ఆంధ్రప్రదేశ్ లోని 13 కొత్త జిల్లా కలెక్టర్లు అలకబూనారు.. పేరుకే జిల్లా కలెక్టర్లమే అయినా తమకు ఎలాంటి ఉత్తర్వులిచ్చే అధికారం ప్రభుత్వం ఇవ్వలేదంటూ లోలోన మధనపడుతూ, వారి సంఘంలో తీవ్రమైన చర్చకు తెరలేపారు. అసలు కొత్త జిల్లాల్లో కలెక్టర్లు ప్రభుత్వంపై అలగడం ఏంటి.. ఏం జరిగిందీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల 13 జిల్లాలను కాస్త 26 జిల్లాలుగా మార్చింది. జిల్లాలను అయితే మార్చింది కానీ కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. దానికి నిలువెత్తు సాక్ష్యం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ప్రొబేషన్ డిక్లరేషన్ ఫైలుపై కొత్త జిల్లాల్లో కలెక్టర్లకు సంతకాలు పెట్టి, ఇచ్చే అధికారాలు ఇవ్వకపోవడమే. ఈ అధికారాన్ని ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, డిఎస్సీ కమిటీలకు చైర్మన్లుగా ఉన్నవారికే ప్రభుత్వం అప్పగించింది. దీనితో తమను ప్రభుత్వం జిల్లా కలెక్టర్లుగా నియమించినా..తమకు మాత్రం రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగుల సర్వీసును క్రమబద్దీకరణ చేసే అధికారం కొత్త జిల్లాల కలెక్టర్లుగా ఉన్న తమకు కాకుండా పాత జిల్లాల కలెక్టర్లకు ఇవ్వడమేనని చెబుతున్నారు.
దీనితో ఈ విషయాన్ని ఐఏఎస్ అధికారుల సంఘంలో చర్చకు దింపారనే ప్రచారం జోరుగా సాగుతుంది. ప్రభుత్వం సచివాలయ ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ చేయడానికి జీఓనెంబరు-5ని విడుదల చేయడంతో అన్ని జిల్లాశాఖల అధికారులు ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ ఫైళ్లను సిద్దం చేసి..జిల్లా కలెక్టర్ల సంతకాలకు పంపిన సమయంలో ప్రభుత్వం నుంచి మళ్లీ ఉత్తర్వులు వచ్చాయి. ఈ ప్రక్రియ మొత్తం పాత జిల్లా కలెక్టర్లు మాత్రమే చేయాలని.. దీనితో తాము కూడా జిల్లాలకు కలెక్టర్లమే కదా..తమకు ఉద్యోగులను క్రమబద్దీకరించే అధికారం ఇవ్వకుండా ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు ఇవ్వడం సరికాదని ప్రభుత్వంపై గుస్సా అవుతున్నారు కొత్త జిల్లాల కలెక్టర్లు.. విషయాన్ని బయటకు అనకపోయినా..తీవ్రంగా మదన పడ్డారు. అందులోనూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా..వ్యవహరించినా ప్రాధాన్యత లేని ప్రభుత్వ శాఖలకు అధికారులుగా నియామకాలు జరిగిన తరుణంలో ఈ విషయాన్ని నేరుగా బయట ప్రస్తావించలేదనే విషయం మాత్రం బయటకు పొక్కింది.. ఈ విషయం కాస్త మీడియాకి తెలియడంతో గుప్పుమంది. రాష్ట్రప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో వేల సంఖ్యలో ఉద్యోగులను క్రమబద్దీకరించే అవకాశం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వలన తమకు రాలేదని కొత్త జిల్లాల కలెక్టర్లు చెబుతున్నారనే విషయం నేడు తీవ్రస్థాయిలో ప్రచారం జరుగుతోంది.
