ఈసారైనా గ్రేడ్-5కార్యదర్శిలకు అధికారాలొచ్చేనా


Ens Balu
76
Tadepalli
2023-01-25 02:36:05

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారత దేశంలోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన గ్రామ, వార్డు సచివాలయశాఖలో ఉద్యోగాల్లో చేరిన గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శిలకు నేటివరకూ ఎలాంటి అధికారాలూ లేకుండానే పనిచేస్తున్నారు. మూడున్నరేళ్ల నుంచి తమకు కనీస అధికారాలు ఇవ్వాలని, పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేదీ చుట్టూ కాళ్లు అరిగెలా తిరినా ఫలితం కనిపించలేదు. కనీసం ఈశాఖకు కొత్తగా వచ్చిన ముఖ్యకార్యదర్శి  బుడితి రాజశేఖర్ ద్వారా నైనా తమకు అధికార బదలాయింపు జరుగుతుందా అనే ఆశమళ్లీ రాష్ట్రవ్యాప్తంగా వున్న గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిల్లో చిగురించింది. అసాధ్యాలను సైతం తన తెలివితేటలతో సుసాధ్యం చేసే అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారి బుడితి రాజశేఖరకు మంచిపేరు ఉంది. గతంలో ఈశాఖ ముఖ్య కార్యదర్శిగా వున్న ద్వివేదీకి సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు ఎన్నిసార్లు వినతి పత్రాలు సమర్పించినా అవి బుట్టదాఖలే అయ్యాయి. అయితే ఎట్టకేలకు ఈయనకు బదిలీ జరగడంతో మళ్లీ సచివాలయ ఉద్యోగులకు ఆశలు చిగురించాయి, కొత్తగా ఆసీటులోకి వచ్చిన ఐఏఎస్ అధికారిపై ఉన్ననమ్మకంతో మరోసారి ఉద్యోగ సంఘాల నేతలు ఆయనను కలిసి గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు కట్టబెట్టే విషయమై విన్నవించడానికి సిద్ద పడుతున్నారు.

ప్రస్తుతం మేజర్ పంచాయతీలు ఉన్నచోట 1 సచివాలయం మినహా, 2, 3 సచివాలయాల గ్రేడ్-5 కార్యదర్శిలు ఉత్తుత్తి కార్యదర్శిలుగా విధులు నిర్వహించాల్సి  వస్తున్నది. ఆఖరికి గ్రామంలో పారిశుధ్య నిర్వహణకు సైతం పంచాయతీ కార్యదర్శి(గ్రేడ్-1)ను చుట్టు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. తమకు కనీస అధికారాలు కల్పించాలని, తమకు జీఓనెంబరు 146 ద్వారా రావాల్సిన అధికారాలు బదలాయించాలని నెత్తీ నోరూ కొట్టుకున్నా వీరికి ప్రభుత్వం నుంచి అధికారాలు రాలేదు. అయితే ఇదే విషయమై సచివాలయ ఉద్యోగులు జిల్లా పంచాయతీ అధికారులకు, జిల్లా కలెక్టర్లు, ఆఖరికి పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శికి సైతం ఉద్యోగ 
సంఘాలు వినతి పత్రాలు సమర్పించినా ఫలితం లేకుండా పోయింది. రాష్ట్రంలో కొన్ని జిల్లా కలెక్టర్లకు గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాలు ఇవ్వాలని, తద్వారా 
గ్రామాల్లో అభివృద్ధి, ప్రజలకు సహకారం పెరుగుతుందని భావించినా పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకపోవడంతో వాటిని 
అమలు చేయలేదు. తాజాగా ప్రభుత్వం పంచాయతీరాజ్ శాఖ ముఖ్యకార్యదర్శిని బదిలీచేయడంతో మళ్లీ ఈశాఖలోని అధికారులకు, సిబ్బందికి ఊపిరి లేచొచ్చినట్టు అయ్యింది. 

కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరిగా పనులు చేయని పీఅండ్ ఆర్డీ ముఖ్యకార్యదర్శిని కలవడానికి కూడా ఉద్యోగులు ఇష్టపడేవారు కాదు. చాలాకాలం తరువాత ఈశాఖలో ముఖ్యకార్యదర్శి మార్పుతో అధికారులు, ఉద్యోగులతోపాటు, గ్రామ సచివాలయ గ్రేడ్-5 కార్యదర్శిలు కూడా కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇకనైనా పంచాయతీరాజ్ శాఖలో అన్ని పనులు చక చకా ముందుకిగి సాగుతాయనే నమ్మకాన్ని వెలిబుచ్చుతున్నారు. ఈ శాఖకు ముఖ్య కార్యదర్శిగా వచ్చిన బుడితి 
రాజశేఖర్ ద్వారా నైనా పనులు ముందుకు సాగుతాయా..లేదంటే మునుపటి ముఖ్యకార్యదర్శి మల్లే అన్ని దరఖాస్తులు చెత్త బుట్టలోనే కాపురం ఉంటాయా అనేది 
మరికొన్ని రోజుల్లోనే తేలిపోనుంది. అయితే ఉద్యోగులు, అధికారులు మాత్రం ఈయనపై గట్టినమ్మకంతోనే ఉన్నారు.

సిఫార్సు