ఉసూరుమంటున్న గ్రామ, వార్డు సచివాలయ వీఆర్వోలు


Ens Balu
743
Tadepalli
2023-02-03 02:55:59

భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏదోశాఖ ఉద్యోగులకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ప్రభుత్వం కావాలని చేస్తున్నదో..లేదంటే కొంతమేరకైనా జీతాల భారం తగ్గించుకోవాలని చేస్తున్నదో తెలీదు కానీ.. అరకొర జీతాలతో వీఆర్ఏ నుంచి వీఆర్వోలుగా పదోన్నతులు పొంది జిల్లాకాని జిల్లా..ప్రాంతం కానీ ప్రాంతాలో బతుకు బండి ఈడ్చేలా చేస్తున్నది. రెండున్నరేళ్లు గడిచిపోతున్నా రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామ, వార్డు సచివాలయాల్లో 3572 మంది వీఆర్వోలు ప్రభుత్వం ప్రకటించిన రూ.15వేల జీతంతోనే బ్రతుకుతున్నారు. గతంలో సచివాలయ ఉద్యోగులకు జరిగిన అన్యాయమే ఇపుడు పదోన్నతి పొందిన వీఆర్ఏలను కూడా వెంటాడుతోంది. ప్రభుత్వం ప్రతిపాదించిన రెండు రకాల టెస్టులు(కంప్యూటర్ ఎఫిషియన్సీ టెస్టు, సర్వే టెస్టు) పాసైతే తప్పా వీరి సర్వీసులు రెగ్యులర్ చేసేది లేదని మెలిక పెట్టింది. దీనితో వీఆర్వోలు అంతా కంప్యూటర్ ఎఫియన్సీ టెస్టులో పాసైయ్యారు. తీరా సర్వే టెస్టులో మాత్రం 1850 మంది పాసైతే 1722 మంది ఫెయిల్ అయ్యారు. ఫెయిల్ అయిన వారికి ప్రభుత్వం మళ్లీ వెంటనే పరీక్ష పెట్టడం మానేసింది.

వీఆర్ఏ నుంచి విఆర్వోగా పదోన్నతలు ఇచ్చిందని ఆనందపడాలో లేదంటే వచ్చిన ఉద్యోగం ప్రభుత్వం పెట్టే టెస్టుల్లో పాస్ కానందుకు వారి సర్వీసులు రెగ్యులైజేషన్ కి నోచుకోలేదని బాధపడాలో తెలియని పరిస్థితి నెలకొంది. వీరు కూడా సాధారణ వీఆర్వోలు మాదిరిగానే అన్నిపనులూ చేస్తున్నారు. విధుల్లోకి చేరిన తరువాత ఆరు నెలల్లో రెండు రకాల పరీక్షలు పెడతామని చెప్పిన ప్రభుత్వం రెండేళ్ల వరకూ వీరికి పరీక్షలు పెట్టలేదు. దీనితో వీరంతా ఒక పరీక్షలో పాసై మరో పరీక్షలో ఫెయిల్ అయ్యారు. మొత్తం పదోన్నతి పొందిన వీఆర్వోలందరికీ రెండు పరీక్షలు పాసైన తరువాతే సర్వీసులు రెగ్యులర్ చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తున్నది. దీనితో వీరంతా తీవ్రఆందోళన చెందతున్నారు. ప్రభుత్వం తక్షణమే మరోసారి సర్వే  పరీక్ష నిర్వహించి తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే రూ.15 వేల జీతంతో కుటుంబాలను పోషించుకోవడానికి, తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. ఉన్న కాస్తంత జీతంలోనే మండలకేంద్రాలకు తరచూ తిరగడం, శిక్షణలకు, ప్రత్యేక సమావేశాలకు  జిల్లా కేంద్రాలకు వెళ్లడంతోనే వచ్చిన జీతం మొత్తం ఆవిరైపోతుందని కన్నీటి పర్యంతం అవుతున్నారు. తమను విధుల్లోకి తీసుకున్నవెంటనే రెండేళ్లలోనే పరీక్షలు పెట్టివుంటే ఫెయిల్ అయినవారంతా మరోసారి పరీక్షలు రాసి ఉత్తీర్ణత సాధించడానికి అవకాశం ఉండేదని వాపోతున్నారు.

ప్రభుత్వం తక్షణమే ఫెయిల్ అయినవారికి పరీక్ష పెట్టాలని లేనిపక్షంలో ప్రస్తుతం సచివాలయ ఉద్యోగులకు ఇచ్చేపేస్కేలు అయినా వర్తింపచేయాలని వీఆర్వోలంతా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా వీఆర్వోల జాబ్ చార్టు మార్చిన తరుణంలో విధినిర్వహణలోనే క్యాంపులకు ఎక్కువగా తిరగాల్సి వుంటుందని, ప్రభుత్వం ఇచ్చే జీతంతో కుటుంబాలనే పోషించుకుంటామా..లేదంటే ప్రభుత్వం అప్పగించిన పనులకు క్యాంపులకే తిరుగుతామా అని ప్రశ్నిస్తున్నారు.  
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 3572 మంది వీఆర్వోలు ఇదే ఆర్ధిక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నామని ఆవేదన చెందుతున్నారు. తమ గోడు వినే నాధుడే ప్రభుత్వంలో కరువయ్యాడని అంటున్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఉద్యోగులకు నెలాఖరున జీతబత్యాలు ఒకటవ తేదీ నాటికి ఇవ్వడం లేదు. ఉన్న వీరిందరికీ సర్వీసులు రెగ్యులర్ చేస్తే ప్రభుత్వంపై మరింత ఆర్ధిక భారం పడుతుందనే కారణంతోనే వీరికి పెట్టాల్సిన పరీక్షలు సకాలంలో నిర్వహించకుండా తాత్సారం చేస్తున్నదనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పదోన్నతి పొందిన వీఆర్వోలకు డిపార్ట్ మెంట్ పరీక్ష నిర్వహించి వారి సర్వీసులు రెగ్యులర్ చేస్తే తప్పా ప్రభుత్వ ప్రాధాన్యత భూముల రీ-సర్వేలో వీరంతా పూర్తిస్థాయిలో పాల్గొనే అవకాశం లేదు. చూడాలి ప్రభుత్వం ఈ వీఆర్వోల విషయంలో ఏం చేస్తుందనేది..!