అవినీతిని నిర్మూలించేందుకు ప్రభుత్వం రూపొందించిన 14400 మొబైల్ యాప్ సేవలను ప్రజలు
సద్వినియోగం చేసుకోవాలని ఏపీ డిజిపీ కెవి.రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో అదికారులతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ యాప్ కు వచ్చిన ఫిర్యాదులపై ఇప్పటికే 58 కేసులు నమోదు చేసామన్నారు. లోను యాప్ ల మోసాలను నియంత్రించేందుకు పోలీసుశాఖ ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు చర్యలు చేపడుతున్నదన్నారు. లోను యాప్ ల పట్ల ప్రజలు కూడా అప్రమత్తంగా వ్యవహరించాలని, అవగాహన లేకుండా వారు అడిగే వాటన్నింటికి అనుమతులు ఇవ్వొద్దన్నారు. రుణాలు తీసుకొనే క్రమంలో వారు అడిగిన వాటన్నింటికి అనుమతులు ఇవ్వడంతో మన ఫోటోలు, లొకేషను, కాంటాక్ట్ నంబర్లు తదితర డేటా అంతా వారి చేతుల్లోకి వెళ్ళి పోతుందన్నారు. ఇలా పొందిన డేటాతో వారు రుణగ్రహీతల ఫోటోలను మార్ఫింగ్ చేసి, బెదిరింపులకు పాల్పడుతూ, అధిక వడ్డీలతో మంజూరు చేసిన రుణాలు వసూలు చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తూ, వేధింపులకు పాల్పడుతున్నా రన్నారు. బ్యాంకు అధికారులు కూడా అనధికార వ్యక్తులు బ్యాంకు ఖాతాలు తెరిచే సమయంలోను అప్రమత్తంగా వ్యవహరించాలని, ఎక్కువ మొత్తంలో నగదు లావాదేవీలు చేసే ఖాతాలపై నిఘా పెట్టాలన్నారు. రుణ యాప్ల వేధింపులు కారణంగా ఎవ్వరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, సకాలంలో ఫిర్యాదు చేస్తే, వారిపై చర్యలు చేపడతామన్నారు.