గ్రామస్వరాజ్య సాధన దిశగా సచివాలయాలు


Ens Balu
47
Guntur
2022-10-02 07:10:53

గాంధీజి కలలు గన్న గ్రామ స్వరాజ్యం కోసం భారతదేశంలోనే ప్రప్రధమంగా ఏర్పాటైన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు నేటితో ముచ్చటగా మూడేళ్లు పూర్తయ్యాయి. ఇంటి ముంగిటే ప్రజలకు పూర్తిస్థాయిలో ప్రభుత్వ సేవలు అందించాలనే లక్ష్యంతో సుమారు 19శాఖల సిబ్బందిని ఒకే గూడులో ఏర్పాటు చేసిన సచివాలయ వ్యవస్థ గ్రామ స్వరాజ్యం సాధించే దిశగా అడుగులు వేస్తోంది. ఏపీలోని 26 జిల్లాల పరిధిలోని ఒక లక్షా 21వేల మంది ఉద్యోగులు ఈ శాఖలోని 14వేల 5 సచివాలయాల ద్వారా సేవలులు అందిస్తున్నారు. ఒక్క గ్రామసచివాలయం ద్వారానే 750 ప్రభుత్వ సేవలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్న రాష్ట్రప్రభుత్వం సేవలను విడతల వారీగా అందుబాటులోకి తీసుకుస్తూ ప్రజలకు సచివాలయాలను చేరువ చేస్తున్నది. దేశంలో ఏ రాష్ట్రప్రభుత్వం చేపట్టని విధంగా ఏపీ ప్రభుత్వం  ఏర్పాటు చేసిన ఈ గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఇపుడు దేశం మొత్తాన్ని రాష్ట్రంవైపు చూపు తిప్పుకునేలా చేస్తున్నది.

గ్రామంలోనే స్పందన పరిష్కారాలు
గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ప్రజా సమస్యల వేదిక స్పందనను అన్ని సచివాలయాల్లోనూ ఏర్పాటు చేసి అక్కడే సమస్యలు పరిష్కరించేలా క్రుషి చేస్తున్నది. ఒకప్పడు స్పందన కార్యక్రమం అంటే జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వెళ్లే ప్రజలు ఇపుడు గ్రామ, వార్డు సచివాలయాల్లోని తమ సమస్యలను విన్నవించుకొని ఇప్పుడిప్పుడే పరిష్కారాలు పొందుతున్నారు. తద్వారా వివిధ ప్రభుత్వశాఖలకు చెందిన చాలా వరకు పనులు ఇక్కడే పరిష్కారమవుతున్నాయి. ఒకప్పుడు ఆధార్ కార్డు చేయించుకోవాలన్నా మండల కేంద్రానికి వెళ్లాల్సి వచ్చేది. ఇపుడు ఆ సేవలు కూడా సచివాలయాల్లోనే అందుబాటులోకి వచ్చాయి. అన్ని రకాల ద్రువీకరణ పత్రాలు, సర్టిఫికేట్లు సచివాలయాల ద్వారానే ప్రభుత్వం ప్రజలకు అందించే ఏర్పాటు చేస్తున్నది.

గ్రామాల్లోనే ప్రభుత్వ కార్యాలయాలు
ప్రభుత్వ కార్యాలయాలంటే ఒకప్పుడు మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లోనే ఉండేవి. కానీ గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు అయిన తరువాత గ్రామ, వార్డు సచివాలయం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఆర్బీకేలు ఏర్పాటు చేసి ఒక్కోచోట మూడు పక్కా ప్రభుత్వ భవనాలను ప్రభుత్వం నిర్మించింది. దీనితో ప్రతీ గ్రామంలోనూ ఇపుడు ప్రభుత్వ కార్యాలయాలు సిబ్బందితో కళ కళ లాడుతున్నాయి. 104, 108 సేవలు కూడా పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలోనే విలేజ్ క్లినిక్ ప్రారంభం అయితే గ్రామాల్లోనే అవ్వా, తాతలకు ప్రాధమిక వైద్యసేవలు కూడా గ్రామాల్లోనే అందించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు పూర్తయిన తరుణంలో ప్రజలకు కూడా అన్ని అంశాలపై అవగాహన వస్తున్నది.

జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు ద్రుష్టిసారిస్తే మరిన్ని ఫలితాలు..
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాలపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని కమిషనర్లు ద్రుష్టిసారిస్తే మరిన్ని మెరుగైన ఫలితాలు తీసుకు రావడానికి ఆస్కారం ఉంది. అయితే ఈ విషయంలో అధికారులు అంటీ ముట్టనట్టు వ్యవహరించడం వలన ఇంకా గ్రామ సచివాలయాల్లో అందే సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహనలేదనే విషయం ప్రతీ సోమవారం జాల్లా కలెక్టర్ కార్యాలయం, కమిషనరేట్ లలో నిర్వహించే స్పందనలో ప్రజల నుంచి వచ్చే అర్జీలే స్పష్టం చేస్తున్నాయి. కలెక్టర్, కమిషనర్ గ్రామ, వార్డు సచివాలయాలను సందర్శించే సమయంలో ప్రభుత్వం ఉద్యోగులకు ఇచ్చే యూనిఫాం, ఉద్యోగుల డ్యూటీచార్ట్, స్పందన దరఖాస్తులు, పారిశుధ్యం, వినతుల పరిష్కారం, సచివాలయ సేవలపై ప్రజల్లో అవగాహన పెంచే విషయం, ప్రాపర్ ఛానల్ విధానాలు, శాఖాపరమై విధులు, బాధ్యతలు(గ్రామ సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్, కమిషనర్ కార్యాలయం, మండల కార్యాలయాలు, జిల్లాశాఖల కార్యాలయాలు, రాష్ట్ర ప్రభుత్వ శాఖల నుంచి వచ్చే జీఓలు, వాటిని ఒక విధానంలో అమలు చేసే ప్రక్రియ)పై అధికారులు ద్రుష్టి సారించడం లేదు.

ఈ విషయంలో మండల, జిల్లా అధికారులను బాధ్యులను చేస్తూ జిల్లా కలెక్టర్, కమిషనర్ లు ప్రత్యేకంగా ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ లక్ష్యం ఈపాటికే పూర్తిస్థాయిలో నెరవేరి గ్రామ స్వరాజ్య స్థాపన జరిగేదనే విషయాన్ని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు. ముఖ్యంగా మండలాలు, జిల్లాల్లో అధికారులు పూర్తిస్థాయి అధికారులు కాకపోవడం, ఇన్చార్జి పాలనే పూర్తిస్థాయిలో కొనసాగం, చాలా సంవత్సరాల తరువాత కార్యదర్శిల నుంచి జిల్లాఅధికారుల వరకూ ఎక్కువ మంది సిబ్బందిని ఒకేచోట చూడటం, ఆపై తమలోని ప్రత్యేకను సిబ్బందిపై రుద్దడం తదితర అంశాలు కూడా ప్రజా సేవలకు విఘాతం కలిగిస్తున్నాయి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని 19ప్రభుత్వ శాఖలకు చెందిన రాష్ట్రశాఖల ముఖ్యకార్యదర్శిల నుంచి జీఓలు నేటికీ అమలుకు నోచుకోవడం లేదు. దానిపై జిల్లా కలెక్టర్లు, కమిషనర్లు సైతం ద్రుష్టి సారించడం లేదు. ఒక్కోసారి సదరు జీఓలు మండల కేంద్రాలకు వచ్చినా వాటిని ఎంపీడీఓలు పరిగణలోకి కూడా తీసుకోవడం లేదు. ఈ విషయాల్లో ప్రభుత్వం పూర్తిస్థాయిలో ద్రుష్టిసారిస్తే ప్రభుత్వ లక్ష్యం నెరవేరి పూర్తిస్థాయిలో గాంధీజి కలలు గన్న గ్రామస్వరాజ్యం గ్రామాల్లో సిద్ధిస్తుందనే వాదన కూడా సర్వత్రా బలంగా వినిపిస్తోంది..!