ఇక గ్రామ, వార్డు సచివాలయాల్లో అన్నీ ఉచితమే..!


Ens Balu
79
Amaravati
2023-06-21 03:19:42

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయంతీసుకుంది.. రాష్ట్రవ్యాప్తంగా 26 జిల్లాల్లోని 14వేల 5 గ్రామవార్డు సచివాలయాల ద్వారా అందించే సేవలను ఉచితంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. జూన్ 23న ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనుంది. కేవలం నాలుగు వారాల పాటు ఈ ఉచిత సేవలు కొనసాగుతాయి. దానికోసం సచివాలయశాఖలోని సాఫ్ట్ వేర్ ను, వెబ్ సైట్ ను అప్ డేట్ చేస్తున్నారు. భారతదేశంలోనే ప్రపధమంగా గ్రామ, వార్డు సచివాలయశాఖను ఏర్పాటు చేసి ప్రజల ఇంటి ముంగిటకే సేవలు అందించడకోసం దీనిని ఏర్పాటు చేసినా..ఇక్కడ అందించే సేవలపై ఉద్యోగులే సరైన అవగాహన ప్రజలకు కల్పించేవారు కాదు. అటు రాష్ట్ర అధికారులు, జిల్లాల్లో కలెక్టర్లు పదే పదే ఆదేశించినా సిబ్బంది వాటిని పెడచెవిన పెట్టేవారు. అయితే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా గ్రామ, వార్డు సచివాలయాల సేవలు రాష్ట్రంలోని ప్రజలందరికీ తెలిసే సౌలభ్యం కలిగింది. ఇక్కడి నుంచి జారీచేసే కుల, నివాస, జనన, మరణ, వివాహ, మ్యూటేషన్, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు ఇలా అన్ని సేవలనూ ఉచితంగానే చేయనున్నట్టు ప్రకటించింది. ఈ విధంగా చేయడంతో ఒక్కసారిగా ప్రజలు ఏపని కావాలన్నా సచివాలయాలకే వెళ్లే పరిస్థితి వస్తుంది. ఇటు జిల్లా అధికారులకు, అటు రాష్ట్ర అధికారుల ద్వారా సమన్వయంతో ప్రజల వద్దకే సచివాలయ సేవలను తీసుకెళ్లాలని భావించిన ప్రభుత్వానికి ఫలితాలు తక్కువగానే వచ్చాయి. అదే సమయంలో సచివాలయ సేవలపై అవగాహన కూడా రాలేదు. ఒక్కసారిగా సేవలన్నీ ఉచితం అనేసరికి ఇపుడు ఏపని కావాలన్నా అంతా సచివాలయాల వద్దకే పరుగులు పెట్టే పరిస్థితిని తీసుకొచ్చింది వైఎస్సార్సీపీ ప్రభుత్వం.

ఉద్యోగుల అవినీతికి చెక్ పెడుతూ పర్యవేక్షణ..
ఒకప్పుడు  కుల, నివాస, జనన, మరణ, వివాహ, మ్యూటేషన్, ఆధార్ అప్డేట్, రేషన్ కార్డు ద్రువీకరణ పత్రాలు పొందాలంటే మండల కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వచ్చేది. అంతేకాకుండా అక్కడ సిబ్బందికి, అధికారులకి మామూళ్లు ముట్టజెబితే వారికి తీరిక సమయాల్లో ద్రువీకరణ పత్రాలు మంజూరు చేసేవారు. గ్రామ, వార్డు సచివాలయాలు వచ్చిన తరువాత చాలా వరకూ అవినీతికి అడ్డుకట్ట పడింది. అయినప్పటికీ చాలా మంది సచివాలయ, రెవిన్యూ ఇతర శాఖల ఉద్యోగులు అవినీతికి పాల్పడుతూనే ఉన్నారు. వీరందరినీ ఒకేసారి దారిలోకి తేవాలంటే సేవలన్నీ ఉచితం చేసి వాటిపై పర్యవేక్షణ చేపడితేనే దారిలోకి వస్తారని భావించిన ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయాన్ని తీసుకుంది. ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ద్రవీకరణ పత్రాలు సచివాలయాల నుంచి ప్రజలకు చేరాలి. ఉచితంగా అందించే ఈ సేవలపై ఏ ఒక్క ఉద్యోగి అయినా లంచాలకు కక్కుర్తి పడితే సదరు ఉద్యోగిపై కఠిన చర్యలు తీసుకుంటారు. అంతేకాకుండా మండల అధికారుల నుంచి జిల్లా కలెక్టర్ వరకూ ఈ శాఖకు అనుబంధంగా ఉన్న అధికారులంతా నిత్యం సచివాలయాలను సందర్శిస్తూ ఇక్కడ అందే సేవలపై ప్రభుత్వానికి నివేదిక పంపనున్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సచివాలయాల సేవలు ఉచితంగా అందడంతోపాటు, నాలుగు వారాలు ఇక్కడి సేవలపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన వస్తుంది. అటు మీసేవ కార్యకలాపాలకు కూడా పూర్తిగా అడ్డుకట్ట పడుతుంది. అక్కడ డబ్బులిచ్చి పనిచేయించుకోలేనివారంతా సచివాలయాల ద్వారా ఉచితంగానే సేవలు పొందడానికి వీలుపడుతుంది. అయితే ప్రభుత్వ నిర్ణయం కొంతమేరే ఉండటం..ఇదంతా ఎన్నికల స్టంట్ అని ప్రతిపక్షాలు కొట్టి పడేస్తున్నాయి. ఇది కూడా 
జియో ఫ్రీ సిమ్ లానే ఉంటుందని అందరికీ అలవాటైన తరువాత మళ్లీ రేటు పెడతారనే ప్రచారమూ అపుడే సోషల్ మీడియాలో ప్రచారం మొదలైపోవడం 
విశేషం. చూడాలి ఏం జరుగుతుందనేది.!

సిఫార్సు