గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫారం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సచివాలయ ఉద్యోగులు విధులకు యూనిఫారం ధరించి రాకపోతే అలాంటి వారిని ఇంటికి పంపనున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలను మొదటిసారిగా విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ.సూర్యకుమారి అమలుచేస్తున్నారు. మత్స్యశాఖలోని గ్రామీణ మత్స్య సహాయకులు విధులకు యూనిఫారం ధరించి రాకపోవడాన్ని సీరియస్ గా తీసుకున్న కలెక్టర్ వారికి షోకాజ్ నోటీసులు జారీచేశారు. ప్రభుత్వం ఉద్యోగుల గుర్తింపుకోసం ఖచ్చితంగా ధరించేలా ఇచ్చిన యూనిఫారం వేసుకోని మీపై ఎందుకు చర్యలు తీసుకోకూడదో చెప్పాలంటూ హెచ్చరించారు. షోకాజ్ నోటీసులు అందుకుకున్నవారు సహేతుకమైన కారణాలు చెప్పాలని అందులో పొందుపరిచారు. ఇప్పటికే చాలాసార్లు హెచ్చరికలు జారీచేసినా సచివాలయ సిబ్బందిలో మార్పు రాలేదని..ఇకపై ప్రభుత్వం స్వయంగా పంపిణీచేసిన యూనిఫారం సక్రమంగా ధరించాలని, లేనివారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గట్టిగా హెచ్చరించారు.
జిల్లాకలెక్టర్ ఏర్పాటుచేసిన సమీక్షాసమావేశానికి ప్రభుత్వం ఇచ్చినఫారంలో షర్టు ఒకటి, ఫ్యాంటు మరొకటి, మరికొందరు ఏకంగా యూనిఫారం లేకుండా వచ్చారు. దీనిపై కన్నెర్ర చేసిన కలెక్టర్ సమావేశంలోనే గట్టిగాహెచ్చరించారు. అసలు ప్రభుత్వం ఇచ్చిన యూనిఫారం ధరించడానికి ఎందుకు చిన్నతనంగా ఫీలవుతున్నారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత లక్ష్యంతో ప్రజలు, అర్జీదారులు ఉద్యోగులను గుర్తుపట్టాలనే ఉద్దేశ్యంతో ఇచ్చిన యూనిఫారం ధరించకుండా ప్రభుత్వాన్నే అవహేళన చేస్తున్నారని ఇది పద్దతి కాదని, ఇకపై అలాంటి వారిని ప్రత్యేకంగా గుర్తించాలని జిల్లా మత్స్యశాఖ ఉపసంచాలకులను ఆదేశించారు. గుర్తించిన వారందరికీ షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.
ఒక్క విజయనగరంలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అసలు సచివాలయ గ్రేడ్1 నుంచి గ్రేడ్-5 కార్యదర్శిల వరకూ ఎవరూ యూనిఫారం వేసుకొని రాకపోవడంతో, దానిని అలుసుగా తీసుకుంటున్న సిబ్బంది కూడా సివిల్ డ్రెస్సుల్లో వస్తున్నారు. ఈ విషయం ఎంపీడీఓలు గుర్తించినా వారు కూడా లైట్ తీసుకుం టున్నారు. ఒక్కోసారి డిఎల్పీఓ, డీపీఓ, ఇతర జిల్లాశాఖల ఉన్నతాధికారులు సచివాలయానికి వచ్చిన సమయంలోకూడా సిబ్బంది ధరించని యూనిఫారంపై ప్రశ్నించడం లేదు. షర్టు ఒకటి, ఫ్యాంటు మరొకటి వేసుకొనివచ్చినా ఎక్కడా ప్రశ్నించడం లేదు. ఆ మాటకొస్తే..ప్రభుత్వం ఎంతో నమ్మకం పెట్టుకున్న సచివాలయ ఉద్యోగులే ప్రభుత్వ ఆశయాన్ని, లక్ష్యానికి గాలితీసేస్తున్నారనే విషయం వీరుధరించే యూనిఫారమే తేటతెల్లం చేస్తున్నది. మరికొందరు ఒక అడుగు ముందుకేసి యూనిఫాం బ్యాండుమేళం బ్యాచ్చిలా ఉందని..అందుకనే వేసుకో బుద్ది కావడం లేదని..ఏం చేసుకుంటారో చేసుకోండి అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. జిల్లాకలెక్టర్లు కూడా ఈవిషయాన్ని పట్టించుకోకపోవడంతో వీరి యూనిఫారం ధారణ విషయంలో ప్రశ్నించే వారే కరువవుతున్నారు.
ప్రభుత్వ ఆదేశం ప్రకారం సచివాలయ ఉద్యోగులు సరైన, సక్రమమైన(ఫ్యాంటు ఓ రంగు, షర్టు ఓ రంగు కాదు) యూనిఫారం ధరించి మాత్రమే ధరించి విధులకు హాజరుకావాలి. అలా హాజరుకాని ఉద్యోగులకు జిల్లాశాఖల అధికారులు షోకాజు నోటీసులు ఇవ్వాలి. లేదంటే సదరు జిల్లాఅధికారులకు కలెక్టర్లు షోకాజ్
నోటీసులు జారీచేస్తారు..జిల్లా కలెక్టర్లు కూడా ఈ విషయాన్ని పట్టించుకోకపోతే వారిపై గ్రామ, వార్డు సచివాలయశాఖ ముఖ్యకార్యదర్శి, కమిషనర్, డైరెక్టర్
లతోపాటు ప్రభుత్వ ముఖ్యకార్యదర్శిల నుంచి షోకాజ్ నోటీసులొస్తాయి. ఈవిధంగా చేయడానికి ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళిక సిద్దం చేసింది. దానితో రాష్ట్రంలోని 26జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల యూనిఫాం విషయంలో ప్రభుత్వం ఆదేశాలు జారీచేసిన విజయనగరం జిల్లా కలెక్టర్ ముందు వరసులో నిలబడి ప్రభుత్వ లక్ష్యాన్ని అమలుచేస్తున్నారు. ఇదే ఇపుడు రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. చూడాలి విజయనగరం జిల్లాకలెక్టర్ ను ఆదర్శంగా తీసుకొని ఇతర జిల్లాల కలెక్టర్లు, 20శాఖల జిల్లా అధికారులు సచివాలయ సిబ్బందితో యూనిఫారం వేసుకొచ్చేలా చేయగలగుతారా..లేదంటే లైట్ తీసుకుంటారో..అనేది..!