రూ. కోట్లలో కోల్పోతున్న సచివాలయాల ఆదాయం


Ens Balu
91
Tadepalli
2022-11-15 04:49:03

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశం మొత్తం తొంగి చూసేవిధంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతున్నది. ఒక్క ముక్కలో చెప్పాలంటే సచివాలయాల ద్వారా ప్రభుత్వం అన్ని రకాల సేవలను అందించడం ప్రారంభిస్తే సిబ్బంది నెలవారీ జీతాలు పోను ఇంకా ప్రభుత్వానికే అధిక ఆదాయం సమకూరుతుంది. ఆ విషయం ప్రభుత్వానికి తెలిసినా ఎందుకనో ముందడుగు వేయలేక పోతున్నది. పెర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తే గ్రామ, వార్డు సచివాలయాలు ఏపీ ప్రభుత్వానికి అతిపెద్ద ఆదాయ వనరుగా మారిపోతాయనడంలో ఎలాంటి సందేహమూలేదు. అంతేకాదు ఇంటిముంగిటే ప్రజలకు అన్ని సేవలు అందించాలనే ప్రభుత్వ లక్ష్యం కూడా నెరవేరుతుంది. ప్రభుత్వం ప్రస్తుతం 570 రకాల సేవలను కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. పేరుకేవాటిని తీసుకు వచ్చింది తప్పితే అన్నిసేవలు పూర్తిస్థాయిలో సచివాలయాల ద్వారా ప్రజలకు చేరడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాలు, 1.20 లక్షల మంది ఉద్యోగులు ఉన్నా వీరిని ప్రభుత్వం పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవడం లేదు.

భారమంతా డిజిటల్ అసిస్టెంట్ల పైనే..
గ్రామ,వార్డు సచివాలయాల్లో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన కామన్ సర్వీస్ సెంటర్ సేవల భారంత మొత్తం డిజిటల్ అసిస్టెంట్లపైనే పడిపోతుంది. ఈ ఒక్క ఉద్యోగి దగ్గర నుంచే అన్నీసేవలు అందాల్సివుంటోంది. మిగిలిన సిబ్బందికి కంప్యూటర్లు అందుబాటులో లేకపోవడం, ఆయా ప్రభుత్వశాఖల సేవలను వారి ద్వారా చేసే అవకాశం లేకపోవడం కూడా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నది. ఇటీవల కాలంలో ఆధార్ అనుసంధాన కార్యక్రమం కూడా సచివాలయాల్లో చేస్తుండటంతో సాధారణ పనులకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. సచివాలయాల్లో పలు దృవీకరణ పత్రాలు జారీ ఆలస్యం కావడంతో ఇవే సేవలను అత్యధిక మొత్తం చెల్లించి మీ-సేవా కేంద్రాల్లో తీసుకోవాల్సి వస్తున్నది. ప్రభుత్వం అందిస్తామని ప్రకటించి 570 సేవల్లో కొద్ది రకాల సేవలు మాత్రమే ప్రస్తుతం గ్రామ,వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయి. చాలా వరకూ సేవలు ఇంకా ప్రభుత్వం పూర్తిస్థాయిలో జారీచేసే అవకాశం ఇవ్వలేదు.

సచివాలయాల్లో చాలీ చాలని కంప్యూటర్లు
గ్రామ, వార్డు సచివాయాల్లో పూర్తిస్థాయిలో సిబ్బంది వున్నా పూర్తిస్థాయిలో పనులు చేయడానికి, ప్రభుత్వ సేవల ద్వారా పలు రకాల దృవీకరణ పత్రాలు జారీచేయాలన్నా కంప్యూటర్ల సమస్య తీవ్రంగా తలెత్తున్నది. ఒక్కో సచివాలయానికి కేవలం రెండు మాత్రమే కంప్యూటర్లు ఉండటంతో ఒకటి పూర్తిగా డిజిటల్ అసిస్టెంట్ స్వాధీనంలో ఉండగా మరో కంప్యూర్ ను మిగిలిన అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది వినియోగించాల్సి వస్తున్నది. అలా కాకుండా అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందికి ప్రభుత్వం కంప్యూటర్లు ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ప్రకటించిన అన్ని సేవలను సచివాలయాల ద్వారానే అందించడానికి వీలు కలుగుతుంది. ఏ పనిచేయాలన్నా డిజిటల్ అసిస్టెంటు మాత్రమే చేయాల్సి వస్తున్నది. మిగిలిన ప్రభుత్వశాఖల సిబ్బంది సైతం ఆన్ లైన్ కార్యక్రమాలు, పనులు చేయాలంటే వేచి ఉండే పరిస్థితి నెలకొంది. అదే సమయంలో సచివాలయాలకు వచ్చే ఇంటర్నెట్ కూడా స్పీడ్ గా లేకపోవడం వలన కూడా ఇక్కడ పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. కొంతమంది సిబ్బంది సొంత ల్యాప్ టాప్ లు వినియోగిస్తున్నా వారి పనులు మాత్రమే చేసుకుంటున్నారు.

