అమ్మతనం ఏ మహిళకైనా తన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుంది..కానీ ఆంధ్రప్రదేశ్ లోని గ్రామ, వార్డు సచివాలయ శాఖ మహిళా ఉద్యోగులకు మాత్రం తీరని వేదనను, కన్నీటిని మిగుల్చుతోంది. పురిటి సమయంలో పండంటి బిడ్డ పుట్టిందని ఆనంద పడాలో.. ఆ సమయంలో ప్రసూతి సెలవులు తీసుకున్నందుకు సర్వీస్ ప్రొబేషన్ మరో ఆరు నెలలు పొడిగింపు వర్తించినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి ఎదురైంది. పోనీ ఆ ఆరునెలలు పూర్తయిన తరువాత నైనా అందరి ఉద్యోగులతోనైనా సర్వీసు రెగ్యులైజేషన్ చేస్తారా అంటే ఆ విషయంలో కూడా క్లారిటీ లేకుండా పోయింది. విధి నిర్వహణలో ఉండగా పెళ్లై, పురిటి సెలవులు తీసుకున్న గ్రామ సచివాలయ మహిళా ఉద్యోగులకు జూలై నెలలో కొన్ని కొన్ని తేదీలతో రెండేళ్లు ప్రొబేషన్ సమయం తీసుకున్న ఆరు నెలల సమయంతో కలిపి పూర్తయిపోయింది. కానీ మిగిలిన సహచర ఉద్యోగులతోపాటూ సర్వీస్ రెగ్యులైజేషన్ కి సంబంధించిన ఆఖరి దస్త్రాలు నేటికీ గ్రామ, వార్డు సచివాలయాలకు చేరలేదు. దీనితో తన సహచర ఉద్యోగులంతా ఆగస్టు1వ తేదీ నాటికి పెరిగిన పేస్కేలు సాలరీలు తీసుకుంటే.. ప్రసూతి సెలవులు తీసుకొని.. ఆగడవు పూర్తయినా.. క్రమ బద్దీకరణ దస్త్రాలు అందుకోని సచివాలయ మహిళా ఉద్యోగులు మాత్రం ఆగస్టు నెలలో కూడా ఆ పాత జీతం రూ.15 వేలు మాత్రమే తీసుకోబోతున్నారు. ఇప్పటికే సర్వీస్ ప్రొబేషన్ పూర్తయి సంబంధిత జిల్లా శాఖల నుంచి ఫైనలైజ్డ్ డాక్యుమెంట్ల జాబితాలు సచివాలయాలకు చేరకపోవడంతో వారందరికీ పాత పద్దతిలోనే జీతాలు పెట్టారు సచివాలయ డిడిఓలు.
ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా కొత్తగా ఉద్యోగంలోకి చేరిన తరువాత ప్రభుత్వ నిబంధన ప్రకారం తొలుత రెండేళ్లు సర్వీస్ ప్రొబేషన్ పూర్తిచేయాల్సి వుంటుంది. తరువాత అదే ప్రభుత్వ నిబంధనతో సదరు ఉద్యోగులను ప్రభుత్వం నోటిఫికేషన్ లో ప్రకటించిన విధంగా సర్వీస్ రెగ్యులర్ చేసి, పూర్తిస్థాయిలో పేస్కేలును అమలుచేయాలి. కానీ గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల సర్వీస్ ప్రొబేషన్ డిక్లరేషన్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తన వెసులుబాటు కోసం ఏకంగా 9నెలలకు పొడిగించి, అదే రూ.15వేలతోనే అదనంగా ఉద్యోగులతో పనిచేయించింది. ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు 6నెలలు సర్వీసు ప్రొబేషన్ పొడిగించింది. ఇలా చేయడం వలన నేటికీ చాలా మంది ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ రెండేళ్లు పూర్తి కాలేదు. కానీ ప్రభుత్వం జీఓనెంబరు 5లో పేర్కొన్నవిధంగా చూస్తే రెండేళ్లు సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులకే సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేస్తామని పక్కాగా పొందు పరిచింది. అదే ఉద్యోగ నియామకం సమయంలో ఇచ్చిన జీఓ, ఉద్యోగులు విధుల్లోకి చేరినపుడు ఇచ్చిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారంగా రెండేళ్ల తరువాత సర్వీస్ ప్రొబేషన్ డిక్లేర్ చేసి పూర్తి పేస్కేలు ఎందుకు అమలు చేయాలేదని ప్రశ్నిస్తే.. అ ఒక్కటీ మీరు అడక్కూడదంటూ ఆ విషయాన్ని దాట వేసింది ప్రభుత్వం. ఈ విధంగా చేయడం వలన సచివాలయ ఉద్యోగులు 9నెలలు అదనంగా రూ.15వేలకే పనిచేయడంతోపాటు, 9 నెలల పేస్కేలు కోల్పోయారు. వాటితోపాటు, 27% ఐఆర్, ఒక డీఏ, పీఆర్సీ పెంపుతో రావాల్సిన ఎరియర్స్ ఉపయోగాలన్నీ కూడా ఉద్యోగులు కోల్పోవాల్సి వచ్చింది.
