ఆ పంచాయతీల్లో ఇద్దరు కార్యదర్శిలూ ఉత్సవ విగ్రహాలే..
రాష్ట్రంలోని మేజర్ పంచాయతీలుగా ఉన్న చోట ప్రభుత్వం గ్రేడ్1 కార్యదర్శితోపాటు ఇతర రెండు గ్రామ సచివాలయాల్లోనూ గ్రూడ్-5 కార్యదర్శిలను నియమించింది. కానీ వారికి చేతినిండా పనిలేదు. చెక్ పవర్ లేదు, కనీసం సచివాలయాల్లో జారీ చేసే దృవీకరణ పత్రాలపై సైతం వారి సంతకాలకు విలువ కూడా లేదు. పంచాయతీ కార్యాయంలో ఉన్న సచివాలయ కార్యదర్శితోపాటు వారి పరిధిలోని పంచాయతీ పనులు చేయడం తప్పా మరేమీ చేయడానికి వీలు లేకుండా పోతుంది. అలాగని బ్లీచింగ్, ఫినాయిల్, వీధిలైట్లు, వీధి
కుళాయిలు ఇలా ఏ పనులు చేయించాలన్నా మళ్లీ వీరిద్దరూ వెళ్లి పంచాయతీ కార్యాలయంలోని గ్రేడ్-1 కార్యదర్శి వద్ద అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగని మూడు సచివాలయాలు ఉన్నచోట పరిధిలు విస్తరించినా.. ప్రధాన పంచాయతీ కార్యాలయం ద్వారానే అన్నిపనులు జరుగుతున్నాయి. దీనితో ఈ ఇద్దరు గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్సవ విగ్రహాల్లానే మిగిలిపోతున్నారు. తమ పరిస్థితిని రాష్ట్ర, జిల్లా యూనియన్ ల ద్వారా ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లినా నేటికీ ఫలితం శూన్యం. ఈ అవకాశం కాస్త ఆడుతూ, పాడుతూ పనిచేసేవారికి మాత్రం భలే కలిసి వస్తోంది. నిజంగా ప్రజలకు సేవలచేయాలనుకునే వారికి ప్రతిబంధకంలా మారింది.
ఇక్కడుండలేం బదిలీలైతే వెళ్లిపోతాం బాబోయ్
గ్రామసచివలయశాఖలో ఎలాంటి అధికారం లేని గ్రేడ్-5 కార్యదర్శిలు తమకు అధికారికంగా ఎలాంటి పనీ లేకపోవడం, తమ సంతకానికి విలువలేకపోవడం, చేసే పనికీ గ్రేడ్-1 కార్యదర్శి చుట్టూ సాధారణ ప్రజలు పనులు మాదిరి ప్రదక్షిణలు చేయాల్సిరావడంతో మేజర్ పంచాయతీల్లో పనిచేసే గ్రేడ్-5 కార్యదర్శిలు ఎంత త్వరగా బదిలీలు జరిగితే అంతే త్వరగా బయటకు వెళ్లిపోవడానికి కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. అలా కాకపోయినా, తమకు సహకరించే గ్రేడ్-1 కార్యదర్శిలు ఉన్న మేజర్ పంచాయతీలకైనా వెళ్లిపోతామని
బాహాటంగానే చెబుతున్నారు. తాము పేరుకి పంచాయతీ కార్యదర్శిలమే అయినా తమకు సచివాలయాల్లో విలువ చాలా తక్కువగా ఉందని, అలాగని తమ సచివాలయ పరిధిలోని ప్రజలకు పనిచేయాలన్నా తాము కూడా ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని వాపోతున్నారు. చెత్త వాహనాలు, చెత్త బండ్లు, పారిశుధ్య కార్మికులు, శానిటేషన్ సామాగ్రి ఇలా అన్నింటికోసం పరుగులు పెట్టాల్సి వస్తుందని చెబుతున్నారు. కొన్ని సార్లు తమ సొంత డబ్బులతోనే పనులు చేయిస్తున్నామని..అలా ఖర్చు పెట్టిన డబ్బులకి నేటికీ అతీ గతీ కూడా లేదని బాధపడుతున్నారు. ఎలాంటి అధికారాలు, పనిచేయడానికి పారిశుధ్య సిబ్బంది కూడా లేకుండా తాము ప్రజలకు ఏవిధంగా సేవలు అందించాల్లో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.
