ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్పు నిర్ణయాన్ని నిరసిస్తూ అధికార భాషా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ప్రకటించారు. ఈ మేరకు విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ పేరు మార్పు నిర్ణయం సరికాదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహానుభావుడి పేరు ఆరోగ్య వర్సిటీకి ఉంచాలన్నదే తన అభిప్రాయమని కుండ బద్దలు కొట్టారు. ఎన్నో ఏళ్ల నుంచి వున్న ఎన్టీఆర్ పేరు మార్చడం, ఎన్టీఆర్ అభిమానుల మనసు గాయపడటంతోపాటు, ఆ మహానుభావుని ఆత్మకూడా క్షోభిస్తుందన్నారు. ఆయన పేరు మార్పును తట్టుకోలేక బాధతోనే తాను ప్రస్తుతం ఉన్న పదవికి రాజీమా చేస్తున్నానని చెప్పారు. తన రాజీమా లేఖను ప్రభుత్వానికి పంపించానని చెప్పారు. మరోవైపు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. వర్సిటీ పేరు మార్పు నిర్ణయంపై టీఎన్‌టీయూసీ, తెదేపా నేతలు ఆందోళనకు దిగారు. ఇటు వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం హెల్త్ యూనివర్శిటీకి డా.వైఎస్సార్ హెల్త్ యూనివర్శిటీ పేరు చక్కగా వుందంటూ తమ వాదనని వినిపిస్తున్నారు.