ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల గణన మొదలు పెట్టింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగవిరమణ వయస్సు 60 నుంచి 62 సంవత్సరాలకు పెంచింది. అలా పెంచిన ఉద్యోగుల మరో ఏడాదిలో ఉద్యోగ విరమణ చేయనున్నా రు. అపుడు రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లో వేలాదిగా ఖాళీలు ఏర్పడనున్నాయి. దానికోసం ముందుగా ఏ ప్రభుత్వ శాఖల్లో ఎంతమంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు, ఎంతమంది కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, ఏ కేడర్ లోని ఉద్యోగులు త్వరలో రిటైర్ కాబోతున్నారు అనే సమాచారాన్ని సేకరించే పనిలో పడింది. ఒకేసారి ఉద్యోగులు ఉద్యోగ విరమణ చేస్తే పరిపాలనలో చాలా ఇబ్బందులు వచ్చే అవకాశం వుంది. దీనితో కొత్త ఉద్యోగాల భర్తీ చేపట్టక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. ఆ సమస్యను అధిగమించేందుకు ముందుగానే ఖాళీల వివరాలను, ఉద్యోగుల గణన చేపట్టి ఉంచితే ఎన్నికల ముందు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వడానికి బావుంటుందని ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తుంది.
వైఎస్సార్ నోటిఫికేషన్ల కంటే ఎక్కువగా ఉంటాయ్
దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్సార్ అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం వహించే సమయంలో కూడా ఇలానే ఎన్నికలకు ఏడాది సమయం ఉందనగా రాష్ట్రవ్యాప్తంగా 75 ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను లెక్కించి.. సరిగ్గా ఎన్నికల ముందు సుమారు 55వేల ఉద్యోగాలకు పైగానోటిఫికేషన్ జారీ చేశారు. కాకపోతే ఇపుడు ఆ సంఖ్య రెండితలు అయ్యే అవకాశం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఏర్పడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత అతిపెద్ద రెగ్యుల్ జాబ్స్ నోటిఫికేషన్ ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖది తప్పితే మరే ఇతర శాఖలో ఉద్యోగాల భర్తీ జరగలేదు. వైద్య ఆరోగ్యశాఖలో మాత్రం కాంట్రాక్టు పద్దతిలో పారామెడికల్ సిబ్బంది, వైద్యుల పోస్టులను భర్తీచేశారు. మిగిలిన శాఖల్లో ఒకటి అరా పోస్టులు తప్పితే ఒకే సారి వేల సంఖ్యలో ఉద్యోగాల భర్తీని చేపట్టలేదు. అయితే ప్రభుత్వం పెంచిన రెండేళ్ల అదనపు ఉద్యోగ విరమణ వయస్సు ఉద్యోగులకు వచ్చే ఏడాదితో పూర్తవుతున్న తరుణంలో ముందుగానే ఉద్యోగాల నోటిఫికేషన్లకు సిద్ధం కాకపోతే చాలా ఇబ్బందులు వచ్చే ప్రమాదం వుంది.
నిరుద్యోగులకు అసలైన ఉద్యోగాల పండుగ
ఆంధ్రప్రదేశ్ లో అసలైన ఉద్యోగాల పండుగ 2019లో ఒకసారి గ్రామ, వార్డు సచివాలయశాఖ నోటిఫికేషన్ ద్వారా వస్తే.. 2024లో మరోసారి అదే స్థాయిలో వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉద్యోగ విరమణలు చేసే ఖాళీలతోపాటు, అప్పటికే గుర్తించిన ఖాళీలు ప్రభుత్వం గుర్తించాల్సి వుంటుంది. ఈ రెండు దఫాల ఖాళీలను బేరీజు వేసుకొని ఉద్యోగాలకు నోటిఫికేషన్లు తీసే అవకాశాలు 2024 ఎన్నికల ముందు రానున్నాయి. అందులోనూ రాష్ట్రంలోని 13 జిల్లాలను కాస్తా 26 జిల్లాలు చేసిన నేపథ్యంలో కొత్త జిల్లాల్లో చాలా ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీ చేపట్టాల్సి వుంది. ఇప్పటికే వాటికోసం గ్రూప్-1 ఇతర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగాలకు ప్రస్తుతం నోటీఫికేషన్లు వేసినప్పటికీ అప్పికి ఖచ్చితంగా మరోసారి నోటిఫికేషన్లు వేసి తీరాల్సిందే. ఇప్పటికే ప్రభుత్వశాఖల్లో అధికారులు, మినిస్ట్రీరియల్ సిబ్బంది తక్కువగా ఉండటంతో అధికారిక పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయి. అలాంటి ఇబ్బందులు 2024 తరువాత రాకుండా ఉండాలంటే భారీ సంఖ్యలో ఉద్యోగాల నోటిఫికేషన్లు తీయాల్సిన అవసరం వుంది.
రాష్ట్ర ప్రభుత్వంపై ఆర్ధిక భారం..
ఇప్పటికే ఆర్ధికలోటుతో కొట్టిమిట్టాడుతున్న రాష్ట్రప్రభుత్వానికి 2024లో కొత్త ఉద్యోగాల నోటిఫికేషన్ తోపాటు, ఉద్యోగ విరమణ చేసిన వారికి ఇవ్వాల్సిన ప్రయోజనాలను కూడా ఇవ్వాల్సి వుంది. అలా చేయాలంటే ప్రభుత్వానికి తలకు మించిన భారం అవుతుంది. దానికోసం ఇప్పటి నుంచే ఆదాయవనరులను పెంపొందించుకోవాల్సిన అవసరం వుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ దిశగా కూడా అడుగులు వేస్తున్నది. ఆర్ధిక లోటును ఆదాయాలు వచ్చే ప్రభుత్వశాఖల ద్వారా సమకూర్చుకోవడం ద్వారా భర్తీచేసుకోవాలని యోచిస్తూ .. దానికి అనుగుణంగా కార్యాచరణ కూడా చేపట్టింది. చూడాలి వచ్చే రెండేళ్లలో ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకోసం ఏవిధమైన వ్యూహాన్ని అవలంభించనున్నదో..!