తిరుమలలో ఉద్యానవనాలకు పూర్వవైభవం..


Ens Balu
15
Tirumala
2022-10-19 16:52:55

తిరుమలలోని పలు ప్రాంతాల్లో భక్తులకు ఆహ్లాదకరంగా ఉద్యానవనాలను అభివృద్ధి చేసి పూర్వ వైభవం తీసుకొస్తున్నామని టిటిడి ఈవో  ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని టిటిడి పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో బుధవారం సీనియర్ అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు.  ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ దాతల సహకారంతో జిఎన్సి టోల్ గేట్ వద్ద గల గీతోపదేశం పార్కు, జిఎన్సి నుండి బస్టాండ్ వరకు రోడ్డుకు కుడి వైపున గల పార్కు, శంఖుమిట్ట వద్దగల నామాల పార్కు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1 లోపల, శ్రీ పద్మావతి విశ్రాంతి గృహం వద్ద రంగురంగుల పుష్పాలు,  పచ్చని మొక్కలతో చక్కగా పార్కులను అభివృద్ధి చేశామన్నారు. స్పెషల్ టైప్, నారాయణగిరిలో రెండు నెలల్లో ఉద్యానవనాలను పూర్తిగా అభివృద్ధి చేయాలని అధికారులకు సూచించారు. తిరుమల అటవీ ప్రాంతంలో అకేషియా చెట్ల స్థానంలో సాంప్రదాయ మొక్కలు పెంచాలని, ఔటర్ రింగ్ రోడ్డులో ఆహ్లాదకరంగా మొక్కల పెంపకం చేపట్టాలని కోరారు. 

విభాగాల వారీగా ఎన్నో ఏళ్లుగా లక్షలాదిగా ఉన్న ఫైళ్లు, ఇతర రికార్డులను ప్రత్యేక సాఫ్ట్ వేర్ ద్వారా డిజిటైజ్ చేసి భద్రపరచాలని ఆదేశించారు. తిరుమలలోని ఎస్వీ మ్యూజియం అభివృద్ధికి సంబంధించి టాటా సంస్థ ముందుకు వచ్చిందని, అక్కడ పెండింగ్ లో ఉన్న పనులను వేగవంతం చేయాలని సూచించారు. తిరుమల నూతన పరకామణి భవనానికి అవసరమైన యంత్రాలను మరో నెలలోపు సమకూర్చుకోవాలన్నారు. టిటిడిపై వస్తున్న కేసులను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు వీలుగా తగిన చర్యలు చేపట్టాలని న్యాయ విభాగం అధికారులను కోరారు.

        రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నోడల్ గోశాలలను అనుసంధానం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఈఓ సూచించారు. పాలనలో మరింత సమర్థత పెంచేందుకు వీలుగా నూతన మార్పులకు శ్రీకారం చుట్టాలని, తద్వారా రోజువారీ పాలన వ్యవహారాల పర్యవేక్షణకు, భక్తులకు మెరుగైన సేవలు అందించేందుకు వీలవుతుందని అన్నారు. అనంతరం పే అండ్ అకౌంట్స్, విద్య విభాగాలకు సంబంధించిన ప్రగతిని పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా ఈఓ పరిశీలించారు.   ఈ సమావేశంలో టిటిడి జెఈవోలు  సదా భార్గవి, వీరబ్రహ్మం, సివిఎస్వో  నరసింహ కిషోర్, ఎస్వీబీసీ సిఈఓ  షణ్ముఖ్ కుమార్, ఎఫ్ఏసిఏఓ  బాలాజి, చీఫ్ ఇంజినీర్  నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.