రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ ఛైర్మన్ కేసలి అప్పారావు, సభ్యులు త్రిపర్ణ ఆదిలక్ష్మి, ముడిమేల లక్ష్మీదేవి బుధవారం ఉదయం తిరుమలలోని వేద పాఠశాల, కల్యాణవేదికను పరిశీలించారు.వేద పాఠశాలలో విద్యార్థులతో సమావేశమయ్యారు. అక్కడి వసతులు, తరగతి గదులను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. బాలలకు ఒత్తిడి లేకుండా క్రమశిక్షణతో కూడిన విద్య అందించాలని సూచించారు. కల్యాణవేదికలో వివాహాలకు అనుమతి ఇచ్చే విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. బాల్య వివాహాలు జరుపరాదని బోర్డులు ప్రదర్శించాలని సూచించారు. అనంతరం శ్రీవారి ఆలయ పరిసరాలు, ముఖ్యమైన కూడళ్లలో భిక్షాటన చేస్తున్న బాలలను గుర్తించి వారికి పునరావాసం కల్పించాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు షాపింగ్ కాంప్లెక్స్, అతిథి గృహాల నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాలను కమిషన్ పరిశీలించింది. కమిషన్ వెంట టిటిడి ఎస్ఇ-2 జగదీశ్వర్‌రెడ్డి, డిసిపివో సురేష్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, లైజాన్ ఆఫీసర్ ఆనందరాజు, డెప్యూటీ ఈవో సెల్వం, విజివో బాలిరెడ్డి, కల్యాణకట్ట ఏఈవో రమాకాంత్ తదితరులు ఉన్నారు.