గ్రామ సచివాలయాల్లోనే మేరేజి సర్టిఫికేట్లు..


Ens Balu
34
2022-10-14 07:10:48

తలంబ్రాలు..జీలకర్రా బెల్లం.. మూడు ముళ్లు.. ఏడు అడుగులు.. ఇలా కనుల పండుగగా జరిగే పెళ్లిళ్లకు ఇచ్చే ద్రువీకరణ పత్రం విధానంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక ఉత్తర్వులు ఇచ్చింది. ఒకప్పుడు పంచాయతీలు, దేవస్థానాల్లో ఇచ్చే ఈ పెళ్లి ద్రువీకరణ పత్రాలకు వధూవరూలు అమ్యామ్యాలు ఇస్తే తప్పా ఆ ద్రువీకరణ పత్రాలు చేతికి వచ్చేవి కాదు. దేవస్థానాలు, పంచాయతీల్లో ఈ సర్టిఫికేట్ దర కేవలం రూ.50 నుంచి రూ.100 మాత్రమే. అయితే గతంలో పంచాయతీలు, దేవస్థానాలుండే చోట అయితే రూ.5వేల వరకూ పంచాయతీ సిబ్బంది నొక్కేసేవారు. కానీ అలాంటి ముడుపుల ద్రువీకరణ విధానాలు ఇకపై ఉండకూడదనే ఉద్దేశ్యంతో పెళ్లి ద్రువీకరణ పత్రాలు జారీచేసే అధికారాన్ని ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయాలకు అప్పగించింది. వధూవరులు గ్రామీణ ప్రాంతాల్లో అయితే పెళ్లైన తరువాత 60 రోజులు, పట్టణ ప్రాంతాల్లో అయితే 90 రోజుల్లో దరఖాస్తు చేసుకుంటే సచివాలయాల్లోనే ద్రువీకరణ పత్రాలు ఇస్తారు. ఆ సమయం దాటితే మాత్రం రిజిస్ట్రార్ ఆఫీసుకి వెళ్లాల్సి వుంటుంది. 

వివాహ ద్రువపత్రం కావాల్సిన వారు వధూవరుల ఆధార్ కార్డులు, వారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులు, పెళ్లి శుభలేఖ, ఒక వేళ ఏదైనా గుడిలో జరిగితే అక్కడ తీసుకున్న ద్రువీకరణ పత్రం, మండపం రసీదులు, పెళ్లిఫోటో జతచేసి సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆపై వెంటనే పెళ్లి ద్రువీకరణ పత్రాన్ని అందజేస్తారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో దేవస్థానాల దగ్గర్లో ఉండే పంచాయతీలు, తేడా కార్యదర్శిల చేతి వాటానికి అడ్డుకట్టవేసినట్టు అయ్యింది. అందేకాకుండా పాస్ పోర్టు, రేషన్ కార్డు, ఇంటి నిర్మాణాలు ఇలా చాలా వాటికి ఇపుడు పెళ్లి ద్రువీకరణ పత్రాలు అవసరం కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా నిరుపేదలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామపంచాయతీల్లో చేతివాట పూర్తిగా తగ్గనుంది. ఒకవేళ ఇక్కడ కూడా చేతివాటం ప్రదర్శిస్తే సదరు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.