తెలంగాణ నల్ల బంగారం ఉత్పత్తి చేసే సింగరేణి కాలరీస్ సంస్థ సరికొత్త రికార్డు నెలకొల్పింది. డిసెంబర్ నెలలో అత్యధిక నెలవారీ ఉత్పత్తిని సాధించినట్లు సంస్థ ప్రకటించింది. గత నెల 67.2 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధించామని అది 2021 డిసెంబర్ కంటే 19 శాతం ఎక్కువని వెల్లడించింది. అంతే కాకుండా గత నెలలో రోజుకు 2.18 లక్షల టన్నుల బొగ్గు రవాణా చేసి ఆల్ టైం రికార్డు నెలకొల్పినట్లు ప్రకటించింది. ఇదే ఉత్సాహాన్ని మరో 3నెలల పాటు కొనసాగించి ఉత్పత్తి, రవాణా పెంచాలని సంస్థ సీఎండీ శ్రీధర్ కార్మికులకు పిలుపునిచ్చారు.