సీఎం వైఎస్ జగన్ మోహనరెడ్డి విశాఖలో సంచనల ప్రకటన చేశారు. దీనితో ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉలిక్కిపడింది. ఆంధ్రప్రదేశ్ లో ప్లాస్టిక్ ఫ్లెక్సీలు నిషేధిస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం ఉదయం విశాఖపట్నం ఏయూ కన్వెన్షన్ సెంటర్‌లో ‘పార్లే ఫర్ ది ఓషన్స్’ సంస్థతో ఎంఓయూ సందర్భంగా.. ఆయన ప్రసంగించారు. ఈ వేదిక నుంచే ఏపీలో ప్లాస్టిక్ ఫ్లెక్సీలపై బ్యాన్ ప్రకటించడంతో అంతా ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. రాష్ట్రంలో ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు అత్యధికంగా ప్లాస్టిక్ ప్లెక్సీలతో ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేస్తున్నారు. ఈ తరుణంలో సీఎం చేసిన ప్రకటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది. ఇంకా సీఎం ఏమన్నారంటే.. పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక పురోగతి నాణేనికి రెండువైపులని, గుడ్డలతో చేసిన ఫ్లెక్సీలకు మాత్రమే అనుమతి ఉంటుందని స్పష్టం చేశారు. ఉదయం కోస్టల్ బ్యాటరీ నుంచి భీమిలి వరకూ.. ప్లాస్టిక్ వ్యర్థాలను వలంటీర్లు క్లీన్ చేశారు. ఈ సందర్భాన్ని సీఎం ప్రస్తావిస్తూ.. ఈరోజు విశాఖలో ప్రపంచంలోనే అతిపెద్ద బీచ్ క్లీనింగ్ కార్యక్రమం జరిగిందన్నారు. దాదాపు 76 టన్నుల ప్లాస్టిక్‌ను సముద్రం తీరం నుంచి తొలగించినట్టు గుర్తు చేశారు. భూమిపై 70 శాతం ఆక్సిజన్ సముద్రం నుంచే వస్తోందని.. అందుకే సముద్రాన్ని మనమంతా కాపాడుకోవాలని సూచించారు. అదేవిధంగా రాష్ట్రంలోని సాగర తీరప్రాంతాలను కాపాడుకోవాల్సిన బాధ్యత పౌరులందరూ తీసుకోవాలని పిలుపు నిచ్చారు.
పార్లే సంస్థ సముద్రం నుంచి ప్లాస్టిక్ వ్యర్థాలను బయటకు తీస్తుందని... రీసైకిల్ చేసి పలు ఉత్పత్తులు తయారు చేయడంతోపాటు..పార్లే ఫ్యూచర్ ఇనిస్టిట్యూట్‌ను ఏపీలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు. ప్లాస్టిక్ ఫ్లెక్సీల బ్యాన్ తొలి అడుగుగా అభివర్ణించిన సీఎం జగన్.. 2027 కల్లా ఏపీని ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్‌గా మార్చి చూపిస్తామన్నారు. ప్లాస్టిక్ నుంచి రీసైక్లింగ్ నుంచి తయారు చేసిన షూస్, కళ్ల జోడులను స్వయంగా ధరించి ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులతోపాటు పార్లే సంస్థ నిర్వాహకులు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.