సిబ్బందిని మొత్తం వినియోగిస్తే గళ్లాపెట్టి గల గల
గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు 19 ప్రభుత్వశాఖల సిబ్బంది అందుబాటులో ఉన్నారు. వారందరినీ రాష్ట్రవ్యాప్తంగా ఏక కాలంలో వినియోగిస్తే ప్రభుత్వానికి అపారంగా ఆదాయం పెరుగుతుంది. కానీ ఆ విధంగా ప్రభుత్వం ఆలోచన చేయడం లేదు. ఆన్ లైన్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చినా నేటికీ.. కాగితపు దృవీకరణలతోనే పనులు జరుగుతున్నాయి. ఆవిధంగా చూసుకున్నా సచివాలయాల ద్వారా జారీ చేసే దృవీకరణల ద్వారానే ప్రభుత్వానికి ఆదాయం నిత్యం వచ్చే అవకాశాలున్నాయి. ప్రభుత్వం సచివాలయాల ద్వారా సేవలను  పెంచుతుంది తప్పితే వాటిని ఆయా ప్రభుత్వశాఖల సిబ్బంది ద్వారా చేయించే ఏర్పాటు మాత్రం చేయడం లేదు. రాష్ట్రంలో గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటై 1.20లక్షల మంది సిబ్బంది అందుబాటులోకి వచ్చినా నేటికీ ప్రజలు అత్యవసర పనుల కోసం మీ-సేవా కేంద్రాలనే ఆశ్రయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.

శాఖలవారీగా భర్తీచేసిన ఉద్యోగాలతో ఉపయోగమేంటి..?
ఏపీ ప్రభుత్వం శాఖల వారీగా సచివాలయాల్లో ఉద్యోగులను నియమించింది. కానీ వారితో పూర్తిస్థాయిలో సేవలను మాత్రం ప్రజలకు  చేరవేసే విషయంలో ఇంకా మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. సచివాలయాలు ఏర్పాటై మూడేళ్లు దాటుతున్నా ఇంకా సచివాలయాల్లో ఏఏ రకాల సేవలు పొందవచ్చునో ప్రజలకు అవగాహన లేదంటే అతిశయోక్తికాదేమో. గ్రామస్థాయిలో ప్రజలకు పూర్తిస్థాయిలో సేవలు అందించాలంటే ఎన్నిప్రభుత్వశాఖల ఉద్యోగులను సచివాలయాల్లో ఏర్పాటు చేసిందో..వారందరితోనూ సేవలు, దృవీకరణ పత్రాలు, ఇతరత్రా అంశాలకు చెందిన కార్యకాలపాలు చేపడితే ప్రభుత్వ లక్ష్యం నెరవేరినట్టు అవుతుంది. సచివాలయంలోని అన్నిశాఖల సిబ్బంది కలిపి కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతోపాటు, హైస్పీడ్ ఇంటర్నెట్, అధునాతన ప్రింటర్లను అందుబాటులోకి తీసుకువస్తే..ఏకకాలంలో రాష్ట్రవ్యప్తంగా సిబ్బంది మొత్తం కామన్ సర్వీస్ సెంటర్ ద్వారా చేసే పనులతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఒక రేంజి లో ఉంటుంది. ప్రస్తుతం ఇవే సేవలు ప్రజలంతా మీ-సేవా కేంద్రాల నుంచి పొందుతున్నారు. అదే ఉన్న అన్నిశాఖల సిబ్బందిని వినియోగించుకుంటే ప్రజలకు సేవతోపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చి ఆర్ధిక లోటు కూడా తగ్గే అవకాశాలున్నాయి.. చూడాలి ప్రభుత్వం ఏవిధంగా స్పందిస్తుందనేది..!