ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయశాఖలో మిగులు ఉద్యోగాలను భర్తీచేసేం దుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులుగా పనిచేస్తూ, సర్వీసులో మరణిస్తే..ఆ కుటుంబంలోని పిల్లలకు కారుణ్య నియామకాల ద్వారా ఇచ్చే ఉద్యోగాలను గ్రామ, వార్డు సచివాలయ శాఖలో భర్తీచేయాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా రాష్ట్రంలోని 26 జిల్లా కలెక్టర్లకు వర్తమానం పంపింది. ఇప్పటికే చాలా ఉద్యోగాలను కారుణ్య నియామకాల కింద భర్తీచేసిన ప్రభుత్వం మిగులు ఉద్యోగాలను కూడా ఆ విధంగానే భర్తీచేసి, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో ఖాళీలన్నీ పూర్తిచేయనుంది. ఇటీవలే ఆర్టీసీలో కారుణ్య నియామకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన ప్రభుత్వం వాటిని కూడా ఇక్కడే భర్తీచేయాలని చూస్తోంది. తొలి ప్రాధాన్యత సచివాలయాలకు ఇచ్చి, మలి ప్రాధాన్యత కొత్త జిల్లాల్లోని కలెక్టరేట్లకు, ఇతర జిల్లాశాఖలకు ఇవ్వనుంది. ప్రస్తుతం కొత్త జిల్లాల్లో కలెక్టరేట్లు, ఇతర ప్రభుత్వ శాఖల్లో భారీగా ఉద్యోగాలు ఖాళీలు ఉండిపోవడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వాటిని భర్తీచేయాలని చూస్తోంది. గ్రామ, వార్డు సచివాలయ శాఖలో 1.35 లక్షల ఉద్యోగాలకు ప్రభుత్వం రెండుసార్లు నోటిఫికేషన్ ఇవ్వడంతో పాటు మధ్యలో కొంతమందిని కారుణ్య నియామకాల కింద తీసుకున్నా.. 1.21.లక్షల మందిని మాత్రమే సచివాలయాల్లో భర్తీ చేసింది ప్రభుత్వం. ఇంకా సుమారుగా 14వేల పోస్టులు సచివాలయశాఖలో మిగిలిపోయాయి. సదురు ఉద్యోగాలకు కారుణ్య నియామకాల్లో భర్తీచేసే సమయంలో వారి వారి విద్యార్ధహతలను బట్టీ మిగులు పోస్టులు భర్తీచేస్తే మొత్తం శాఖలోని అన్ని ఉద్యోగాలు భర్తీచేసినట్టు అవుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా మొదలు పెట్టింది.
సాధారణంగా కారుణ్య నియామకాల క్రింద నాల్గవ తరగతి ఉద్యోగాలను ప్రభుత్వం ఇన్ సర్వీసులో ఉండి మ్రుతిచెందిన వారికి కుటుంబ సభ్యులకు జిల్లాశాఖల కార్యాలయాల్లో మిగులు ఉద్యోగాలను భర్తీచేస్తుంది. కానీ ప్రస్తుతం రాష్ట్రంలోని 13 జిల్లాలు 26 జిల్లాలుగా మారిపోవడంతో, ప్రభుత్వం కూడా జిల్లా శాఖల్లోని ఉద్యోగుల సంఖ్యను, విభాగాలను కూడా కుదించేసింది. అలా కుదించినప్పటికీ చాలా జిల్లాల్లో 75 ప్రభుత్వ శాఖల్లో పెద్ద సంఖ్యలో నాల్గవ తరగతి ఉద్యోగాలు ఖాళీలు ఉండిపోయాయి. అయితే ముందుగా వాటిని భర్తీచేయాలని భావించినప్పటికీ, ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ప్రత్యేక ప్రభుత్వశాఖగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ శాఖలో అన్ని ఉద్యోగాలను పూర్తిస్థాయిలో భర్తీచేస్తే ప్రజలకు గ్రామ, వార్డుల స్థాయిలోనే సేవలు అందుతాయని చూస్తుంది. దానికి తగ్గట్టుగానే మిగులు ఉద్యోగాలన్నింటినీ సాధ్యమైనంత వరకూ కారుణ్య నియామకాల్లో భర్తీచేస్తారు. ఇంకాఏమైనా ఉద్యోగాలు మిగిలిపోతే వాటికి ప్రతీ ఏటా తీసే జాబ్ కేలండర్ లోకి చేర్చి భర్తీచేయాలని కూడా ప్రభుత్వం యోచిస్తుంది. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ శాఖలో పశుసంవర్ధక, వ్యవసాయం, వాణిజ్యం, రెవిన్యూ, పోలీస్ శాఖల్లో ఉద్యోగాలు చాలా సచివాలయాల్లో ఖాళీలు ఉన్నాయి. వాటిని కారుణ్య నియామకాలు జరిపే సమయంలో అధిక ప్రాధాన్యత ఇచ్చి వారి క్వాలిఫికేషన్లుకు తగ్గట్టుగా ఉద్యోగాలు భర్తీ చేయడం ద్వారా సచివాలయ శాఖలో అన్ని ఉద్యోగాలు నింపినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచన.
ప్రస్తుతం రాష్ట్రంలోని 75 జిల్లా శాఖలకు సంబంధించి 26 జిల్లాల్లో ఎన్ని నాల్గవ తరగతి ఉద్యోగాలు ఖాళీలు అత్యధికంగా ఉన్నాయి..ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయనే విషయాన్ని తెలుసుకోవడానికి ప్రభుత్వం జిల్లాశాఖల అధికారులను నివేదికలు కోరుతుంది. ప్రభుత్వానికి జిల్లా శాఖల అధికారులు నివేదికలు సమర్పించిన వెంటనే, ప్రాధాన్యతా క్రమంలో తొలుత గ్రామ, వార్డు సచివాలయశాఖలో నియామకాలు చేపట్టి.. తరువాత మిగిలిన శాఖల్లో ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీచేయనుందని రాష్ట్రస్థాయి అధికారి ఒకరు ఈఎన్ఎస్ కి చెప్పారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే డిసెంబరు నెలాఖరునాటికి ఇటు ఆర్టీసీలో భర్తీలచేయాల్సిన కారుణ్య నియామకాలతో పాటు, ఇతర ప్రభుత్వశాఖలు, గ్రామ, వార్డు సచివాలయ శాఖలో చాలా వరకూ ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాకపోతే గ్రామ,వార్డు సచివాలయ శాఖలో చాలా పోస్టులకు సంబంధించి సర్వీస్ రూల్స్ నిబంధనలు సక్రమంగా ప్రభుత్వం ఏర్పాటు చేయకపోవడం, కొన్ని శాఖలకైతే ప్రమోషన్ ఛానల్ ఏర్పాటు చేయకపోవడంతో సచివాలయ ఉద్యోగాలకైతే అభ్యర్ధులు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అలాంటి సమయంలో జిల్లాశాఖల్లోని నాల్గవ తరగతి ఉద్యోగాల్లోనే భర్తీచేయాలా..లేదంటే అన్నిశాఖల మాదిరిగానే గ్రామ,వార్డు సచివాలయ శాఖలోని 19శాఖల ఉద్యోగులకు వారి మాత్రుశాఖలకు సంబంధించిన సర్వీసు రూల్స్ నే అన్వయించాలా అనేవిషయంలో రాష్ట్రస్థాయిలో అధికారుల్లోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతున్నట్టు సమాచారం అందుతుంది. చూడాలి ప్రభుత్వం ఏం చేస్తుందనేది..!