ఆగస్టు1కి కొందరికి పెరిగిన జీతం..మరికొందరికీ పాత జీతం..
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం ఆగస్టు1 నుంచి రెండేళ్లు పూర్తిచేసుకున్న వారందరికీ పూర్తిస్థాయి పేస్కేలు అమలు చేయడంతో ఆ ప్రక్రియ పూర్తయిన వారందరూ కొత్త పేస్కేలు అందుకోనుండగా.. రెండేళ్లు పూర్తయినా ప్రసూతి సెలవులు గడువు పూర్తయినా క్రమబద్దీకరణ దస్త్రాలు రాని వారు మాత్రం ఎప్పటి మాదిరిగానే పాతజీతం రూ.15వేలతోనే సరిపెట్టుకోవాల్సి వుంది. ఇప్పటికే జీతాలు ఆన్ లైన్ లో ననమోదు కావడంతో ఆఖరి నిమిషంలో క్రమబద్దీకరణ దస్త్రాలు వచ్చినా ఉపయోగం లేకుండా పోతుంది. జూన్ నెలాఖరు నాటికే సచివాలయ ఉద్యోగులకు సర్వీసు ప్రొబేషన్ డిక్లేర్ చేయాలని జీఓనెంబరు-5 ద్వారా ప్రభుత్వం ఆదేశించింది. అయితే ప్రసూతి సెలవులు తీసుకున్నవారి సర్వీసు ప్రొబేషన్ సాలరీలు పెట్టే సమయం నాటికే పూర్తయినా వారు కొత్త పేస్కేలు పొందే పరిస్థితి లేదు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బినిఫిట్స్ ను తప్పించుకునేందుకు.. ప్రభుత్వానికి అనుకూలంగా జీఓలను అమలు చేసినప్పటికీ, ప్రసూతి, సిక్ లీవ్ లను అమలు చేసే విషయంలో మాత్రం ప్రభుత్వం తమ నిబంధనను ఖచ్చితంగా అమలు చేసింది ప్రభుత్వం. ఈ ఒక్క కారణంతోనే నేటికీ చాలా మందికి మహిళా ఉద్యోగలకు సర్వీసు ప్రొబేషన్ కి సంబంధించిన డిక్లరేషన్ ఫైనల్ డాక్యుమెంట్లు జిల్లాశాఖల కార్యాలయాల నుంచి సచివాలయాలకు చేరుకోలేదు. దానితో ఆగస్టు 1నాటికి కూడా చాలా మంది గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు పెరిగిన పేస్కేలు జీతం తీసుకోలేరన్నమాట. అంతేకాదు ఇంకా ప్రసూతి సెలవులు తీసుకున్నవారు రాష్ట్రవ్యాప్తంగా ఎంత మంది మహిళా ఉద్యోగులు మిగిలిపోయారో వారందరికీ ఒకేసారి సర్వీస్ ప్రొబేషన్ చేస్తారనే ప్రచారం కూడా జోరుగా సాగుతుంది. అదే నిజమైతే మరో రెండు నెలల వరకూ కూడా కొత్త పేస్కేలు పొందలేరు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులు. అందరు సహచర ఉద్యోగులతోపాటు తాము కూడా ఆగస్టు 1నాకిటికి కొత్త పేస్కేలు జీతం తీసుకునే అవకాశం లేకుండా కేవలం ప్రసూతి వేదన మిగిల్చిన శాపమే అంటున్నారు మహిళా ఉద్యోగులు. చూడాలి ప్రసూతి సెలవుల గడువు పూర్తయిన వారికి సెప్టెంబరు నెలలో నైనా పాత తేదీలలో మిగిలిన జీతం కలిపి ఇస్తారా లేదా అన్నది..!