సచివాలయాల్లో వాస్తవ పరిస్థిని గుర్తించని జిల్లా కలెక్టర్లు
రాష్ట్రంలో 26 జిల్లాల్లోనూ జిల్లాకలెక్టర్లు గ్రామ సచివాలయాల్లోని వాస్తవ పరిస్థితులను గుర్తించడం లేదు. ఎప్పుడు పర్యటనలకు వచ్చినా సచివాలయాలు ఎలా ఉన్నాయి.. అక్కడ సేవలు అందుతున్నాయా లేదా.. పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది అనేవిషయాలను పరిశీలన చేస్తున్నారు తప్పితే మిగిలిన అంశాలను పరిశీలంచడం లేదు. కనీసం గ్రేడ్-5 కార్యదర్శిల సేవలు పంచాయతీలు, గ్రామాల్లో ఏవిధంగా అందుతున్నాయి..? వారికి ప్రభుత్వం ద్వారా ఎలాంటి అధికారాలు సంక్రమించాయి..? వారు చేస్తున్న ప్రధాన విధులేంటి..? గ్రేడ్-1 నుంచి గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శిలకు మాత్రమే ఇతర పంచాయతీల్లో ఇన్చార్జిల బాధ్యతలు ఎందుకు అప్పగిస్తున్నారు..? మేజర్ పంచాయతీల్లోని ప్రధాన పంచాయతీ కార్యలయంలోని సచివాలయంతోపాటు ఇతర రెండు సచివాలయాల్లోని సిబ్బంది, కార్యదర్శిలు ఏం చేస్తున్నారు..? వారికి ఏవిధంగా పంచాయతీ కార్యాలయం నుంచి సహకారం అందుతుంది..? ఉన్న గ్రేడ్-5 కార్యదర్శిలు ఏవిధంగా విధులు నిర్వహిస్తున్నారు..? ఖాళీగా వున్న చిన్న పంచాయతీలకు వీరిని ఎందుకు పంపడం లేదు..? అసలు సచివాలయ కార్యదర్శిలు ప్రభుత్వం నిర్ధేశించిన రికార్డులు ఏ విధంగా నిర్వహిస్తున్నారు..? ఎంతమంది పూర్తిస్థాయిలో సచివాలయాల్లోనే ఉండి సేవలు అందిస్తున్నారు? బయో మెట్రిక్ వేసి ఇతర కార్యక్రమాల పేరుతో ఎందరు జంప్ అయిపోతున్నారు..? తదితర అంశాలపై రాష్ట్రంలో
ఇప్పటి వరకూ ఒక్క జిల్లా కలెక్టర్ సైతం ద్రుష్టి పెట్టలేదు. అలా పెట్టివున్నా, తెలుసుకునే ప్రయత్నం చేసినా..గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలకు మేజర్ పంచాయతీల్లో వీరికి ఏ స్థాయిలో పనులున్నాయో..అసలు వీరేం చేస్తున్నారో జిల్లా కలెక్టర్లకు ఒక క్లారిటీ వచ్చేది.
పంచాయతీరాజ్ లో 2024తరువాత భారీగా ఖాళీలు..
