ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా సంచనలం రేపుతున్నాయి. దేశ చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా కొత్త విధానాలను అమలు చేయడం, వాటిని ఐఏఎస్, ఐపీఎస్ లాంటి సివిల్ సర్వీసు అధికారులతో సైతం పాటించేలా చేయడం ఇపుడు పెద్ద ఎత్తున చర్చకు దారి తీస్తున్నాయి. అటెండర్ నుంచి ఐఏఎస్ వరకూ అందరూ అధికారులేనని..వారంతా విధి నిర్వహణకు వచ్చినపుడు అటెండెన్సు తప్పక వేయాలనే నిర్ణయం ఇపుడు ఏపీలోని సివిల్ సర్వీస్ అధికారులను సైత ఆలోచింపచేస్తున్నది. ప్రభుత్వ అధికారులు, సిబ్బందితో పాటు ఇపుడు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఇలా అందరు అధికారులు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేయాలి. దానికోసం యాప్ డౌన్ లోడ్ చేయాలి.
ఇప్పటికే ఈ విధానం రాష్ట్ర సచివాలయంలోని ఐఏఎస్ లకు ఇతర రాష్ట్రస్థాయి అధికారులకు అమలు చేయగా.. దానిని 26 జిల్లాల్లోనూ అమలు చేయనున్నారు. ఇప్పటికే అధికారులంతా ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని జీఏడీ నుంచి అందరికీ ఆదేశాలొచ్చాయి. ప్రభుత్వంలో ఉన్నతాధికారులు ఒక విధానంలో అటెండెన్సు వేస్తే అదేవిధంగా క్రింది స్థాయి అధికారులు, సిబ్బంది పాటిస్తారనేది ప్రభుత్వ ఆలోచన దీనికోసం నిర్ణయం తక్షణమే అమల్లోకి రావడం విశేషం. ఇప్పటి వరకూ బయో మెట్రిక్ అటెండెన్సు మాత్రమే ప్రభుత్వశాఖల్లో అందుబాటులో ఉండేది. ఇపుడు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారానే అన్ని శాఖల వారు అటెండెన్సు వేయాల్సి వుంటుంది.
ఇలా చేయడం ద్వారా విధి నిర్వహణలో జవాబుదారీతనం వుంటుందని, జిల్లా కార్యాలయంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ద్వారా అటెండెన్సు వేసిన అధికారులు వారి పర్యటనలో కూడా ముఖ్యంగా దీనినే పర్యవేక్షణ చేస్తారని సీఎం కార్యాలయం భావిస్తోంది. చాలా చోట్లు బయో మెట్రిక్ అటెండెన్సులు వున్నా దానిని సక్రమంగా నిర్వహణ చేయడం లేదు. వినియోగించడం లేదు. దీనిని పూర్తిస్థాయిలో గమనించిన ప్రభుత్వం తొలుత ఐఏఎస్ అధికారులకు ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్సు అమలు చేస్తే అన్నిశాఖల అధికారుల్లోనూ, సిబ్బంది విధిగా పాటిస్తారని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అటెండెన్సు ద్వారా సివిల్ సర్వీస్ అధికారుల నుంచి వ్యతిరేకత ఎదురైనా ప్రభుత్వం మాత్రం దానిని పట్టించుకోలేదు.
ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో రాష్ట్రంలోని అందరు ఐఏఎస్ అధికారులతోపాటు మిగిలిన సివిల్ సర్వీస్ అధికారులంతా ఇపుడు వారి వారి మొబైల్ ఫోన్ లలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ ని ఇనిస్టాల్ చేస్తున్నారు. ఈ విధానం ఎంత పక్కాగా మిగిలిన శాఖల్లోని అధికారులు, సిబ్బందితో ప్రభుత్వం అమలు చేస్తుందనేది ముందు ముందు తేలుతుంది. అటెండెన్సు ద్వారానే నెలవారీ జీతం వస్తుందనే మెలికను కూడా ప్రభుత్వం పొందు పరచడం విశేషం. ఇలా చేయడం ద్వారా ప్రభుత్వంలోని కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకూ అధికారులంతా విధి నిర్వహణకి డుమ్మాకొట్టడానికి వీలుపడదు సరికదా..కాకిలెక్కలు..చిలపలుకులు పలకడానికి ఆస్కారం లేకుండా పోతుంది..!