ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం కల్యాణ వేదిక పరిసర ప్రాంతాల్లో జాంబవంతుని విగ్రహ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం చెప్పారు. బుధవారం ఆయన అధికారులతో కలసి ఒంటిమిట్టలో టీటీడీ చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జనవరి 1వ తేదీ , వైకుంఠ ఏకాదశి రోజు భక్తుల రద్దీకి అనుగుణంగా క్యూ లైన్ల ఏర్పాటుపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఆ రోజుల్లో దర్శనం సమయం కూడా పెంచాలని అధికారులను ఆదేశించారు. ఒంటిమిట్ట లోని కల్యాణ వేదిక వద్ద అవసరమైన నిర్మాణాలు చేపట్టి భక్తులు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి అందుబాటులోకి తెచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.
అంతకుముందు ఆయన రాజంపేటలో శ్రీ అన్నమయ్య 108 అడుగుల విగ్రహం వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు . ఇక్కడ శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణం పనుల గురించి అధికారులతో చర్చించారు. జనవరి చివరినాటికి ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు.
అలాగే ఇక్కడ జరుగుతున్న వేదిక నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు త్వరిత గతిన పూర్తి చేయాలని జేఈఓ వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. అన్నమయ్య విగ్రహం పరిసరాల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు, ఉద్యానవనాలను అభివృద్ధి చేయాలన్నారు. అనంతరం జేఈవో వీరబ్రహ్మం దేవుని కడప లక్షీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. జనవరి 1వ తేదీ, వైకుంఠ ఏకాదశి రోజున భక్తుల దర్శనం కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఇక్కడ నిర్మించిన వసతి సముదాయాన్ని భక్తులకు అందుబాటులోకి తెచ్చే విషయంపై అధికారులతో చర్చించారు.
టీటీడీ చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవో నటేష్ బాబు ఇతర అధికారులు పాల్గొన్నారు.