ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోని కార్యక్రమాల, సంక్షేమ పథకాలపై ప్రచారారం, సామాచా రాన్ని ప్రజలకు మీడియా ద్వారా చేరవేసే సమాచార, పౌరసంబంధాల శాఖను సిబ్బంది కొరత అత్యంత తీవ్రంగా వేధిస్తోంది. ఉమ్మడి 13 జిల్లాల్లోనే అనుకుంటే..ఇపుడు ఆ ఇబ్బందులు కొత్త 13 జిల్లాల్లో మరింత అధికం అయ్యాయి. సిబ్బంది కొరత సమాచారశాఖను దారుణంగా వెంటాడుతుండటంతో అన్నిపనులూ ఉన్న కొద్దిపాటి సిబ్బందే చేసుకోవాల్సి వస్తున్నది. దీనితో సరైన సమాయానికి మీడియాకి ప్రభుత్వ సమాచారం ఇవ్వడానికి వీలుపడటం లేదు. ప్రభుత్వం రాష్ట్రంలోని 75 ప్రభుత్వ శాఖల్లో ఖాళీలలను అంచెలంచలుగా భర్తీచేస్తున్నప్పటికీ ప్రభుత్వ సమాచారం ప్రజలకు తెలియజేసే సమాచారశాఖపట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తున్నట్టే కనిపిస్తోంది. ఏళ్ల తరబడి ఈ శాఖలో ప్రధాన విభాగాల ఖాళీలు భర్తీకావడం లేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఉండాల్సిన సిబ్బందిలో కనీసం సగం కంటే తక్కువగా ఉండంటంతో కొత్త జిల్లాల్లో కూడా సమాచారశాఖ కార్యాలయంలో కేవలం ముగ్గురు, నలుగురు సిబ్బందితోనే నెట్టుకు రావాల్సిన దుస్థిని ఏర్పడుతోంది. దీనితో మహా ప్రభో మా శాఖలో సిబ్బంది లేక నానా పాట్లు పడాల్సి వస్తోంది.. దయచేసి కొద్దిమందినైనా నియమించాలని రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని సమాచారశాఖ అధికారులు నెత్తీ నోరూ కొట్టుకుంటున్నారు. అన్నిశాఖల మంత్రుల వద్ద తమశాఖ గోడును వెల్లబోసుకుంటన్నారు. అయినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడం విశేషం.
సమాచారశాఖలో ఉండాల్సిన సిబ్బంది
సమాచార, పౌరసంబంధాల శాఖలో ప్రభుత్వ సమాచారాన్ని సంక్షేమ పథకాల వివరాలను సకాలంలో మీడియాకి అందించాలంటే కింద పేర్కొన్నట్టుగా సిబ్బంది ఉండాల్సి ఉంది. జిల్లా పౌరసంబంధాల అధికారి, సహాయ పౌరసంబంధాల అధికారి, ఫోటో గ్రాఫర్, కార్ డ్రైవర్, కంప్యూటర్ ఆపరేటర్, వీడియో గ్రాఫర్, కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్, జూయిర్ అసిస్టెంట్, కంపోజర్ లేదా మెసెంజర్, ప్రొజక్షన్ ఆపరేటర్, అటెండర్ ఉండాల్సి వుంది. ఉమ్మడి 13 జిల్లాల్లోనే ఈ శాఖలో ప్రభుత్వం ఈ విధంగా సిబ్బందిని పూర్తిస్థాయిలో నియమించలేదు. దానితో ఆయా విభాగాల్లోని సిబ్బందిని అత్యవసర పనులకు వినియోగించుకుంటూ కార్యక్రమాలను మమ అనిపిస్తున్నారు ఈ శాఖలోని అధికారులు. అన్ని జిల్లాల్లోనూ జిల్లా కలెక్టర్ కార్యక్రమాలు, ఎపుడైనా మంత్రుల కార్యక్రమాలు తప్పితే..ఇతర జిల్లాశాఖల వివరాలు మీడియాకి ఇవ్వడం లేదు. అదేంటని ప్రశ్నిస్తే..మాకు సమయం అంతా కలెక్టరేట్ ని కవర్ చేయడానికే సరిపోతుందని, సిబ్బంది లేకపోతే ఉన్న కొద్దిమందితో ఎలా అన్ని ప్రభుత్వశాఖల సమాచారాన్ని ఇవ్వగలమని తిరిగి ప్రశ్నిస్తున్నారు.
అక్కరకు రాని ఏపీఆర్వోల నియామకాలు..
సమాచారశాఖలోని అధికారులు నెత్తీనోరూ కొట్టుకుంటే ప్రభుత్వం గతంలోని ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు 13 మంది ఏపీఆర్వోలను మాత్రమే నియమించి ఊరుకుంది. వారంతా ఉమ్మడి జిల్లాలకే డీపీఆర్వోలు, డీడీ, ఏడీల దగ్గర పరిమితం అయిపోయారు. చాలా సంవత్సరాల నుంచి ఈ శాఖలో ఫోటోగ్రాఫర్లు, ఏపీఆర్వోలు, కార్యాలయ 4వ తరగతి సిబ్బంది ఖాళీలను ప్రభుత్వం భర్తీ చేయలేదు. దీనితో ఉన్న సిబ్బందితోనే సమాచారశాఖ సర్ధుకొని పనిచేయాల్సి వస్తున్నది. ప్రభుత్వంలోని ముఖ్యమైన శాఖల్లో ఒకటిగా వున్న ఈ శాఖలో ప్రభుత్వం తక్షణమే ఉద్యోగులను నియమించాల్సి వున్నా.. కారుణ్య నియామకాల్లో తప్పా ప్రత్యేకంగా ఈ శాఖకు సరిపడ సిబ్బందిని మాత్రం నియమించడం లేదు. ప్రభుత్వాలు మారినా..ఈ శాఖకు ప్రత్యేకంగా మంత్రులు వచ్చినా కూడా ఎందుకనో ఇక్కడ మాత్రం నియామకాలు చేపట్టడం లేదు ప్రభుత్వం.
