ఏపిలో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు అటకెక్కినట్టేనా..?


Ens Balu
43
Tadepalli
2022-10-20 02:51:57

ఆంధ్రప్రదేశ్ లో 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజన చేసినంత త్వరగా ప్రభుత్వం కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లును నిర్మాస్తామని చెప్పిన మాటను అంతే త్వరగా పక్కన పెట్టినట్టుగా కనిపిస్తున్నది. 13 కొత్తజిల్లాల్లో శాస్వతంగా కొత్త కలెక్టరేట్లు నిర్మించాలని హుటా హుటీన స్థలసేకరణ చేసి, అక్కడ 75 ప్రభుత్వ శాఖలను ఒకేచోట ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం జిల్లాల విభజన తరువాత అద్దె ప్రభుత్వ కార్యాలయాల్లోనే కొత్తజిల్లాల్లోని కలెక్టరేట్లను, జిల్లా కార్యాలయాలను నిర్వహిస్తోంది. కొత్త జిల్లాల్లోని అధికారులతోపాటు, కార్యాలయాల్లోని సిబ్బంది కూడా అరకొరగానే ఉన్నారు. ఇటీవల రెండు ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు వేసినా అవి ఎప్పటికి పూర్తవుతాయో కొత్తజిల్లాల్లో ఖాళీలు ఉన్న అధికారులను సిబ్బందిని ఎప్పుడు నియమిస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం రాష్ట్రంలో 13 కొత్త జిల్లాలు ఏర్పాటు అయినా చాలా మంది అధికారులు, సిబ్బంది పాత జిల్లాల నుంచే రాకపోకలు సాగిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయాలకు శాస్వత భవనాలు లేక 75 ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు కేవలం నలుగురు నుంచి ఐదుగురు సిబ్బందితోనే జిల్లాకార్యాలయాలు నడుస్తున్నాయంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తే ప్రజలకు ఒకేచోట ప్రభుత్వ శాఖల సేవలన్నీ అందుతాయి. అంతేకాకుండా అటు ప్రభుత్వానికి కూడా కార్యాలయాల నిర్వహణ వ్యయం కూడా చాలా కలిసొస్తుంది. ఒకేచోట ప్రభుత్వ శాఖలకు చెందిన కార్యాలయాలు బ్లాకుల వారీగా ఏర్పాటవడంతో జిల్లా కలెక్టర్ కు సైతం అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అత్యవసర సమావేశాలు పెట్టినపుడుకూడా జిల్లా అధికారులంతా ఒకే చోట నుంచి వీడియో కాన్ఫరెన్సు ద్వారా సమావేశాలు హాజరు కావడానికి వీలుపడుతుంది. వేర్వేరు చోట్ల కార్యాలయాలు ఏర్పాటు చేస్తే ప్రభుత్వానికి అధిక కరెంటు, వినియోగ, భవనిర్మాణాల వ్యయం కూడా చాలా ఎక్కువగానే అవుతుంది. అలా కాకుండా అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు ఒకే చోట పెద్ద భవనం బ్లాకుల వారీగా ఏర్పాటు చేస్తే ఇటుప్రజలకు , ప్రభుత్వానికి రెండింటికీ ఎంతో మేలుగా వుంటుంది.

ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల విభజన చేసింత త్వరగా, ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మిస్తామని చేసిన ప్రకటనను కూడా పక్కన పెట్టేసింది. కొన్ని కొత్త జిల్లాల్లోప్రభుత్వ భూములు అందుబాటులో ఉండగా, మరికొన్ని జిల్లాల్లో మాత్రం అందుబాటులోలేవు. దీనితో ప్రభుత్వం కొన్ని చోట్ల తాత్కాలిక ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లు, జిల్లా ఎస్పీ కార్యాలయాలను ఏర్పాటు చేసింది. జిల్లా ఏర్పాటు పూర్తయిన తరువాత అయినా నిర్మాణాలు చేపడుతుందని భావిస్తే వాటిని పూర్తిగా పక్కనపెట్టింది. కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు నిర్మాణంతోపాటు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, జిల్లా అటవీశాఖ అధికారి, ఆర్డీఓ, ఇలా అందరికీ ప్రభుత్వ నివాస స్థలాలు క్యాంపు కార్యాలయాలు కూడా నిర్మించాల్సి వుంటుంది. ఈ కారణంగానే ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన ఇంటిగ్రేడెట్ కలెక్టరేట్లను కూడా కొంత కాలం వాయిదా వేసినట్టు చెబుతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాల, తరగతుల ప్రారంభంలో ప్రభుత్వం బిజీగా వుంది. బహుసా వీటి నిర్మాణాలు పూర్తయిన తరువా కొత్త జిల్లాల్లో ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లను ఏర్పాటు చేస్తుందని భావిస్తున్నారు. చూడాలి ఏం జరుగుతుందనేది..!