ప్రభుత్వం ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయ వ్యవస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న గ్రేడ్-5 కార్యదర్శిలను..ఇప్పటి వరకూ ఇన్చార్జిల పాలనతో ఉన్న పంచాయతీలకు సర్ధుబాటు చేస్తే కనీసం అక్కడ పంచాయతీలన్నీ పూర్తిస్థాయిలో అభివ్రద్ధి చెందడానికి, ప్రభుత్వ సేవలు అందడానికి ఆస్కారం వుంటుంది. లేదంటే 2024 తరువాత గ్రామ, వార్డు సచివాలయశాఖలో భారీగా ఖాళీలు ఏర్పడితే అప్పుడు పరిస్థితి మరింత జఠిలం అవుతుంది. వాస్తవానికి మేజర్ పంచాయతీల్లో గ్రేడ్-1,2 స్థాయి కార్యదర్శిలు ఉన్నచోట మరో ఇద్దరు గ్రేడ్-5 కార్యదర్శిల అవసరం వుండదు. కానీ ప్రభుత్వం మేజర్ పంచాయతీల్లో మూడు సచివాలయాలు ఏర్పాటు చేయడంతో వీరిని నియమించింది. నాటి నుంచి నేటి వరకూ వీరికి పనిలేకుండానే పోయింది. ఇప్పటికైనా గ్రామ,వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి వీరి అధికారాలు, సేవలు, విషయంలో ఆలోచిస్తే తప్పా..వీరికి చేతినిండా పనిదొరకదు సరికదా.. కార్యదర్శిలు లేని గ్రామపంచాయతీలు సైతం ఎలాంటి ప్రభుత్వసేవలకు నోచుకోకుండా పోయే ప్రమాదం వుంది. మరోపక్క గ్రేడ్-1,2 కార్యదర్శిలను ఇతర పంచాయతీలకు ఇన్చార్జిలగా నియమిస్తుండటంతో వారు రెండుచోట్లా పూర్తిస్థాయిలో పనిచేయడానికి వీలు లేకుండా పోతుంది. ఇదే సమయంలో ఆదాయం వచ్చే పంచాయతీలకే కొందరు కార్యదర్శిలు పరిమితమైపోతున్నారు. సచివాలయాలు, అక్కడి సేవల్లో ఎవరికీ అందుబాటులో లేకుండా పోతున్నారు.
అసలు విషయమిదే..
గ్రామ సచివాలయాల్లో అంతమంది సిబ్బంది వున్న సేవల విషయంలో కలుగుతున్న ఇబ్బందులను తెలుసుకునే క్రమంలో ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోనూ, 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలోనూ గ్రౌండ్ లెవల్ రియాల్టీని పరిశీలిన చేసింది. తొలుతగా గ్రామ సచివాలయాల పరిస్థితిని ప్రజలకు, అటు ప్రభుత్వానికి తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ ప్రత్యేక కధనాన్ని అందిస్తున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ శాఖను ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఇక్కడ జరిగే ప్రతీ విషయాన్ని ఈఎన్ఎస్ నేషనల్ న్యూస్ ఏజెన్సీ, అధికారిక న్యూస్ యాప్ ఈఎన్ఎస్ లైవ్, అధికారిక వెబ్ సైట్ www.enslive.net ద్వారా బాహ్య ప్రపంచానికి తెలియజేస్తోంది. ఏ మీడియాని రాయనన్ని కధనాలు కూడా ఒక్క ఈఎన్ఎస్ నెట్వర్క్ ద్వారా అందించిన విషయం కూడా ప్రజలకు, పాఠకులకు, అటు అధికారులకు కూడా తెలుసు. ఈ విషయంలో ఎవరు ఏమనుకున్నా.. అడుతూ పాడుతూ పనిచేసేవారు ఓ.. తెగఫీలైపోయి గుక్కెట్టి ఏడ్చేసినా.. వాస్తవం తెలుసుకున్నవారు కనీసం వీళ్లైనా తమ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారని ఆలోచించినా.. అన్నింటినీ ఈఎన్ఎస్ ఒకేలా స్వీకరిస్తుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సీఎం వైఎస్.జగన్ మానస పుత్రిక గ్రామ, వార్డు సచివాలశాఖ ద్వారా ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందాలనేదే మా యొక్క లక్ష్యం. గ్రామ స్వరాజ్యం గ్రామ సచివాలయాల ద్వారానే సిద్ధిస్తుందని నమ్మి ప్రజలు, ప్రభుత్వం, పాఠకుల పక్షాన నిలబడి అక్షర సేద్యం చేస్తున్నాం. ఈ విషయంలో ఎలాంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావులేదని మరోసారి బల్లగుద్ది చెబుతున్నాం..!