ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల విషయంలో చేయాల్సి అత్యవసర పనులు తప్పా.. అడగవని, ప్రస్తుతం అవసరం లేని అన్ని పనులూ చేస్తు న్నట్టు కనిపిస్తున్నది. గ్రామ వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసి మూడేళ్లు గడుస్తున్నా నేటికీ ఈశాఖ ఉద్యోగులు సర్వీసు రూల్సు,ప్రమోషన్ ఛానల్, ఉద్యోగులకు అధికారాల బదాలయింపులు పై నోరు మెదపకుండా ఇపుడు ఉద్యోగుల పనితీరు అంచనావేయడానికి ఫెర్మార్మెన్స్ ఇండికేటర్స్ అనే సరికొత్త కార్యక్రమానికి తెరలేపింది. సచివాలయాల్లో ప్రధాన భూమిక పోషించే గ్రేడ్-5 కార్యదర్శిల విషయంలో అధికారాలు బదలాయింపు చేసే జీఓను అమలు చేయలేదు. సర్వీసు నిబంధనలు ఏర్పాటు చేయకపోతే ఉద్యోగుల బదిలీలు కూడా చేపట్టడానికి వీలుపడని పరిస్థితి ఇపుడు నెలకొంది. 20కేటగిరీల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో చాలా కేటగిరీల్లోని ఉద్యోగులకు ప్రమోషన్ ఛానల్ కూడా ఏర్పాటు చేయలేదు. వీరికి పూర్తిస్థాయిలో సర్వీసు రూల్సు పొందుపరచకపోతే..వీరి సర్వీసు రిజస్టరులో ఉద్యోగ వివరాలు ఎక్కడ పనిచేశారో తెలియజేసే అంశాలు తప్పితే వీరికి ఐదేళ్లు, ఏడేళ్లు దాటిన తరువాత ఏ తరహా పదోన్నతులు వస్తాయనే విషయంలో ఇప్పటికీ ఎవ్వరికీ తెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంలో ఏదైనా ఒకప్రభుత్వ శాఖను కొత్తగా ఏర్పాటు చేస్తే ఉద్యోగ నియామకాలు చేపట్టే సమయానికే సర్వీసు రూల్సు, ఉద్యోగుల కేటగిరీ, ఉద్యోగుల తరగతి, ప్రమోషన్ ఛానల్, పొందుపరిచి దానికి ఇతర ప్రభుత్వశాఖల మాదిరిగా చట్టబద్దత తీసుకువస్తారు. విచిత్రంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఏర్పాటు చేసేసిన తరువాత ఒక్కో కేటగిరికి చెందిన ఉద్యోగికి ఒక్కోలా సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్ ఏర్పాటుచేస్తుండటం విశేషం.
ఏ ప్రభుత్వశాఖకైనా సదరుశాఖ ముఖ్యకార్యదర్శి, ఒక కమిషనర్, ఒక డైరెక్టర్, జిల్లాశాఖల అధికారులు ఉంటారు. కానీ సచివాలయశాఖలో 20శాఖల ఉద్యోగులు పనిచేయడంతో కలగూరగంపలా ఉన్న ఈశాఖ నిర్వహణ చేపట్టేందుకు ఒకసారి ముఖ్యకార్యదర్శి, మరోసారి డైరెక్టర్ లు తెరపైకి వస్తున్నారు. ఇంతమంది వచ్చి పరిపాలనను సాగిస్తున్నా..ఉద్యోగుల సంక్షేమం, వారి భవిష్యత్తును నిర్ణయించి సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్, జాబ్ చార్ట్ ను పూర్తిస్థాయిలో అమలు చేసే
విషయంలో మాత్రం నిర్ధిష్ట ఉత్తర్వులు మాత్రం జారీ చేయడం లేదు. ఉద్యోగులను 1996 ఏపీ సబార్డినేట్ సర్వీసు రూల్సు ప్రకారం ఉద్యోగాలను రెగ్యులర్ చేస్తు్న్నామని చెబుతున్న ప్రభుత్వం వీరికి పదోన్నతులు ఏవిధంగా చేపడుతుందనేది మాత్రం తేల్చడం లేదు. ఇప్పటికే ఉద్యోగులంతా సర్వీసులోకి వచ్చి మూడేళ్లు దాటిపోతున్నది. ఈశాఖకు, ఉద్యోగాలకు నేటికీ చట్టబద్దత లేదు, వచ్చే ప్రభుత్వంలో ఈ ఉద్యోగాలు ఉంటాయో..మరేదైనా శాఖలో విలీనం చేస్తారో తెలియని పరిస్థితి ఉద్యోగుల్లో నెలకొంది. ఇపుడు అదే విషయమై రాష్ట్రవ్యాప్తంగా చర్చనడుస్తున్నది కూడా. మరికొందరు ఎదుగూ బొదుగూ లేని ఈ ఉద్యోగాలు కాదని వేరే ఉద్యోగాలు వెళ్లిపోతున్నారు.
గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగుల పనితీరును గుర్తించేందుకు ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లును ఏర్పాటు చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం..నేటికీ ఉద్యోగుల పనితీరును పూర్తిస్థాయిలో గాడిలో పెట్టే అధికారాలు కనీసం ఎంపీడీఓలకు కూడా ఇవ్వలేదు. ఒకరకంగా చెప్పాలంటే సచివాలయాల్లో గ్రేడ్-5 సచివాలయ కార్యదర్శిలకు పనిలేదు.. అధికారాలూలేవు.. వీరిని అసలు ఏ తరహా విధులకు వినియోగిస్తారో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. వీరేం చేస్తున్నారో కనీసం జిల్లాల కలెక్టర్లు కూడా దృష్టి సారించడం లేదు. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టి ఫెర్మార్మెన్స్ ఇండికేటర్ల వలన ఉపయోగం ఏముంటుందో ప్రభుత్వానికే తెలియాలి. ఆది నుంచి ప్రభుత్వం ఇచ్చిన జాబ్ చార్టు ప్రకారం ఉద్యోగులతో పనిచేయిస్తే నేడు ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లు తీసుకొచ్చే పనిలేకుండా ఉండేది. ఆ పనిచేయకుండా సచివాలయ ఉద్యోగుల విషయంలో రోజు కొత్త విధానాలను తెరపైకి తీసుకు వస్తున్న ప్రభుత్వం..వారి ఉద్యోగాలు, సర్వీసు రూల్సు, పదోన్నతుల విషయంలో.. ఆ ఒక్కటీ అడక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. అటు ప్రతీసారి ప్రభుత్వం దగ్గరకి వినతి పత్రాలు పట్టుకొని తిరుగుతూ..అవకాశం వచ్చినపుడల్లా మీడియాలో పబ్లిసిటీ చేయించుకునే ఉద్యోగ సంఘాల నాయకులు సైతం ఉద్యోగుల ప్రమోషన్ ఛానల్, గ్రేడ్-5 కార్యదర్శిలకు అధికారాల బదలాయింపులు చేయని విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం లేదనే ఆరోపణలున్నాయి. ప్రభుత్వం ఈ ఫెర్మార్మెన్స్ ఇండికేటర్లను ఆదిలోనే తీసుకొచ్చి ఉంటే ఈపాటికి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగుల పనితీరు పూర్తిస్థాయిలో మెరుగుపడి ప్రజలకు మరింతగా సేవలు అందేవనే వాదన కూడా బలంగా వినపడుతోంది. ఏదిఏమైనా ప్రభుత్వం కొత్త ప్రభుత్వశాఖ ఏర్పాటు చేసినపుడు.. ఇతర ప్రభుత్వశాఖల ఉద్యోగుల మాదిరిగా ఈ శాఖలో కూడా విధానపరమైన అంశాలన్నీ అమలు చేసి ఉంటే ఈ ఇబ్బందులు వచ్చేవి కాదు. చూడాలి ఇకపైనా అన్ని చర్యల తోపాటు సర్వీసు రూల్సు, ప్రమోషన్ ఛానల్, ఈ శాఖకు చట్టబద్దత, ఈ శాఖ ద్వారా ఆదాయాన్ని మెరుగుపరిచే విధానాలను అమలుచేస్తుందా లేదా అనేది..!