ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏశాఖ ఉద్యోగులకు జరగని విధంగా గ్రామ, వార్డు సచివాలయశాఖ ఉద్యోగులకు వింత వింత అనుభవాలు ఎదురవుతున్నాయి. ప్రకటించిన తేదీకి అభ్యర్ధన బదిలీల ప్రక్రియ జరగకపోవడం.. జరిగే సమయానికి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఉద్యోగులకు తరువాత చేపడతామని వారికి ఇంటికి పంపడం.. ఆ తరువాత జిల్లాల్లోనే కౌన్సిలింగ్ లు చేపట్టడం అన్నీ జరిగిపోయాయి. ఇంత వరకూ బాగానే ఉన్నా చాలా జిల్లాల్లో కౌన్సిలింగ్ తరువాత ఉద్యోగు జాయిన్ అవ్వాల్సిన సచివాలయాలకు నియామక ఉత్తర్వులు నేటికొచ్చి జారీచేయలేదు. పైగా ఏ సచివాలయానికి ఏ ఉద్యోగి వెళుతున్నారో చెప్పే జాబితాను కూడా సదరు సచివాలయాల్లో నోటీసు బోర్డులో పెట్టిస్తామన్న ఉత్తర్వులు కూడా అమలుకాలేదు. ఇక అంతర్ జిల్లాలకు బదిలీలు, పరస్పర బదిలీల కోసం దరఖాస్తులు పెట్టుకున్నవారు ఎప్పుడు కౌన్సిలింగ్ జరుగుతుందో తెలీక వేచిచూస్తున్నారు. ముఖ్యంగా గ్రామ, వార్డు సచివాలయశాఖలో సుమారు 19 ప్రభుత్వశాఖలు మిలితమై ఉండటం ఆ శాఖలకు సంబంధించిన రాష్ట్ర అధికారులకు మధ్య పరస్పర సహకారం, సమాచారం పూర్తిస్థాయిలో లేకపోవడంతో ఆ ప్రభావం ఉద్యోగులపై పడుతున్నది.
సచివాలయ ఉద్యోగులకు సంబంధించిన అభ్యర్ధ బదిలీల ప్రక్రియకు గ్రామ, వార్డు సచివాలయశాఖ డైరెక్టర్ ప్రత్యేకంగా ఉత్తర్వులు జారీచేశారు. కానీ దానిప్రకారం ఎక్కడా జరగకపోవడం విశేషం. అసలు ఉద్యోగుల కౌన్సిలింగ్ కి సంబంధించినంత వరకూ ఇచ్చే ఉత్తర్వులు ఒకటి.. తీరా ఆతేదికి అక్కడికి చేరుకుంటే జరిగేది మరొకటి అవుతున్నది. ఇప్పటివరకూ ప్రభుత్వ ఉద్యోగుల కౌన్సిలింగ్ అంటే అది జరిగిన వెంటనే కేటాయించిన ప్రదేశానికి బదిలీలు చేసిన నియామక ఉత్తర్వులు అక్కడే ఇచ్చేసేవారు. కానీ సచివాలయ ఉద్యోగులకు మాత్రం వింత అనుభవం ఎదురైంది. కౌన్సిలింగ్ పూర్తయినా చాలా మందికి కేటాయించిన ప్రదేశాలకు సంబంధించి నియామక ఉత్తర్వులు నేటికీ అందలేదు. దీనితో కొందరు కేటాయించిన ప్రదేశాలు నచ్చక.. పాతప్రదేశాల్లోనే ఉండిపోయేందుకు నిర్ణయించుకొని జిల్లాశాఖల కార్యాలయాలకు తిరుగుతున్నారు. అయితే వారికి కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకపోవడంతో కొన్నిరోజులు వేచి ఉండాలనే సమాధానం మాత్రం చెబుతున్నారు. దీనితో తమ పరిస్థితి ఏమిటో తమకే అర్ధం కావడం లేదని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు. సచివాలయ ఉద్యోగులకు జరిగిన కౌన్సిలింగ్ కు సంబంధించి వచ్చిన ఉత్తర్వులు, తరువాత జరిగిన విధానం, ఆపై కేటాయించిన ప్రదేశాల్లోకి వెళ్లి జాయిన్ కావడానికి నియామక పత్రాలు ఇవ్వకపోవడాన్ని ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులు కూడా వింతగానే పరిగణిస్తున్నారు.
జిల్లాల పరిధిలో కౌన్సిలింగ్ లు పూర్తయినందున ఇక పరస్పర బదిలీలు, అంతర్ జిల్లాల బదిలీలకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రక్రియ ఉండకపోవచ్చునని, వారికి కేటాయించిన ప్రదేశాలకు సంబంధించి వారి మాత్రుశాఖల అధికారులు ఆన్ లైన్ లో ఉత్తర్వులు పంపిస్తారనే ప్రచారం కూడా జరుగుతున్నది. ఇలాంటి గందరగోళ పరిస్థితుల మధ్య ఇంకా కౌన్సిలింగ్ ప్రక్రియ జరగని ఉద్యోగులకు తమకు ఎక్కడ అన్యాయం జరుగుతుందోనని ఆవేదన చెందుతున్నారు. వారి జిల్లాశాఖల కార్యాలయాలకు సమాచారం కోసం ప్రయత్నించినా..రాష్ట్ర కార్యాలయం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకుండా తాము మాత్రం ఏం చేయగమని ఆ చిరాకంతా ఉద్యోగులపై ప్రదర్శిస్తుండటం విశేషం. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జిల్లాశాఖల ఉద్యోగులు కౌన్సిలింగ్ పూర్తయిన అభ్యర్ధులకు వెంట వెంటనే నియామక పత్రాలను జారీచేసి ఉద్యోగులు ఇబ్బంది పడకుండా పక్కాగా ఏర్పాట్లు చేశారు. కొన్ని జిల్లాల్లో మాత్రం తీరా కౌన్సిలింగ్ అయ్యే సమయాన్ని 2రోజుల ముందు ప్రకటించి, ఉద్యోగులు వచ్చేసిన తరువాత వారికి మళ్లీ ఎప్పుడు కౌన్సిలింగ్ పెడతామో చెబుతామని ప్రకటించడంతో సదరు అంతర్ జిల్లాలకు దరఖాస్తు చేసుకున్నవారంతా ఉసూరు మంటూ వెనుతిరగాల్సి వచ్చింది. మరికొందరు ఇప్పటి వరకూ సెలవులపైనే దరఖాస్తు చేసుకున్న జిల్లాల్లోనే ఉండిపోయారని సమాచారం అందుతుంది. ఈగందగోళ పరిస్థితిపై ప్రభుత్వం నిర్ధిష్ట ప్రకటన చేయకపోవడం వలన ఉద్యోగులు అయోమయ స్థితిలోకి వెళ్లిపోతున్నారు. ఇప్పటికైనా కౌన్సిలింగ్ పూర్తయిన వారికి నియామక పత్రాలు, ఇంకా కౌన్సిలింగ్ జరగని వారికి తేదీల ప్రకటన, లేదంటే ఆన్ లైన్ లోనే చేస్తామన్న విషయాన్ని కూడా ప్రభుత్వం ప్రకటించాలని ఉద్యోగులు కోరుతున్నారు..!