ప్రసూతి కష్టాలు వారిని వెంటాడుతున్నాయ్


Ens Balu
9
Guntur
2022-09-02 01:11:03

మహిళ జీవితంలో తల్లికావడం ప్రతీ అమ్మకు దేవుడిచ్చిన అమూల్యమైన ఒక వరం.. అది సాఫీగా జరిగితే దానంత పండుగ మరొకటి ఉండదు.. అదే తల్లికావడం ప్రభుత్వ ఉద్యోగుల కైతే, ఒక్కోసారి అధికారులు చేసే తప్పిదాలకు ఆ ప్రసూతి కష్టాలు వారిని నిత్యం వెంటా డుతూనే ఉంటాయి.. సరిగ్గా ఇలాంటి ప్రసూతి వేధన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగులను నేటికీ వెంటాడుతూనే ఉంది.. తల్లికావడానికి తీసుకున్న ప్రసూతి సెలవుల విషయంలో వచ్చిన సాంకేతిక ఇబ్బందులు, సర్వీసు రెగ్యులర్ అయినా వారి జీతాల కోతల నష్టాలు వారిపై తీవ్రంగా పడుతున్నాయి. 6నెలల ప్రసూతి సెలవుల పొడిగింపు తరువాత సర్వీసు క్రమబద్దీకరణ జరిగినందుకు ఆనందపడాలో.. చివరి నెలలో మిగిలిపోయిన రోజులకు జీతాలు కోత పడినందుకు బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొందీ ఆ సచివాలయ ఉద్యోగులకు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆగస్టు నెల1 నుంచి క్రమబద్దీకరించిన జీతాలు రెండేళ్లు పూర్తిచేసుకున్న ఉద్యోగులకు ఇస్తున్నామని ప్రకటించింది గానీ, ప్రసూతి సెలవులు తీసుకున్నవారి విషయంలో ఏ విధమైన నిబంధనలు పాటించాలో మాత్రం తెలియజేయలేదు. దీనితో పాత పద్దతిలోనే సెలవుల గడువు ముగియకపోవడంతో( పదిరోజుల తేడాతో) ప్రసూతి సెలవులు తీసుకున్న సచివాలయ మహిళా ఉద్యోగులందరికీ  రూ.15వేలే జీతాలు వచ్చాయి.. మిగిలిపోయి పోయిన రోజుల బకాయి జీతాలు మాత్రం ఇప్పటికీ గాల్లో ఉండిపోయాయి. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు..రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొని వుంది.



రాష్ట్ర అధికారుల తప్పిదమే ప్రధాన కారణం
గ్రామ, వార్డు సచివాలయ శాఖలో రెండేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యోగులందరికీ ఉద్యోగాలను క్రమబద్దీకరించే సమయంలో, ఎవరైనా మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో ఎన్ని రోజుల్లో వారికి అదనంగా ఆరునెలలు పూర్తవుతుందనే విషయాన్ని తెలుసుకొని జీతాల బిల్లు పెట్టాలనే విషయాన్ని సూచించలేదు. దీనితో పాత పద్దతిలోనే సచివాలయ ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టడంతో పాత జీతం రూ.15వేలు మాత్రమే అందుకోవాల్సి వచ్చింది. ఉదాహరణకు జ్యోతి(పేరు మార్చాం) అనే సచివాలయ ఉద్యోగి ప్రసూతి సెలవులు తీసుకున్న సమయంలో ఆమె సెలవులు  జూలై 18కి ఆరునెలలు పూర్తయ్యాయి. కానీ సదరు ఉద్యోగికి జిల్లాశాఖ నుంచి సర్వీసు ప్రొబేషన్ డిక్లరేషన్ పూర్తి చేయలేదు. దీనితో ఆమెకు యధావిధిగా పాత పద్దతిలోనే జీతాల బిల్లు పెట్టేశారు. అలా ఆమెకు ఆ నెలలో అంటే ఆగస్టు నెల జీతం రూ.15వేలు మాత్రమే వచ్చింది. కానీ సచివాలయ ఉద్యోగులు జీతాల బిల్లులు పెట్టే సమయంలో 12 రోజు తగ్గించి జీతాల బిల్లులు పెడితే..పెరిగిన జీతం, మరుసటి నెలలో పెట్టాల్సిన జీతంతో కలిపి సాలరీ బిల్లు పెట్టడానికి ఆస్కారం ఉండేది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ఎవరూ ఆ విధంగా బిల్లులు పెట్టలేదు. కానీ మరుసటి నెల మాత్రం సర్వీస్ డిక్లరేషన్ సాలరీ బిల్ పెట్టడంతో పూర్తి జీతం వచ్చి ముందు నెల మిగిలిపోయిన 12 రోజులకు జీతం మాత్రం గాల్లోనే ఉండిపోయింది.

