కొత్తజిల్లాల్లో కలెక్టర్లకు నివాస సముదాయాలు


Ens Balu
6
Amaravati
2022-08-29 01:58:02

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విభజించిన 13 జిల్లాల అభివ్రుద్ధి లక్ష్యంగా ముందుకి అడుగులు వేస్తోంది. మొన్నటి వరకూ కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ల నిర్మాణాలకు స్థలసేకరణ పూర్తి చేసిన ప్రభుత్వం ఇపుడు తాజాగా కొత్త జిల్లాల్లోని కలెక్టర్లు, జెసిలు, ఎస్పీ, జిల్లా ఫారెస్టు అధికారి వంటి సివిల్ సర్వీస్ అధికారులు, జిల్లా అధికారులకు నివాస సముదాయాలను కూడా నిర్మించాలని యోచిస్తున్నది. దానికోసం కూడా ప్రభుత్వ స్థలాల ఎంపిక పూర్తిచేయాలని ఆయా జిల్లాల కలెక్టర్లుకు ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. జిల్లా యంత్రాంగం మొత్తం పనిచేసే జిల్లా కేంద్రాల్లోనే అందుబాటులో ఉంటే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించవచ్చుననేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తున్నది. ఇప్పటి వరకూ ఉమ్మడి 13 జిల్లాల్లో మాత్రమే సివిల్ సర్వీస్ మరియు జిల్లాశాఖలకు చెందిన అధికారులకు నివాస సముదాయాలు ఉన్నాయి. అదే తరహాలలో కొత్త జిల్లాల్లోని అధికాకులకు కూడా నివాస స్థలాలు, క్యాంపు కార్యాలయాలు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే కొత్తజిల్లాల్లోని చాలా మంది కలెక్టర్లు ప్రైవేటు అద్దె ఇళ్లల్లో ఉంటున్నారు. మరికొందరు ఉమ్మడి జిల్లాల నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. అలాంటి వారందరికీ నివాస సముదాయాలు నిర్మిస్తే ప్రభుత్వ పరంగా అన్ని రకాలుగా వసతి సమకూర్చినట్టు ఉంటుందని భావిస్తున్నారు.

75 ప్రభుత్వ శాఖల అధికారులకు క్వార్టర్స్..
రాష్ట్రప్రభుత్వంలోని 75 ప్రభుత్వ శాఖల జిల్లా అధికాకులకు కూడా జిల్లా కలెక్టర్, ఎస్పీ, జెసి స్థాయిలోనే నివాస సముదాయాలను కూడా నిర్మించనున్నారు. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాల నుంచి అధికారులు కొత్త జిల్లాలకు రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ఇలా అయితే పరిపాలన ముందుకు సాగడం కష్టమని, కొత్త జిల్లా అభివ్రుద్ధి కష్ట తరంగా మారుతుందని భావించిన ప్రభుత్వం జిల్లా అధికారులకు కూడా నివాస సముదాయాలు కల్పించాలని చూస్తోంది. ఆ విధంగా ఏర్పాటు చేయడం ద్వారా నిత్యం జిల్లాశాఖల అధికారులు కూడా ప్రజలకు, ప్రభుత్వానికి అందుబాటులో ఉంటారనేది ప్రభుత్వ భావన. ఉమ్మడి జిల్లాల్లో అయితే చాలా చోట్ల రెవిన్యూ క్వార్టర్స్ నిర్మించి అందులో జిల్లా అధికారులకు సముదాయాలు ఏర్పాటు చేశారు. ఇపుడు అదే విధంగా ప్రత్యేకంగా క్వార్టర్స్ ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాల అభివ్రుద్ధితోపాటు కొత్త జిల్లాల్లో కూడా అన్ని రకాల మౌళిక వసతులు కూడా కల్పించినట్టు అవుతుందని ప్రభుత్వం ఆలోచిస్తున్నది. దానికి అనుగుణంగానే ప్రభుత్వ అధికారులు స్థలాల గుర్తింపు వేగవంతం చేస్తున్నారు.