అసలు విషయం తెలుసుకోవాలని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులను ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్నీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net సంప్రదిస్తే వారు కూడా ఆశక్తకర విషయాలను ప్రస్తావించారు. పాత ఉమ్మడి జిల్లాల డిఎస్సీ చైర్మన్ల సమయంలోనే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీచేయడం వలనే..వారితోనే ఉద్యోగాలను కూడా పాత జిల్లాల కలెక్టర్లతోనే క్రమబద్దీకరించాల్సి వచ్చింది చెప్పుకొచ్చారు. ఏ ఐఏఎస్ ని అయినా జిల్లా కలెక్టర్ గా నియమించినపుడు సర్వోన్నత అధికారాలు వస్తాయి కదా అని ప్రశ్నించిన ఈఎన్ఎస్ కి మరో సమాధానం కూడా వచ్చింది. ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ కి సంబంధించిన విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంతోనేవ పాత కలెక్టర్లతోనే ఈ విధంగా చేయించారని..అయితే అదే సమయంలో కొత్త జిల్లాల కలెక్టర్లు, జిల్లాశాఖల అధికారుల నుంచి తమకు అధికారాలు ఇవ్వలేదనే విషయం తెరపైకి వచ్చిందని పేర్కొన్నారు. కొత్త జిల్లాల్లో చాలా శాఖల అధికారులు జిల్లా అధికారి స్థాయి హోదా లేకపోవడం వలన ఈ విధంగా చేయాల్సి వచ్చిందని చెప్పారు. చాలా వరకూ ఇన్చార్జిలు, కొన్ని జిల్లాల్లో హోదా లేకపోయినా ఇబ్బందులు రాకూడదనే ఉద్దేశ్యంలో అధికారులను ప్రభుత్వం నియమించిందని.. ఆ కారణంగానే ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ ఫైళ్లపై కొత్త జిల్లా కలెక్టర్లు, జిల్లా అధికారులకు అవకాశం ఇవ్వలేదని కూడా సమాధానం ఇచ్చారు.
కొత్త జిల్లాల్లో జిల్లాశాఖల అధికారులకు జిల్లా అధికారి హోదా లేకపోయినా.. ఐఏఎస్ లకు మాత్రం ఆ స్థాయి ఉన్నా.. తమకు కూడా ప్రభుత్వం ఉద్యోగుల సర్వీస్ రెగ్యులైజేషన్ చేసే అధికారాలు ఇవ్వలేదని కొత్త జిల్లాల కలెక్టర్లు మదనపడుతూ..వారిలో వారు చర్చించుకోవడం ప్రస్తుతం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిని బట్టి కొత్త జిల్లాలు ఏర్పాటు అయినా విధాన పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో కొత్త జిల్లాల కలెక్టర్లకు అధికారాలు లేవనే విషయం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీసు రెగ్యులైజేషన్ విషయంలో తేటతెల్లం అయిపోయింది. ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు చేసినదగ్గర నుంచి ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్నీ, అధికారిక మొబైల్ న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, www.enslive.net అన్ని విషయాలను అటు ప్రభుత్వం.. ఇటు ప్రజల ముందు ఉంచే విషయంలో కీలక భూమిక పోషిస్తూ వస్తోంది. ఆ క్రమంలోనే ఈ విషయాన్ని కూడా బయటకు తీసిందని చెబుతున్నాం. తప్పితే ఏ అధికారిపైనా..ఐఏఎస్ ను తక్కువ చేయడం గానీ..ప్రభుత్వం నిర్ణయాలను తప్పబట్టడం కానీ తమన ఉద్దేశ్యం కాదని కూడా తెలియజేస్తున్నాం..
జిల్లాశాఖల అధికారులు అలగడాన్ని పెద్దగా పరిగణలోనికి తీసుకోకపోయినా..ఐఏఎస్ అధికారుల అలకను మాత్రం ప్రభుత్వం అర్ధం చేసుకుంటుందని ఆఫ్ ది రికార్డ్ అంటూ సీనియర్ ఐఏఎస్ లు చెబుతున్నారు. అయితే ఇక్కడ ప్రభుత్వం 13 కొత్త జిల్లాలకు సివిల్ సర్వీస్ అధికారుల నియామకాలు చేపట్టినా.. పూర్తిస్థాయిలో అధికారాలు ఇవ్వలేదు. ఒక్క గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలోని ఉద్యోగుల సర్వీసు క్రమబద్దీకరణ విషయంలోనే కాదు.. ఇదే పద్దది కొనసాగితే.. ఆంధ్రప్రదేశ్ లోని కొత్త జిల్లాల్లో కలెక్టర్లుగా చేరడానికి ఐఏఎస్ లు ముందుకు వచ్చే పరిస్థితులు ఉండవనే వాదన ప్రస్తుతం బలంగా వినిపిస్తోంది. అదే సమయంలో ఇకపై పాత కొత్త జిల్లాల కలెక్టర్లకు విధాన పరమైన నిర్ణయాలు, అధికారాలు ఇచ్చే విషయంలో మార్పులు వస్తాయని.. కొత్త జిల్లాల్లో పరిపాలన గాడిలో పడుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాష్ట్రస్థాయి ఐఏఎస్ అధికారులు. చూడాలి ఆంధ్రప్రదేశ్ లో కొత్త జిల్లాల కలెక్టర్లకు పూర్తిస్థాయిలో అధికారాలు ఇచ్చే విషయంలో రాష్ట్రప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో..!