అధికారుల అవగాహనా రాహిత్యం..
ఒక నెలలో ఉద్యోగులకు సర్వీస్ రెగ్యులైజేషన్ పూర్తవుతున్న సమయంలో ఏ రోజుకైతే సర్వీసు పూర్తవుతుందో ఆ తేదీనాటికి సర్వీసు రెగ్యులైజేషన్ ఫైలు సదరు గ్రామ, వార్డు సచివాలయానికి రావాలి. కానీ ఆవిధంగా జిల్లా అధికారులు ఆయా ప్రభుత్వశాఖల నుంచి పంపలేదు. దీనితో సాంకేతిక ఇబ్బందులు ఏర్పడి సచివాలయాల్లో కూడా ఉద్యోగులు వారికి పూర్తిస్తాయిలో సాలరీ బిల్లులు తగ్గించిగానీ, పూర్తిస్థాయిలో గాని పెట్టలేక..పాత పద్దతిలోనే పెట్టారు. ఈ విధంగా పెట్టడం ద్వారా ఒక నెలలో మిగిలిని పోయిన రోజులకు ఇపుడు సదరు ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులకు సాలరీ బిల్లులు ఏ విధంగా పెట్టాలనే విషయమై అధికారులు, సిబ్బంది మల్లగుల్లాలు పడుతున్నారు. ఎంత జీతం తగ్గించి పెట్టాలో తెలియక, మరెంత జీతం పెంచి మరుసటి నెలలో పెట్టాలో బోధపడక చాలా సచివాలయాల్లో సర్వీసు రెగ్యులర్ అయినా చాలా మందికి జీతాల బిల్లులు పెట్టలేదు. దీనితో ప్రసూతి సెలవులుు తీసుకున్న ఉద్యోగులకు పూర్తిస్థాయి జీతాలు రాలేదు. కొన్ని చోట్లు కొత్త జీతాలు వచ్చినా..ముందు నెలలో మిగిలిపోయిన జీతాలను వారంతా కోల్పోవాల్సి వచ్చింది. కొత్త జీతం వచ్చిందనే ఆనందంలో ఆ పదిరోజుల జీతం వదిలేద్దామనుకుంటే సర్వీస్ క్రమబద్దీకరణ జరిగిన సమయంలో పూర్తిస్థాయిలో జీతం తీసుకోనందుకు కారణం ప్రభుత్వానికి లిఖితపూర్వకంగా తెలియాల్సి వుంటుంది. అలా తెలియజేస్తే సచివాయాల్లో సిబ్బంది చేసిన తప్పుని ఒప్పుకోవాలి..అలా చేయని సిబ్బంది ఏటూ తేల్చుకోలేక తీవ్రఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందితో ఎటూ పాలుపోని స్థితిలో ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగులు తీవ్ర మనో వేదనకు గురవుతున్నారు.


చేతులెత్తేసిన ఖజానా శాఖ..
ఎలాంటి ముందస్తు సమాచారం గ్రామ, వార్డు సచివాలయ శాఖ అధికారులు సచివాలయాల్లో పనిచేసే సిబ్బందికి సూచించకపోవడంతో  పాత పద్దతిలోనే సాలరీ బిల్ పెట్టడం ద్వారా మహిళా ఉద్యోగులు ముందు నెలలో మిగిలిపోయిన జీతం కోల్పోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని ట్రజరీ అధికారుల ద్రుష్టికి తీసుకెళితే అంతా అయిపోయిన తరువాత తామేంచేస్తామని వారు కూడా చేతులెత్తేశారు. ఈ సమస్య ఒకరో, ఇద్దరో పడితే ఏదో అనుకోవచ్చు  జూలై, ఆగస్టు నెలలకి తీసుకున్న ఆరు నెలల సెలవులకి రెండేళ్లు పూర్తిచేసుకున్న మహిళా ఉద్యోగులంతా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వీరికోసం కొందరు సీనియర్ పంచాయతీ కార్యదర్శిలు ప్రస్తుతం ట్రజరీ అధికారులు, సిబ్బందితో సంప్రదింపులు జరిపినా ఫలితం మాత్రం రావడం లేదు. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏదైనా అధికారిక ఉత్తర్వులు వస్తే తప్పా తామేమీ చేయలేమని ట్రజరీ అధికారులు తెగేసి చెబుతున్నారు. జీతాల్లో తీవ్రమైన కోత నష్టంతో ఇబ్బంది పడుతున్న ప్రసూతి సెలవులు తీసుకున్న మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏమైనా ప్రకటన జారీ చేస్తుందా..లేదంటే ట్రజరీ అధికారులు ద్వారా ప్రత్యేక మార్గాన్ని చూపిస్తుందా అనేది నేటికీ తేలలేదు. ఇదే పద్దతి కొనసాగితే రానున్న రోజుల్లో ఇంకా సర్వీసు పూర్తికాకుండా, ప్రసూతి సెలవుల్లోనే ఉండిపోయిన మహిళా ఉద్యోగులు కూడా పెద్ద మొత్తంలో జీతాలు కోల్పోవాల్సి వస్తుంది. చూడాలి జీతాలు నష్టపోయిన గ్రామ, వార్డు సచివాలయ మహిళా ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం ఏవిధమైన పరిష్కారం చూపిస్తుందనేది..!