తిరుమలలోని తడిచెత్త ద్వారా బయోగ్యాస్ ఉత్పత్తి చేసేందుకు టీటీడీ, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసిఎల్)తో ఎంఓయు కుదుర్చుకుంది. తిరుమల అన్నమయ్య భవనంలో బుధవారం ఉదయం టీటీడీ ఎస్ఇ - 2 జగదీశ్వర్‌రెడ్డి, ఐఓసిఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అనీల్‌కుమార్ ఎంఓయు పత్రాలను మార్చుకున్నారు. స్వచ్ఛ తిరుమలలో భాగంగా టీటీడీ ధర్మకర్తల మండలి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సహకారంతో తడిచెత్త ద్వారా బయో గ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా టీటీడీ రూ.6 కోట్లు, ఐఓసిల్ రూ.6 కోట్లు కలిసి మొత్తం రూ.12 కోట్లతో రెండు ఎకరాల విస్తీర్ణంలో తిరుమలలో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నారు.
ప్రతి రోజు 35 టన్నుల వ్యర్థాలను ఇందు కోసం వినియోగిస్తారు. తిరుమలలో రోజుకు 3.5 నుండి 4.5 మెట్రిక్ టన్నుల గ్యాస్ అవసరం కాగా, ఇందులో 1.6 మెట్రిక్ టన్నుల గ్యాస్ ఈ ప్లాంట్ నుండి ఉత్పత్తి అవుతుంది. దీనిని అన్నప్రసాదాల తయారీ కేంద్రంలో వినియోగించాలని నిర్ణయించారు. ఈ సమావేశంలో ఓఎన్‌జిసి సిజిఎం సూర్యనారాయణ రాజు, జిఎం సుబ్రమణ్యం, టీటీడీ ఇఇ శ్రీహరి, ఇతర అధికారులు పాల్గొన్నారు.