తిరుమల శ్రీవారి దర్శనార్థం విచ్చేసే భక్తులకు ప్రేమతో సేవలు అందించడంతోపాటు టిటిడి వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న శ్రీనివాస కల్యాణాలు, వైభవోత్సవాలు లాంటి ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని సనాతన ధర్మ రథసారథులుగా నిలుస్తున్నారని టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి ఉద్ఘాటించారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు విచ్చేసిన శ్రీవారి సేవకులకు తిరుమల ఆస్థానమండపంలో బుధవారం అవగాహన సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛైర్మన్ మాట్లాడుతూ శ్రీవారి భక్తులకు సేవలందించడం శ్రీవారి సేవకుల అదృష్టమన్నారు. భక్తులకు సేవలందించేందుకు 22 సంవత్సరాల క్రితం శ్రీవారి సేవను ప్రారంభించినట్టు చెప్పారు. ఇప్పటివరకు దేశం నలుమూలల నుండి 13 లక్షల మందికి పైగా సేవకులు పాల్గొన్నారని వెల్లడించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భక్తులకు సేవలందించేందుకు ఏడు రాష్ట్రాల నుంచి 3500 మంది సేవకులు వచ్చారని తెలిపారు. రానున్న కాలంలో అన్ని జిల్లాల నుండి సేవకుల సంఖ్య పెంచాలని సూచించారు. తిరుమలతోపాటు తిరుపతిలోని స్థానికాలయాల్లో కూడా సేవకులు సేవలందిస్తున్నట్టు చెప్పారు. దీంతో పాటు పరకామణి సేవకూడా ఉందన్నారు. రూ.23 కోట్లతో నిర్మించిన నూతన పరకామణి భవనాన్ని బుధవారం ముఖ్యమంత్రివర్యులు శ్రీ వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా పలువురు శ్రీవారి సేవకులు మాట్లాడుతూ శ్రీవారి సేవ చేసే అవకాశం రావడం భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తున్నట్టు తెలిపారు.
శ్రీవారి సేవకుల కోసం క్యూ ఆర్ కోడ్ ప్రారంభం
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్ కోడ్ విధానాన్ని టిటిడి ఛైర్మన్ శ్రీ వైవి.సుబ్బారెడ్డి తిరుమల ఆస్థానమండపంలో ప్రారంభించారు. మొదటగా ఒక శ్రీవారి సేవకుడు క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ఆ ప్రాంతానికి వెళ్లే మార్గాన్ని తెలుసుకున్నారు. దశలవారీగా భక్తుల కోసం వివిధ ప్రాంతాల్లో ఈ క్యూఆర్ కోడ్‌లను అందుబాటులో ఉంచనున్నారు. ఈ కార్యక్రమంలో టిటిడి ఈవో ఎవి.ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు పోకల అశోక్‌కుమార్, జెఈవో వీరబ్రహ్మం, సివిఎస్వో నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సీఈవో షణ్ముఖ్ కుమార్, విజివో బాలిరెడ్డి, టిటిడి ప్రజాసంబంధాల అధికారి డా.టి.రవి, సహాయ ప్రజాసంబంధాల అధికారి పి.నీలిమ, శ్రీవారి సేవ ఏఈవో నిర్మల, శ్రీవారి సేవ సిబ్బంది పాల్గొన్నారు.