ఆంధప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(APPSC) పోటీ పరీక్షలకు సంబంధించి భారీ స్థాయిలో మార్పులు తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అన్ని పరీక్షలకు సంబంధించి సిలబస్ మార్చాలని యోచిస్తున్నట్టు సమాచారం. దానికి అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయడానికి ప్రభుత్వం ఎపీపీఎస్సీ నిర్వాహకులతో సమాలోచనలు చేస్తున్నట్టు తెలిసింది. చాలా ఏళ్ల నుంచి పోటీ పరీక్షలకు సంబంధించినంత వరకూ సిలబస్ పాతదే ఉండటమే దీనికి కారణంగా పరిశీలకులు భావిస్తున్నారు. ఇప్పటి వరకూ గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-3 తోపాటు ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు సంబంధించి స్టాండర్డ్ సిలబస్ ను మాత్రమే అభ్యర్ధులు ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఆ పాత సిలబస్ తో కాకుండా మారిన పరిస్థితులకు అనుగునంగా సిలబస్ మార్చి ఇకపై వచ్చే పదేళ్లలో పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతీ ఏడాదీ ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్లు ఇచ్చి జాబ్ కేలండర్ ను కొనసాగించాలనేది ప్రభుత్వ ఆలోచనగా ఉన్నట్టు అధికారులు సైతం చెప్పుకొస్తున్నారు.
పదేళ్ల నుంచి ఒక సిలబస్సే కారణం..
ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చాలా ఏళ్ల నుంచి ఒక ఆనవాయితీని అనుసరిస్తున్నది. ప్రతీ పదేళ్లకు ఒకసారి సిలబస్ ను వివిధ పోటీపరీక్షలకు ముఖ్యంగా గ్రూప్-1, గ్రూప్-2 పరీక్షలకు మారుస్తూ వస్తున్నది. అందులోభాగంగానే ఈ ఏడాది కూడా నోటిఫికేషన్లు ఇచ్చే ముందు సిలబస్ మార్పు విషయాన్ని ప్రకటిస్తుందని కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు అంచనాలు వేస్తున్నారు. అంతేకాదు చాలా ఏళ్ల నుంచి ఈ విధానమే కొనసాగుతుండంతో పోటీపరీక్షల అభ్యర్ధులను కూడా అలెర్ట్ చేస్తూ వస్తున్నది. ప్రతీ ఏడాదీ జాబ్ కేలండర్ ను ప్రకటించకపోయినా..ప్రతీ పదేళ్లకు ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ ను మాత్రం మార్పు చేస్తూ కమిషన్ తన గుర్తింపును చాటుకుంటోంది. దానికి తోడు చాలా కాలం నుంచి గ్రూప్-1, గ్రూప్-2 నోటిఫికేషన్లు లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అభ్యర్ధులు లాంగ్ గ్యాప్ నుంచి ప్రిపరేషన్ లోనే ఉండిపోయారు.
ముందస్తుగా స్టాండర్డ్ సిలబస్ పైనే కోచింగ్..
APPSC సిలబస్ ఎప్పుడు ఏవిధంగా మార్చినా తమ కోచింగ్ సెంట్ల అభ్యర్ధులు నష్టపోకుండా అకాడమీ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఇతర జనరల్ స్టడీస్ పై కూడా కోచింగ్ సెంటర్ల నిర్వాహకులు సిలబస్ మార్పులకు అనుగుణంగా కోచింగ్ లు ఇస్తున్నారు. ప్రస్తుతం నోటిఫికేషన్లు త్వరలోనే రాబోతున్నాయనే ప్రచారం నేపథ్యంలో మారబోయే సిలబస్ కి తగ్గట్టుగా కూడా మార్పులు, చేర్పులు చేసే కోచింగ్ లు ఇస్తున్నారు. ఇటు అభ్యర్ధులు కూడా 5వ తరగతి నుంచి డిగ్రీ వరకూ పాఠ్యపుస్తకాలు, తెలుగు అకాడమీ పుస్తకాలపైనే ఎక్కువగా ద్రుష్టిపెడుతున్నారు. పైగా పోటీ పరీక్షల సరళిపై ప్రతీ ఒక్కరికీ పూర్తిగా అవగాహన పెరిగిన ద్రుష్ట్యా ప్రభుత్వం గానీ, ఎపీపీఎస్సీ గానీ సిలబస్ మార్చినా ఎక్కడా ఇబ్బంది పడకూడదనే విధంగాతోనే ప్రిపరేషన్ లో మునిగి తేలుతున్నారు అభ్యర్ధులు.
కొత్తసిలబస్ పట్ల జాగ్రత్తలు..విజయం మీదే
ప్రస్తుతం ఎపీపీఎస్సీ అన్ని పోటీ పరీక్షలకు సిలబస్ మారుస్తుందనే ప్రచారం నేపథ్యంలో అభ్యర్ధులు కూడా చాలా జాగ్రత్తలు పడాలని పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఏపీపీఎస్సీ అభ్యర్ధులను ఒడపోత పోసే విధానంలో భాగంగా సిలబస్ లో మార్పులు చేసినా దానికి అనుగుణంగానే ప్రిపరేషన్ లో తేడాలు గమనించుకొని వ్యూహాత్మకంగా ముందుకి సాగాలని సూచిస్తున్నారు. ముఖ్యంగా సమకాలీనా రాజకీయాలు, రాష్ట్రీయ, జాతీయ అంశాలతోపాటు, అంతర్జాతీయ విషయాలను, కరెంట్ అఫైర్స్ విషయంలో జాగ్రత్తలు పాటించడంతోపాటు అర్ధమెటిక్, రీజనింగ్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే..స్టాండర్డ్ గా ఉండే జనరల్ స్డడీస్ విషయంలో భయపడే పనుండదని కూడా పలువురు ప్రముఖ కోచింగ్ ఎక్స్ పర్ట్ లు తెలియజేస్తున్నారు. ప్రతీ పదేళ్లకు ఒకసారి ఏపీపీఎస్సీ సిలబస్ ను మార్పు చేయడం అనాదిగా వస్తున్న విషయమే అనే విషయాన్ని అభ్యర్ధులు పూర్తిస్థాయిలో ద్రుష్టిలో పెట్టుకొని తమ కోచింగ్ ను కూడా గత పదేళ్ల మోడల్ పేపర్లను ద్రుష్టిలో ఉంచుకొని ప్రిపరేషన్ చేసుకోవాలని..అదేవిధంగా ప్రస్తుత అంశాలను కూడా కలగలిపి చదువుకోవాలని చెబుతున్నారు. ఎప్పుడు..ఏ విధంగా ఒడపోత కార్యక్రమానికి ఎపీపీఎస్సీ తెరలేపినా అభ్యర్ధులు మాత్రం ఎక్కడా వెనుకడుగు వేయకుండా విజయ సంకల్పంతోనే ముందుకు సాగాలని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, ఈఎన్ఎస్ లైవ్ యాప్, www.enslive.net కూడా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ చెబుతోంది.!