఆర్వోలు, న్యూస్ ఏజెన్సీలు, చిన్న, మధ్య తరహా పత్రికలకు చెందిన జర్నలిస్టుల వాట్సప్ నెంబర్లు, ఈమెయిల్ ఐడీలను తమ గ్రూపుల్లో యాడ్ చేయడానికి ఎక్కడలేని నొప్పులన్నీ పడుతున్నారు. పైగా సాంకేతిక పరంగా తప్పించుకునేందు మీ పత్రిక, ఛానల్, న్యూస్ ఏజెన్సీల, లోకల్ కేబుల్ నెట్వర్క్ లకు ప్రభుత్వం అక్రిడిటేషన్ ఇచ్చిందా.. అలా ఇచ్చిన జర్నలిస్టుల నెంబర్లుకు, మీడియా సంస్థలకు మాత్రమే ప్రభుత్వ కార్యక్రమాలకు చెందిన ప్రెస్ నోట్లు,  ప్రెస్ ఇన్విటేషన్లు పంపమని సమాచారశాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారని చెబుతూ చేతులెత్తేస్తున్నారు. విఐపీలు, వీవీఐపీలు వచ్చే కార్యక్రమాలకు సైతం చిన్న మద్య తరహా మీడియా సంస్థల రిపోర్టర్లను ఆహ్వానించడం లేదు సమాచారశాఖ. ఇందేంటని నేరుగా సమాచారశాఖ అధికారులను ప్రశ్నించినా పట్టించునే పరిస్థితి లేదు. ఈ విషయాన్ని కొత్త జిల్లాల కలెక్టర్లు వద్ద ప్రస్తావించిన ప్రతీ సారీ..అక్కడ కలెక్టర్లు, జిల్లా అధికారులను సైతం సమాచారశాఖ అధికారులు, సిబ్బంది బురిడీలను చేసి.. మసిపూసి మరేడు కాయ చేస్తోంది. చిన్నా చితకా పత్రికలు మనకి అవసరం లేదు..వాటిలో వార్తలు వచ్చినా రాకపోయినా ఒకటే..పెద్ద పత్రికలు, పెద్ద టీవీ ఛానళ్లు ఉంటే చాలు అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు.

చోద్యం చూస్తున్న సమాచారశాఖ కమిషనర్..
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే ఏ అధికారిక కార్యక్రమం అయినా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా వున్న అన్ని రకాల మీడియాలోనూ ప్రచారం జరిగేలా చూడాల్సిన సమాచారశాఖ శాఖ కొన్ని మీడియా సంస్థలనే పట్టించుకుంటూ వారికే కొమ్ముకాస్తూ.. మిగితా వాటిని వదిలేస్తున్నా సమాచారశాఖ కమిషనర్ సైతం చోద్యం చూస్తున్నారు తప్పితే పట్టించుకోలేదు. అంతెందుకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖలకు అధికారిక వెబ్ సైట్ లున్నా.. అందులో ఒక ప్రభుత్వశాఖగా వున్న  సమాచారశాఖకు చెందిన అధికారిక వెబ్ సైట్ లో మాత్రంలో  ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు అన్ని జిల్లాలకు చెందినవి కనిపించవు. ఒకప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు చెందిన అధికారిక కార్యక్రమాలు, ప్రెస్ నోట్లు, ఫోటోలు, వీడియోలు సదరు సమాచారశాఖ వెబ్ సైట్ లో పొందు పరిచేవారు. వాటినే రాష్ట్రవ్యాప్తంగా వున్న మీడియా పబ్లికేషన్ కు వినియోగించుకునేది. ఇపుడు ఆ పనిచేస్తే ఎక్కడ ప్రభుత్వ సమాచారం మీడియా ద్వారా బయట ప్రజలకు తెలిసిపోతుందోనని భావించిన సమాచారశాఖ అరకొర సమాచారంతోనే వెబ్ సైట్ నిర్వహిస్తోంది. వాస్తవానికి కొత్తజిల్లాల్లో పరిపాలన ప్రజలకు పూర్తిస్థాయిలో తెలియాలన్నా, ప్రజలకు కొత్త జిల్లాలకు చెందిన అధికారుల సమాచారం తెలియాలన్నా అన్ని రకాల మీడియాల ద్వారా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు తెలిసేలా చేసే విషయంలో రాష్ట్రంలోని 26 జిల్లాల డీపీఆర్వోలకి కమిషనర్ ఆదేశాలివ్వాల్సి వుంది. కానీ ఆ విధంగా ఆదేశాలు ఇచ్చినట్టు ఎక్కడా కనిపిచడంలేదు. ఫలితంగానే కొత్త జిల్లాల్లోని అధికారిక కార్యక్రమాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు చెందిన సమాచారం చిన్న, మధ్య తరహా మీడియా ద్వారా ప్రజలకు చేరడం లేదు. ఇప్పటికైనా సమాచారశాఖ కమిషనర్ రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ డీపీఆర్వోలకు నిర్ధిష్ట ఆదేశాలిస్తే తప్పా పరిస్థి గాడిన పరిస్థికి కనిపిండం లేదు..!