ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలుచేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పరిజ్ఞానం, స్థిరమైన వ్యవసాయ పద్దతులు అమోఘమని, అందరికీ ఆదర్శనీయమని ఏపీ, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో అమలు చేయబడుతున్న వ్యవసాయ, ఉధ్యాన సాంకేతిక పద్దతులను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో ఆయన శుక్రవారం అమరావతి సచివాలయంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఏపీ వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతూ రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూరేలా పలు అభివృద్ది సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న విషయం తాము గమనిస్తున్నామని, వాటిని క్షుణ్ణంగా తెలుసుకునేందుకే నేడు ఇక్కడకు వచ్చామన్నారు. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డితో పాటు వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య, కమిషనర్ హరికిరణ్, ఇతర అధికారులు రాష్ట్రంలో రైతులకు పెద్దఎత్తున ప్రయోజనం చేకూర్చే విధంగా అమలు చేయబడుచున్న పలు పథకాలను పవర్ పాయింట్ ప్రెజంటేషన్ ద్వారా బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ కు వివరించారు.
విత్తు నుండి విక్రయం వరకూ అన్నిరకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేసే “వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల” ఏర్పాటు, వాటి పనితీరు, వాటివల్ల రైతులకు ఒనగూరే ప్రయోజనాలను బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఎంతో ఆసక్తితో తెలుసుకున్నారు. అందుకై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా రూపొందించి అమలు చేస్తున్న పలు అప్లికేషన్లపై ఆరాతీశారు. ముఖ్యంగా ఆర్.బి.కె.ల్లో ఏర్పాటు చేసిన డిజిటల్ కియోస్క్ ల వల్ల రైతులకు కలిగే ఉపయోగాలు, ఇ-క్రాప్ బుకింగ్, పంటల భీమా, ఇన్ పుట్ సబ్సిడీ, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణ విధానాలను అమలు పర్చడంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వ్యవసాయ యాంత్రీకరణ, ఉత్పతుల మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకు ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న చర్యలను తెలుసుకుంటూ అందుకై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వ్యూహాత్మక విధానాలపై ఆయన ఆశ్చర్యాన్ని వ్యక్తంచేశారు.
జగనన్న పాలనలో వ్యవసాయం దండుగకాదు పండుగ…..
గత మూడునర్రేళ్ల జగనన్న పాలనలో వ్యవసాయం దండుగకాదు పండుగ అనే స్థాయిని తీసుకు రావడం జరిగిందని రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, పుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రిగా కాకాని గోవర్థన రెడ్డి బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ కు తెలిపారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర వ్యాప్తంగా 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, విత్తు నుండి విక్రయం వరకు అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తున్నామని తెలిపారు. ఇ-క్రాప్ నమోదు నుండి బ్యాంకింగ్ సేవల వరకూ అన్ని రకాల సేవలను రైతుల ముంగిళ్లలోనే అందజేస్తూ బహుళార్ధక సాధక కేంద్రాలుగా ఈ ఆర్.బి.కే.లు పనిచేస్తున్నాయని వివరించారు.
రాష్ట్ర వ్యవసాయ శాఖ స్పెషల్ సి.ఎస్. పూనం మాలకొండయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 83 శాతం మంది చిన్న సన్నకారు రైతులు ఉన్నారని, వారిలో ఐదు ఎకరాల లోపు సాగు భూమి కలిగిన రైతులు ఎక్కువ మంది వున్నారన్నారు. అటు వంటి చిన్న సన్నకారు రైతులు అందరినీ ఆదుకునేలా ప్రభుత్వం పలు అభివృద్ది సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేయడం జరుగుచున్నదని తెలిపారు. ల్యాబ్ టు ల్యాండ్ మరియు ల్యాండ్ టు ల్యాబ్ విధానంతో రైతులు అందరికీ ఆధునిక వ్యవసాయ పద్దతులను, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తెచ్చి తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులు సాధించే విధంగా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వినూత్న విధానంతో రాష్ట్ర వ్యాప్తంగా 10,778 ఆర్.బి.కె.లను ఏర్పాటు చేసి ఈ కేంద్రాల ద్వారా విత్తు నుండి విక్రయం వరకూ అన్ని రకాల సేవలను రైతులకు అందజేస్తున్నారన్నారు. ఫలితంగా దేశంలోని పలు వ్యవసాయ ఉత్పత్తులకు ఆంద్రప్రదేశ్ ప్రముఖ కేంద్రంగా మారిందన్నారు. ధాన్యం, చేపలు, పండ్లు తదితర ఉత్పత్తులకు ఆంద్రప్రదేశ్ దేశంలోనే ప్రముఖ స్థానంలో నిలిచినట్లు ఆమె వివరించారు.
రాష్ట్ర వ్యసాయ శాఖ కమిషనర్ హరి కిరణ్, ఉద్యావన శాఖ కమిషనర్ డా.శ్రీధర్, ఏ.పి.ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ సి.ఇ.ఓ. ఎల్.శ్రీధర్ రెడ్డి, ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వి.సి. ఎ.విష్ణువర్థన రెడ్డి తదితరులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వ్యవసాయ, అనుబంధ రంగాల అభివృద్దికి, వ్యవసాయ యాంత్రీకరణకు, రైతులకు ఉత్తమ వ్యవసాయ పద్దతులు అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ గారెత్ విన్ ఓపెన్ తో పాటు పొలిటికల్ ఎకానమీ ఎడ్వైజర్ నళిని రఘురామన్, సీనియర్ ట్రేడ్ ఎడ్వైజర్ పియూష్ అవాస్తి, ప్రాస్పరిటీ ఎడ్వైజర్ జావైద్ మళ్లా తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.