చిత్తడి నేలల పరిరక్షణకు ప్రత్యేక కార్యాచరణ


Ens Balu
21
Tadepalli
2022-09-28 15:44:11

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని అరుదైన జీవజాలంకు ఆల‌వాలంగా ఉన్న చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై ప్ర‌త్యేక దృష్టి సారించాల‌ని రాష్ట్ర అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, ఇంధ‌న‌, సైన్స్ అండ్ టెక్నాల‌జీ, గ‌నుల‌శాఖ మంత్రి  పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అట‌వీ అధికారుల‌ను ఆదేశించారు. అమ‌రావ‌తిలోని స‌చివాలయంలో బుధ‌వారం అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌శాఖ అధికారుల‌తో వెట్ ల్యాండ్ బోర్డ్ తొలి స‌మావేశం మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి అధ్య‌క్ష‌త‌న జరిగింది. ఈ స‌మావేశంలో మంత్రి పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలోని చిత్త‌డినేల‌ల్లో జీవ వైవిధ్యాన్ని ప్ర‌తిభింబిస్తూ అనేక ర‌కాల జంతువులు, ప‌క్షులు, జీవ‌జాలం మ‌నుగ‌డ‌ను సాగిస్తున్నాయ‌ని అన్నారు. కొల్లేరు, నేల‌ప‌ట్టు, పులికాట్, కొరింగ‌, శ్రీ‌కాకుళంలోని ప‌లు ప్రాంతాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్నాయ‌ని అన్నారు. కొల్లేరు, పులికాట్ ప్రాంతంలోని చిత్త‌డి నేల‌ల్లో అరుదైన విదేశీ ప‌క్షులు వేల కిలోమీట‌ర్ల మేర ప్ర‌యాణం చేసి, ఈ ప్రాంతంలో త‌మ సంతానాన్ని అభివృద్ధి చేసుకుంటున్నాయ‌ని తెలిపారు. 

వీటితో పాటు అంత‌రించుపోతున్న ప‌లు జంతువులు, జీవ‌జాలాలు చిత్త‌డి నేల‌ల్లో ప్ర‌కృతి ఒడిలో మ‌నుగ‌డ సాగిస్తున్నాయ‌ని అన్నారు. ఇటువంటి చిత్త‌డి నేల‌ల‌ను కాపాడుకోవాల‌ని ఇరాన్ లోని రామ్ స‌ర్ లో జాతీయ క‌న్వెన్స‌న్ జ‌రిగింద‌ని, ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌లు దేశాలు పాల్గొని ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌, జీవివైవిధ్యంను కాపాడుకునేందుకు తాము కూడా భాగ‌స్వాములు అవుతామ‌ని స్ప‌ష్టం చేశాయ‌ని గుర్తు చేశారు. చిత్త‌డి నేల‌ల ప‌రిర‌క్ష‌ణ‌పై 2019, 2017లో కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌త్యేక చ‌ట్టాలు చేసింద‌ని తెలిపారు. వాటి ఆధారంగా రాష్ట్రంలోనూ వెట్ ల్యాండ్ బోర్డ్ ఏర్పాట‌య్యింద‌ని, అయితే ఈ బోర్డ్ స‌మావేశాలు గ‌తంలో జ‌ర‌గ‌లేద‌ని తెలిపారు. ప్ర‌స్తుతం నిర్వ‌హించిన‌ తొలి స‌మావేశం సంద‌ర్బంగా అట‌వీశాఖ అధికారులు చిత్త‌డి నేల‌ల సంర‌క్ష‌ణ‌పై ప్ర‌త్య‌క దృష్టి సారించాల‌ని కోరుతున్న‌ట్లు తెలిపారు. 

కేంద్ర‌ప్ర‌భుత్వం మ‌న రాష్ట్రంలో మొత్తం 30వేల ఎక‌రాల్లో చిత్త‌డి నేల‌లు ఉన్న‌ట్లు గుర్తించింద‌ని మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామ‌చంద్రారెడ్డి తెలిపారు. వివిధ జిల్లాల్లో విస్త‌రించి ఉన్న ఈ నేల‌ల్లో కొంత మేర ఆక్ర‌మ‌ణ‌లు జ‌రిగిన‌ట్లు తెలుస్తోంద‌ని అన్నారు. కొల్లేరు ప్రాంతంలో 5 నుంచి 2 వ కాంటూరు వ‌ర‌కు చేప‌ల చెరువులు విస్త‌రించాయ‌ని అన్నారు. మ‌రికొన్ని ప్రాంతాల్లో సీజ‌న‌ల్ గా వ్య‌వ‌సాయం, ఇత‌ర పంట‌లు సాగు చేస్తున్నారని తెలిపారు. వీట‌న్నింటిపైన నిర్ధిష్ట‌మైన స‌మాచారం రూపొందించేందుకు రెవెన్యూ, వ్య‌వ‌సాయం, అట‌వీశాఖ అధికారుల‌తో క‌మిటీ ఏర్పాటు చేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు.  రెండు నెల‌ల్లో ఈ క‌మిటీ ప్రాథ‌మిక నివేదిక‌ను వెట్ ల్యాండ్ బోర్డ్ కు స‌మ‌ర్పిస్తుంద‌ని తెలిపారు. అటు ప్ర‌జ‌ల జీవ‌నోపాధుల‌కు విఘాతం లేకుండా, ఇటు చిత్త‌డి నేలల్లో జీవ‌జాలం మ‌నుగ‌డ‌కు ముప్పు లేకుండా వెట్ ల్యాండ్ బోర్డ్ ఆధ్వర్యంలో అవ‌సర‌మైన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు. ఈ స‌మావేశంలో అట‌వీశాఖ స్పెష‌ల్ చీఫ్ సెక్ర‌ట‌రీ నీర‌బ్ కుమార్ ప్ర‌సాద్, అట‌వీద‌ళాల అధిప‌తి మ‌ధుసూధ‌న్ రెడ్డి, పిసిపిఎఫ్ ఎకె ఝా, స్పెష‌ల్ క‌మిష‌న‌ర్ శాంతిపాండే త‌దిత‌రులు పాల్గొన్నారు.