రాష్ట్ర ఐఏఎస్ అధికారుల్లో కోల్డ్ వార్..పోటా పోటీ ఉత్తర్వులు


Ens Balu
107
Guntur
2022-09-28 03:22:18

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ పుణ్యమాని రాష్ట్రప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలు,  ముఖ్య అధికారుల మధ్య కోల్డ్ వార్ మొదలైంది. దిశా నిర్ధేశం లేని వ్యవస్థలో 19 ప్రభుత్వశాఖల ప్రన్సిపల్ సెక్రటరీలు పోటా పోటీగా ఉత్తర్వులు ఇస్తూ జిల్లాల కలెక్టర్లు, సచివాలయ ఉద్యోగులను గంధరగోళానికి గురిచేస్తున్నారు. ఇదే అదునుగా జిల్లా, మండల స్థాయి అధికారులు, పంచాయతీలు, సచివాలయాల్లోని కార్యదర్శిలు కూడా తమ ప్రతాపాన్ని సిబ్బందిపైనే చూపిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి ప్రభుత్వ శాఖల ముఖ్యకార్యదర్శిలు, కమిషనర్లు ఎవరికి వారే తమ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్టుగా తాజాగా విడుదలైన ఉత్తర్వులే రుజువు చేస్తున్నాయి. ఫలితంగా ప్రజలకు ఇంటి ముంగిట అందాల్సిన ప్రభుత్వ సేవలు అటకెక్కుతున్నాయి. సిబ్బంది వారి వారి మత్రుశాఖల విధుల కంటే అదనపు ప్రభుత్వశాఖల పనులు అధికంగా చేయాల్సి వస్తున్నది. ఎవరు ఏ శాఖ ఉద్యోగులో వారికే తెలియని అయోమయ పరిస్థి నెలకొంది. అన్ని ప్రభుత్వశాఖల్లోనూ రాష్ట్రస్థాయి నుంచి మండల స్థాయి వరకూ ఇన్చార్జి వ్యవస్థలు కొనసాగుతుండటంతో పరిపాలన వ్యవస్థ గాడితప్పుతున్నదా అనే అనుమానాన్ని ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు 26 జిల్లాల కలెక్టర్లుకి ఇచ్చిన ఉత్తర్వులు రుజువుచేస్తున్నాయి.

ఒకరు చేయాలని ఉత్తర్వులిస్తే..మరొకరు తొలగించమని ఆదేశాలు
ప్రభుత్వ శాఖల్లోని ప్రిన్సిపల్ సెక్రటరీలు గ్రామ, వార్డు సచివాలయశాఖలోలని 19 శాఖల సిబ్బందికి అన్ని రకాల పనులు చేయాలని ఉత్తర్వులు జారీచేస్తే..తమ శాఖ సిబ్బందికి ఆ పనులు చెప్ప వద్దంటూ మరోశాఖ ముఖ్యకార్యదర్శి జిల్లా కలెక్టర్లకు ఉత్తర్వుల ద్వారా ఆదేశాలు వస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది మాత్రమే కాదు ఇటు జిల్లాల కలెక్టర్లు కూడా ప్రభుత్వశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు చేసే ఆదేశాలతో తలలు పట్టుకుంటున్నారు. వెరసీ రాష్ట్రశాఖల అధికారుల మధ్య కోల్డ్ వార్ ఉత్తర్వుల రూపంలో సచివాలయ సిబ్బందిపైనే తీవ్ర ప్రభావం చూపుతోంది. అలాగని క్రిందిస్థాయిలో జిల్లా అధికారులు, మండల అధికారులు, పంచాయతీ కార్యదర్శిలు ముందుగా వచ్చిన ఆదేశాలను అమలు చేసి, ఆ తరువాత మరోశాఖ కార్యదర్శి ఇచ్చిన ఆదేశాలను అమలు చేయడానికి ఎక్కడలేని నొప్పులన్నీ పడుతున్నారు. జిల్లాల్లో అయితే జిల్లా కలెక్టర్ నుంచి వచ్చిన ఉత్తర్వులను తప్పా.. మండల అధికారులు ఏ ప్రభుత్వ శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినా వాటినైనా బుట్టదాఖలు చేస్తున్నారు. అలాగని జిల్లా కలెక్టర్లు సైతం ప్రభుత్వశాఖల నుంచి వచ్చిన ఉత్తర్వులను జిల్లాశాఖల అధికారుల ద్వారా ప్రాపర్ ఛానల్ లో మండల అధికారులకు పంపడం లేదు. పంపినా వాటిని వెంటనే అమలు చేయాలని ఆదేశాలివ్వడం లేదని అధికారులే చెబుతున్నారు.

