నెలాఖరు వరకు శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచేదిలేదు
Ens Balu
2
Tirumala
2020-07-04 19:43:18
దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనానికి సంబంధించి రోజువారీ భక్తుల సంఖ్యను ఈ నెలాఖరు వరకు పెంచకూడదని నిర్ణయం తీసుకున్నట్టు టిటిడి ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి.సుబ్బారెడ్డి చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిబంధనలకు అనుగుణంగా జూన్ 8వ తేదీ నుంచి శ్రీవారి దర్శనం తిరిగి ప్రారంభించామని తెలిపారు. స్వామి దర్శనానికి వచ్చిన ఏ ఒక్క భక్తుడికీ కరోనా పాజిటివ్ రాలేదని స్పష్టం చేశారు. భక్తుల కోరిక మేరకు ఆన్‌లైన్ ద్వారా స్వామివారి కల్యాణోత్సవం సేవ ప్రారంభించే విషయం గురించి అర్చకులతో చర్చించి తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. తిరుమల అన్నమయ్య భవన్‌లో శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ధర్మకర్తల మండలి అత్యవసర సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఈవో అనిల్‌కుమార్ సింఘాల్, అదనపు ఈవో ఎవి.ధర్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.