5 మెడికల్ కాలేజీల్లో వచ్చే ఏడాది ప్రవేశాలు


Ens Balu
64
2022-10-15 11:27:03

రాష్ట్రంలో ప్రభుత్వం ద్వారా కొత్తగా ఏర్పాటు కానున్న ఐదు వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచే ప్రవేశాలు చేపట్టేందుకు వీలుగా ఏర్పాట్లు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు చెప్పారు. శనివారం విజయనగరం జిల్లా ఆసుపత్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు.  విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలల్లో వచ్చే విద్యా సంవత్సరం నుంచి అడ్మిషన్ లు చేపట్టేందుకు అవసరమైన వసతులు కల్పించడంపై దృష్టి సారించామన్నారు. ఈ ప్రాంతాల్లో భారతీయ వైద్య మండలి నిబంధనల మేరకు ౩౩౦ పడకల ఆసుపత్రులు అందుబాటులో ఉన్నందున ఆయా ప్రదేశాల్లో వచ్చే ఏడాది నుంచి తరగతులు చేపట్టేందుకు వీలుగా అవసరమైన అదనపు వసతులు కల్పిస్తూ భవనాలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

 జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటవుతున్న వైద్య కళాశాల భవనాల నిర్మాణ పరిస్థితి, బోధనాసుపత్రిగా రూపొందించనున్న జిల్లా కేంద్ర ఆసుపత్రిలో కల్పిస్తున్న అదనపు వసతులు ఏ మేరకు జరుగుతున్నాయనే పరిశీలన  చేసే నిమిత్తం ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు  జిల్లా కేంద్రంలో పర్యటించారు. తొలుత గాజులరేగ వద్ద నిర్మాణంలో వున్నా వైద్య కళాశాల భవనాల నిర్మాణ పురోగతిని పరిశీలించారు. వచ్చే డిసెంబర్ నాటికి వైద్య కళాశాల భవనాలు సిద్ధం చేయాలని నిర్మాణ సంస్థ ఎన్.సి.సి. ప్రతినిధులకు సూచించారు. అనంతరం జిల్లా ఆసుపత్రిని సందర్శించిన ముఖ్య కార్యదర్శి  బోధనాసుపత్రిగా మార్పు చేయనున్న దృష్ట్యా దీనికి అవసరమైన అదనపు సౌకర్యాల కల్పన ఏ మేరకు జరిగిందనే విషయం తెలుసుకునేందుకే ఈరోజు పర్యటిస్తున్నట్టు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ చెప్పారు. 

ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను ప్రజలకు మరింత చేరువ చేయాలన్న లక్ష్యంతోనే ముఖ్యమంత్రి రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల్ని ఏర్పాటుకు నిర్ణయించారని, దీనిలో భారత వైద్య మండలి నిబంధనల మేరకు ౩౩౦ పడకల ఆసుపత్రి సిద్ధంగా వున్నచోట వెంటనే ప్రారంభించేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు. వైద్య కళాశాల ఏర్పాటులో భాగంగా ఇప్పటికే ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అధ్యాపకుల నియామకం కోసం ప్రక్రియ ప్రారంభించి కొందరిని ఎంపిక చేయడం జరిగిందని, మిగిలిన పోస్టులకు నియామకాలు వచ్చే  వారంలో చేపడతామన్నారు.