ఎన్నికల విధులన్నీ ఇక సచివాలయ ఉద్యోగులతోనే..!


Ens Balu
405
Tadepalli
2022-12-08 02:36:08

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల విధుల నుంచి ఉపాధ్యాయులను తప్పించిన తరువాత..వాటిని గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు అప్పగించాలని భావిస్తోంది. ఇప్పటికే సచివాలయాల్లో బిఎల్వో(బూత్ లెవల్ ఆఫీసర్) విధులను అప్పగించి ఓట్ల నమోదు, మృతిచెందిన వారి ఓట్ల తొలగింపు తదితర అంశాల పనులకు వినియోగిస్తోంది. ఈ ప్రక్రియలో బిఎల్వోలంతా ఇపుడు సచివాలయపరిధిలోని అన్ని ఇళ్లను గుర్తిస్తున్నారు. ఈ విధంగా పనిచేయించడం ద్వారా వచ్చే 2023లో జనాభా గణన కూడా వీరితోనే చేయించడానికి అవకాశం వుంటుంది. వీరికి గ్రామ, వార్డు వాలంటీర్లు తోడు ఉండటంతో ప్రభుత్వం పని చాలా సులువు కావడానికి ఆస్కారం వుంటుంది. అందులోనూ ఏ ప్రభుత్వ శాఖలోనూ లేనివిధంగా ఒక్క గ్రామ, వార్డు సచివాలయశాఖలోనే 80 శాతానికి పైగా ఉద్యోగులంతా డిగ్రీలు, పీజీలు, పీహెచ్డీలు చదివిన వారు, బిటెక్ చేసిన వారు ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో సుమారు లక్షా 27వేల మందికి  పైగా సచివాలయ ఉద్యోగులు ప్రస్తుతం ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నారు.

 వీరికి ఎన్నికల విధులను అప్పగించడం ద్వారా ఈవీఎంలు, వాటి నిర్వహణ పై ఉపాధ్యాయుల కంటే వేగంగా వీరికి శిక్షణ ఇవ్వడానికి బాగుంటుంది. పైగా టెక్నాలజీని బాగా వినియోగించడంలో సచివాలయ ఉద్యోగులు ముందుండటంతో ప్రభుత్వం పని మరింత సులువైపోనుంది. విధుల్లోకి చేరిన దగ్గర నుంచి అంటే సుమారుగా మూడేళ్లుగా సచివాలయ సిబ్బంది బిఎల్వో విధులను నిర్వహిస్తున్నారు కనుక వీరికి ఎన్నికల ప్రక్రియపై మరీ కష్టంగా శిక్షణ ఇచ్చే పనిలేదు. బహుసా ఇదే కారణంతోనే ప్రభుత్వం ఎన్నికల విధులు, జనాభా గణన నుంచి ప్రభుత్వ ఉపాధ్యాయులను తప్పించిందని చెబుతున్నారు. పైగా ఏ ప్రభుత్వ శాఖ అధికారులు, సిబ్బంది ప్రజలతో అంత దగ్గరగా ఉండరు. ప్రస్తుతం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు మాత్రమే ప్రజలతో అన్ని పనులకు దగ్గరగా ఉండటంతో ఎన్నికల విధులను వీరికి అప్పగించడం ద్వారా పని సులవవుతుందని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా వార్తలొస్తున్నాయి.

ఇప్పటికే మండల తహశీల్దార్లు, డిప్యూటీ తహశీల్దార్లు, ఆర్ఐలు, వీఆర్వోలు, ఇలా మొత్తం రెవిన్యూ యంత్రాంగంతో కలిసే సచివాలయ ఉద్యోగులు ఎన్నికల విధులను నిర్వహిస్తున్నారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ప్రస్తుతం సాధారణ విధులకంటే గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి బిఎల్వో విధులే అధికంగా ఉన్నాయి. త్వరలో ఎన్నికలు జరగాల్సి రావడంతో, కొత్త ఓటర్ల నమోదు, లేని వారి తొలగింపు తదితర కార్యక్రమాలన్నీ త్వరతిగతిన చేపడితే గత ఎన్నికల ఓటర్లతో పోల్చుకుంటే ఓట్లు పెరిగి పెరిగే అవకాశం వుంటుంది. ఏది ఎలా చూసుకున్నా ప్రభుత్వానికి ఉపయుక్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు  
మారబోతున్నారు. మొన్నటి వరకూ ఎన్నికల విధల నుంచి ఉపాధ్యాయులను తప్పిస్తే ఆ బాధ్యత ఏ ప్రభుత్వ శాఖల సిబ్బందికి అప్పగిస్తారనే ఆలోచన అందరికీ ఉండేది. అయితే ప్రస్తుతం బిఎల్వో విధులు నిర్వహిస్తున్న సచివాలయ ఉద్యోగులకే అప్పగించడం ద్వారా గ్రామస్థాయిలో పని సులువుగా అయిపోతుందని ప్రభుత్వం భావించి ఆవిధంగా చర్యలు తీసుకుంటుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు ఒక ప్రత్యేక నెట్వర్క్ గా మారారడనడంలో ఎలాంటి సందేహం లేదనే విషయం ఇక్కడ మరోసారి తేటతెల్లం అవుతుంది.!