నాడు 3సార్లు అందరికీ బయో మెట్రిక్..నేడు కొందరికి రెండుసార్లే
గ్రామ, వార్డు సచివాలయాల్లో 19శాఖల సిబ్బంది ఖచ్చితంగా మూడు సార్లు బయోమెట్రిక్ అటెండెన్సు వేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే..కొన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది కేవలం తమ శాఖ సిబ్బంది రోజుకి రెండుు సార్లు మాత్రమే బయోమెట్రిక్ వేస్తారని, వారికి మూడుసార్లు అటెండెన్సు అవసరం లేదని ఉటంకిస్తూ..అన్ని జిల్లాల కలెక్టర్లకు పలుశాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలు ఉత్తర్వులు జారీచేశారు. దీనితో పనిచేసే కొందరు సచివాలయ సిబ్బందికి రోజూ మూడు సార్లు వేసే బయో మెట్రిక్ అటెండెన్సు నుంచి మినహాయింపు వచ్చింది. ఇలా కొన్ని శాఖలకు మినహాయింపు ఇవ్వడంతో మిగిలిన శాఖల కమిషనర్లు, ప్రిన్సిపల్ కార్యదర్శిలు కూడా తమశాఖ సిబ్బందికి ఎలాంటి అదనపు పనులూ అప్పగించవచ్చదని మరొకొన్ని ఉత్తర్వులు జారీచేశారు. ప్రభుత్వం నుంచి కొన్నిశాఖల సిబ్బంది కోసమే వచ్చిన ఉత్తర్వులు మిగిలినశాఖల సిబ్బందికి తీవ్ర మనస్థాపాన్ని కలిగిస్తున్నాయి.

మా శాఖ సిబ్బందికి బిఎల్వో డ్యూటీలు వేయకండి..
భారత ఎన్నికల సంఘం, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఎలా ఉన్నా..వారి ప్రభుత్వశాఖల పనులు కాకుండా గ్రామ, వార్డు సచివాలయాల్లోని అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికీ బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులు అదనంగా వేసి మాత్రుశాఖల విధులకు పక్కన పెట్టేవిధంగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. దీనితో సచివాలయ సిబ్బంది వారి వారి శాఖల ప్రధాన విధులను పక్కనబెట్టి, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆదేశాలు, మండల స్థాయిలో తహశీల్దార్ల ఆదేశాలకు, హెచ్చరికలకు భయపడి బిఎల్వో విధులనే చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించిన రాష్ట్రశాఖల కమిషనర్లు తమ శాఖ సిబ్బందికి బిఎల్వో విధులు తప్పించాలని, అదేవిధంగా బయో మెట్రిక్ మూడు సార్లు కూడా వేయరని మళ్లీ తాజాగా జిల్లా కలెక్టర్లకు లిఖిత పూర్వక ఆదేశాలు జారీచేశారు. ఇలా ఎవరి శాఖలకు సంబంధించిన ముఖ్యకార్యదర్శిలు, కమిషర్లు వారి వారి శాఖల సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఉత్తర్వులు ఇవ్వడం చర్చనీయాంశం అవుతోంది.

రాష్ట్రశాఖల అధికారుల్లో కొరవడిన సమన్వయం..
ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో గ్రామస్థాయిలోనే ప్రజలకు అన్ని ప్రభుత్వ శాఖల ద్వారా సేవలు అందించాలనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయాల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు, ప్రభుత్వశాఖల మధ్య కొరవడిన సమన్వయంతో ఎవరికి తోచిన విధంగా వారు వ్యవహరిస్తున్నారు. ఒక శాఖ అధికారి సచివాలయ సిబ్బంది మొత్తం తమ శాఖ సూచించిన విధులు నిర్వర్తించాలని ఆదేశిస్తే..మరోశాఖ అధికారా ఆ విధుల నుంచి తమ శాఖ సిబ్బందికి ఎలాంటి విధులూ అప్పగించకూడదని మరో ఉత్తర్వు జారీచేస్తున్నారు. ఈ విధానం చూస్తుంటే అసలు రాష్ట్రప్రభుత్వ ముఖ్యకార్యదర్శికి, ఇతర ప్రభుత్వ శాఖల ప్రిన్సిపల్ కార్యదర్శిలకు, కమిషనర్లకు శాఖల మధ్య అవగాహన లేదనే విషయం స్పష్టమవుతున్నది. వాస్తవానికి సచివాలయాల్లోని 19శాఖల సిబ్బందికి వారి ప్రభుత్వ శాఖలకు చెందిన విధులు, పనులు కాకుండా అదనపు విధులు అప్పగించడం ద్వారా ఏ లక్ష్యంతో అయితే వీరిని ఉద్యోగాల్లో నియమించారో ఆ పని జరగకుండా అదనపు విధులు మోకాలడ్డుతున్నాయి. దీనితో ఏ శాఖకు చెందిన రాష్ట్ర అధికారులు, వారి శాఖల సిబ్బందికోసం, వారి శాఖలో పేరుకు పోతున్న సమస్యలు, సంక్షేమ పథకాల అమలు కోసం ఒక శాఖ జారీచేసిన విధులను రద్దు చేయాలని మరో ఉత్తర్వులు జారీచేస్తున్నారు. ప్రస్తుతం ఇదే అంశం రాష్ట్రంలో హాట్ టాపిక్ గా మారింది. అన్ని ప్రభుత్వశాఖలకు గ్రామస్థాయిలో సిబ్బంది ఉన్నారు కనుక వారి వారి శాఖల పనుల పురోగతిపై కాకుండా అన్ని రకాల పనులను అందరికీ అప్పగించడంతో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడింది. చూడాలి ఈ వ్యవహారం ముందు ముందు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అనేది..!