సర్క్యూట్ హౌస్..జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లు
ఏపీలోని ఉమ్మడి 13 జిల్లాల్లో మాదిరిగా కొత్త జిల్లాల్లో కూడా ప్రభుత్వంలోని ముఖ్యమైన అధికారులు, ప్రజాప్రతినిధులు వచ్చి విడిది చేసేందుకు వీలుగా సర్క్యూట్ హౌస్ లు, జిల్లా పరిషత్ గెస్ట్ హౌస్ లు,  కొత్తజిల్లాల్లోకి జిల్లా పరిషత్ లు ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తున్నది. ఈ విధంగా గెస్ట్ హౌస్ లు ఏర్పాటు చేయడం ద్వారా ఏ జిల్లాకి చెందిన ప్రజాప్రతినిధులు ఆ జిల్లాల్లోనే ఉంటారనేది కూడా ప్రభుత్వ ఆలోచన. ప్రస్తుతం ప్రభుత్వం రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా విభజించి పరిపాలన కొనసాగిస్తున్నప్పటికీ.. అధికారుల నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు అందరూ ఉమ్మడి జిల్లాల్లోని పార్టీ కార్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాల్లోనే తమ కార్యకలాపాలు చేపడుతున్నారు. అలా చేయడం ద్వారా ప్రజలకు ప్రజా ప్రతినిధులు కూడా దూరంగా ఉంటున్నారని ప్రభుత్వం గుర్తించింది. దీనితో ఏ కొత్త జిల్లాల్లో ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, జిల్లాశాఖల అధికారులకు సంబంధించి వేర్వేరుగా నివాస సముదాయాలు, సర్క్యూట్ హౌస్ లు, జిల్లా పరిషత్ లు, గెస్ట్ హౌస్ ల నిర్మాణం చేపట్టడం ద్వారా కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలకు చెందిన ప్రజాప్రతినిధులు జిల్లాలకు వచ్చినపుడు అక్క బసచేయానికి వీలవుతుందని చెబుతున్నారు. అంతేకాకుండా కొత్త జిల్లాలకు అధికారులకు బదిలీలు జరిగి ఎలాంటి ఇబ్బందులు లేకుండా నివాసాలకోసం ఆలోచించే పని కూడా ఉండదు.

కొత్తజిల్లాల అభివ్రుద్ధి దిశగా అడుగులు
రాష్ట్రంలోని 13 కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, అధికారులకు, ప్రజాప్రతినిధులకు నివాస సముదాయాలు నిర్మాణాలు చేపట్టడం ద్వారా కొత్త ప్రాంతాల్లో కూడా అభివ్రుద్ది వేగం పుంజుకుంటుందని తద్వారా కొత్త జిల్లాలకు నిజమైన గుర్తింపు, కొత్త రూపు వస్తాయని కూడా రాష్ట్ర అధికారులు చెబుతున్నారు. ఏ ప్రభుత్వంలోనూ లేని విధంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోని సీఎం వైఎస్.జగన్మోహనరెడ్డి కొత్త జిల్లాల విభజన, అభివ్రుద్ధిపై ప్రత్యేకంగా ద్రుష్టిసారించినట్టుగా కూడా కనిపిస్తుందని రాష్ట్ర ఉన్నతాధికారులు సైతం అంచనాలు వేస్తున్నారు. ప్రభుత్వ పరంగా భవనాలు, క్వార్టర్స్, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలు జరిగితే ప్రైవేటు పరంగా కూడా విద్యా సంస్థలు హోటళ్లు, కమర్షియల్ మాల్స్ ఇలా అన్ని రకాలుగా కూడా కొత్త జిల్లా కేంద్రాలు అభివ్రుద్ధి చెందే అవకాశాలు అధికంగా ఉన్నాయి. పాత ఉమ్మడి జిల్లాల్లో జరిగిన అభివ్రుద్ధి కంటే కొత్త జిల్లాలో మరింత ఎక్కువగా జరగాలంటే ప్రభుత్వపరంగా నిర్మాణాలు ఉండాలని సీఎం వైఎస్ జగన్ భావించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ ఆలోచన మేరకు అన్ని రకాల ప్రభుత్వ కార్యాలయాలు, గెస్ట్ హౌస్ లు, జిల్లా పరిషత్ ల నిర్మాణాలు జరిగితే 2024 తరువాత వచ్చే ప్రభుత్వం మరింతగా కొత్త జిల్లాలను అభివ్రుద్ధి చేయడానికి ఆస్కారం వుంటుంది. ఇప్పటికే కొత్తజిల్లా కేంద్రాలు కొద్ది కొద్దిగా రూపు రేఖలు మారుతున్న తరుణంలో ప్రభుత్వం తీసుకున్న ఈ శాస్వత ప్రభుత్వ నిర్మాణాల ఆలోచన మరింతగా అభివ్రుద్ధికి బాటలు వేయనున్నది.