నోటిఫికేషన్లకు అతీగతీలేదు
గత కొన్ని నెలల క్రితం పరిమితంగా డీపీఆర్వోలు, ఏపీఆర్వో రెగ్యులర్ ఉద్యోగాలకు ఏపీలో ప్రభుత్వం నోటిఫికేషన్లు ఇచ్చినా వాటికి పోటీ పరీక్ష నేటివరకూ పెట్టకపోవడం విశేషం. ఆ ఉద్యోగాలకు సంబంధించి ఎప్పుడు పరీక్షలు పెడతారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో ఎవరిని సంప్రదించాలో కూడా తెలియడం లేదని సదరు ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నవారు వాపోతున్నారు. పాత ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ఇచ్చిన ఆ నోటిఫికేషన్ లో ఇపుడు తాజాగా కొత్త పోస్టులను పెంచడానికి ఆ పోటీపరీక్ష నిర్వహించ లేదా..? లేదంటే పూర్తిగా రద్దు చేయడానికి ఇంత ఎక్కువ కాలం పరీక్ష్ పెట్టలేదా? అనే ప్రశ్నలకు సమాచారశాఖ, ఏపీపీఎస్సీ నుంచి సమాధానం నేటికీ రాలేదు.
రాష్ట్రంలో అరకొరగానే మీడియాకి సేవలు..
ఆంధ్రప్రదేశ్ లోని రాష్ట్రవ్యాప్తంగా 23 జిల్లాల్లో మీడియాకి సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా మీడియాకి సహకారం పూర్తిగా తగ్గిపోయింది. ఉన్న ఆ కొద్ది మందిలో వేళ్లపై లెక్కపెట్టే జిల్లాలు మాత్రమే మీడియాకి పూర్తిస్థాయిలో సమాచారాన్ని అందిస్తూ సహకారం అందిస్తున్నాయి. మిగిలిన జిల్లాల్లో ప్రెస్ అక్రిడిటేషన్లు, పెద్ద, చిన్న పత్రికలు, టీవీఛానళ్ల నెపంతో అనుకున్నవారికి తప్పా ఇతర చిన్న, మధ్యతరహా మీడియాకి సమాచారం అందించడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే తమకు కమిషనర్ నుంచి ఆదేశాలున్నాయని చెప్పి తప్పించుకుంటున్నారు. రాష్ట్రవ్యాప్తంగా కార్యాలయాలు ఏర్పాటు చేసుకోలేని మీడియా సంస్థలకు, పత్రికలకు స్థానిక జిల్లా అధికారులు తప్పా.. ఇతర జిల్లాల డీపీఆర్వోలు, డీడీలు, ఏడీలు సమాచారం ఇవ్వడంలో కరాఖండీగా వ్యవహరిస్తున్నారు. కొన్ని జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ సమాచారం ఎన్ని జిల్లాలకు మీడియా ద్వారా వెళితే అంతగా జిల్లా సమాచారం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు తెలుస్తుందనే విధంగా అధికారులు వ్యవహరిస్తూ అన్ని రకాల మీడియాకి సహాయ సహకారాలు అందిస్తున్నారు. నిజంగా కమిషనర్ చిన్న, మధ్య తరహా మీడియా సంస్థలను పట్టించుకోనవసరం లేదని చెప్పారో లేదో తెలియదు గానీ..అడ్మిన్ యాక్సెస్ మాత్రమే ఉన్న ప్రెస్ వాట్సప్ గ్రూపుల్లో కూడా నెంబర్లు యాడ్ చేయడానికి ఆయా జిల్లాల్లోని డిపీఆర్వోలు తెగ నొప్పులు పడిపోతున్నారు.
ఈ విషయాన్ని ఎన్నిసార్లు ఆయా జిల్లాల కలెక్టర్లు, సమాచారశాఖ మంత్రి ద్రుష్టికి తీసుకెళ్లినా అటు సమాచాశాఖ కమిషనర్ నుంచి గానీ, డీపీఆర్వోల నుంచి గానీ ఎక్కడా చలనం రాకపోగా..సహకారం అందించే డీపీఆర్వోలపై మీడియాను దూరం పెట్టే ఇతర డీపీఆర్వోలు గొడవలకు దిగుతుండటం విశేషం. చాలా సంవత్సరాల నుంచి సమాచారశాఖలో ఏపీ కేడర్ కి చెందిన అధికారులను నేరుగా కమిషనర్లుగా నియమించకపోవడం, రాష్ట్రంలో జిల్లాల్లో మీడియాకి సమాచారశాఖ ద్వారా అందుతున్న సేవలను కమిషనర్, ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయిలో సమీక్షలు జరగక పోవడం వలనే ఈ ఇబ్బందులు తలెత్తుతున్నాయని చిన్న, మధ్య తరహా మీడియా ఆవేదన వ్యక్తం చేస్తున్నది. చూడాలి ఇప్పటికై ప్రభుత్వం సమాచార శాఖలోని ఖాళీలు భర్తీచేసి, మీడియాకి పూర్తిస్థాయిలో సమాచారం ఇస్తుందో లేదంటే ఎప్పటి మాదిరిగానే ప్రభుత్వ సమాచారాన్ని మీ పత్రిక, ఛానల్ లో వేయకపోతే దేశానికి, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏమీ లేదని మాట్లాడుతున్నట్టుగా అలాగే వదిలేస్తుందో అనేది..!